.. శ్రీకాళహస్తిలో జరుగుతున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మ వార్లు నంది, సింహ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన మహాశివరాత్రి సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా గంగాదేవి సమేతుడైన సోమస్కంద మూర్తి నంది వాహనం పైన, జ్ఞానప్రసూనాంబ సింహ వాహనంపై ఊరేగి భక్తులను కరుణించారు. సాధారణంగా నంది వాహనంపై ఊరేగే పరమ శివుడిని దర్శిస్తే ముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే మహా శివరాత్రి రోజు దర్శిస్తే మరింత పుణ్యమని నమ్ముతారు భక్తులు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నంది వాహన సేవ ప్రమథ గణాలు వెంట రాగా గంగాదేవి సమేతుడైన సోమస్కంద మూర్తి నంది వాహనంపై ఊరేగారు. అమ్మ వారు సింహ వాహనంపై ఊరేగి భక్తులకు నయనానందం కలిగించారు. భక్తుడైన నందిని అనుగ్రహించి తన వాహనంగా చేసుకున్నాడు పరమేస్వరుడు. ముందుగా నందిని దర్శించి ఆ తర్వాత స్వామిని దర్శించాలని పురాణాలు కూడా చెబుతున్నాయి. అటువంటి ఉన్నతమైన నంది వాహనంపై ఊరేగిన స్వామివారిని దర్శించి భక్తులు పులకించి పోయారు. సింహ వాహనంపై అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ ఊరేగగా భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
No comments:
Post a Comment