Monday, 21 September 2020

ఈశ్వరునికి మారేడు దళం ప్రీతి కరం

మహాశివుడికి మారేడు దళాలంటే మహా ఇష్టం. అందుకే మారేడును ''శివేష్ట'' అని అంటారు. మారేడును బిల్వ అని కూడా అంటారు. బిల్వం అంటే శ్రీఫలము. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలములు ఇచ్చేది, ఇంకా సిరిని తెచ్చే ఫలము కలది అని అర్ధం. మారేడు మహా మంగళకరమైనది. మారేడు పత్రాలు త్రిశిఖలా ఉంటాయి. మూడు ఆకులతో ఉన్నందున త్రిశూలానికి సంకేతంగా భావిస్తారు.

ఈశ్వరారాధనలో మారేడు దళాలను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మారేడు దళాలతో పూజిస్తే శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, పూజలో ఎంత ఎక్కువ బిల్వ పత్రాలు వాడితే అంత ఎక్కువ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తాడని, మోక్షం కూడా ప్రాప్తిస్తుందని వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. కనుకనే శివపూజలో బిల్వ పత్రాలు విస్తృతంగా ఉంటాయి. కొందరు లక్ష బిల్వ పత్రాలతో, మరికొందరు ఏకంగా కోటి బిల్వ పత్రాలతో శివుని ఆరాధిస్తారు. సర్వ శుభాలూ చేకూర్చి, మోక్షాన్ని ప్రసాదిస్తుంది కనుక బిల్వ వృక్షాన్ని దైవంతో సమానంగా కొలుస్తారు.

పూజలు, పునస్కారాల్లో పూవులతో బాటు కొన్ని ఆకులను ఉపయోగిస్తారు. వాటిల్లో బిల్వ పత్రం ప్రధానమైంది, శ్రేష్ఠమైంది. ఇది కేవలం ఆచారం కాదు. బిల్వ పత్రాలతో పూజించడం వెనుక శాస్త్రీయత దాగి ఉంది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో మారేడు ఆకులను మించినవి లేవు. ఈ చెట్టు నుండి వచ్చే గాలి శరీరానికి సోకడం ఎంతో మంచిది. ఈ గాలిని పీల్చడంవల్ల మేలు జరుగుతుంది. జబ్బులు రావు. బాహ్య, అంతర కణాలు అశుద్ధం కాకుండా వుండేట్లు చేసి, దేహాన్ని శ్రేష్ఠంగా ఉంచుతుంది.

దేవాలయం గర్భగుడిలో గాలి సోకదు, సూర్యకిరణాలు ప్రసరించవు కనుక స్వచ్చత కోల్పోయే అవకాశం వుంది. అలాంటి వాతావరణంలో మారేడు ఆకులు స్వచ్చతను కలుగచేస్తాయి. అది మారేడు విశిష్టత. సూర్యుడిలో ఉండే తేజస్సు మారేడులో ఉంటుంది. శరీరం లోపలి భాగాల్లో, బయట వాతావరణంలో ఎక్కడ చెడు ప్రభావం ఉన్నా, దాన్ని హరించి మెరుగుపరచడమే మారేడు లక్షణం.

బిల్వ దళాల్లో తిక్తాను రసం, కషాయ రసం, ఉష్ణ వీర్యం ఉంటాయి. మారేడు అరుచిని పోగొడుతుంది. జఠరాగ్నిని వృద్ది చేస్తుంది. వాత లక్షణాన్ని తగ్గిస్తుంది. మలినాలను పోగొడుతుంది. శ్లేష్మాన్ని, అతిసారాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధమైన వ్యాధులను తగ్గిస్తుంది.

ఇప్పుడు మారేడులోని ఏయే భాగాలు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం.

--> బిల్వ పత్రాలను నూరి రసం తీసి, శరీరానికి పూసుకుంటే చెమట వాసన రాదు.
--> మారేడు వేళ్ళ కషాయం మూలశంక వ్యాధితో బాధపడుతున్నవారికి బాగా పనిచేస్తుంది.
--> మారేడు వేళ్ళతోతో చిక్కటి కషాయంచేసి మూలాలను తడిపినట్లయితే, వ్యాధి నయమౌతుంది.
--> ఎండిన మారేడుకాయల్ని ముక్కలు చేసి, కషాయం కాచి సేవిస్తే జ్వరం తగ్గుతుంది.
--> మారేడు వేరు రసం తీసి, తేనెతో రంగరించి తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి. ఈ ఔషధాన్ని రోజూ సేవిస్తూ ఉంటే ఎలాంటి అనారోగ్యాలూ కలగవు.
--> బిల్వపత్రాలను దంచి కళ్ళపై లేపనంలా రాసుకుంటే కంటి దోషాలు ఏమైనా ఉంటే నశిస్తాయి.
--> ఇలా మారేడు ఆకులు, కాయలు, వేళ్ళు చెట్టులోని ప్రతి భాగం శరీరానికి మేలు చేస్తుంది. వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే ఈ చెట్టు దైవంతో సమానం.

Saturday, 12 September 2020

మనదేవాలయాలు రహస్య

🌹🌹


చిదంబర రహస్యం అంటే ఏమిటి.............!!

పృధ్వి, అగ్ని, వాయువు, తేజస్సు , ఆకాశ లింగాలను పంచభూతలింగాలు అని అంటాము. వాటిలో ఆకాశలింగం చిదంబరంలో ఉంది.ఈ దేవాలయంలో లింగం వెనుక ఒక పరదా కట్టి ఉంటుంది. ఆ వెనుక ఏమీ ఉండదు. అంతా ఖాళీ. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగా ఉంటుంది. అలాగే, ఈ పరదా వెనుక ఏమీ ఉండకపోయినా పరదా కడతారు. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని , అసలు తెలియకుండా దాచి పెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనటం పరిపాటి అయింది.

 పూర్వీకులు అప్ప‌ట్లోనే ఎటువంటి సాంకేతిక సాధనాలు లేకుండానే భూమి అయ‌స్కాంత‌ క్షేత్రం క‌నుక్కున్నారు.... స‌రిగ్గా‌ న‌ట‌రాజ‌ స్వామి బొట‌న‌వేలు కింద‌ ఈ భూమి అంతటికీ అయ‌స్కాంత‌ క్షేత్రానికి కేంద్ర‌ బిందువు ఉంటుంది.ఈ విష‌యాన్ని ప్ర‌సిద్ద‌ త‌మిళ‌ స్కాల‌ర్ "తిరుమూల‌ర్" తన‌ గ్ర‌థం "తిరు మందిరం"లో చెప్పారు.

" పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి , ఆకాశమూ , వాయువూ , నీరు , అగ్ని లలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ , కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ , కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వి ( భూమికి ) కి ప్రతీక అనీ అంటారు .

అయితే ఇక్కడ విచిత్రమైన అద్భుతం ఏమిటంటే.......!
ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి . 
అవునండీ ! అవును ..... 79డిగ్రీల 41 నిముషాల రేఖాశం మీద ఉన్నాయి . 
ఇది ఆశ్చర్యం కదూ !

చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి . మానవుడికి నవ ( 9 ) రంధ్రాలు ఉంటాయి

చిదంబరం దేవాలయంలో పైన 21600 బంగారపు రేకులు తాపడం చేశారు . మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు . ( 15 x 60x 24 = 21600 ) 

ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72000 బంగారపు మేకులు వాడారు . మన శరీరం లో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదం చెబుతుంది .

దేవాలయం లో " పొన్నాంబళం " కొంచెం ఎడమవైపుకు ఉంటుంది . అది మన హృదయ స్థానం . అక్కడకి వెళ్ళడానికి " పంచాక్షర పడి " ఎక్కాలి . 
అది న + మ + శి + వ + య . పంచాక్షరి ని సూచిస్తుంది.
" కనక సభ " లో 4 స్తంబాలు 4 వేదాలకు ప్రతీకలు 

పొన్నాంబళం లో 28 స్థంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు - శివారాధనా పద్ధతులు . ఇవి 64 ఇంటూ 64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇది . అంతే కాదు అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు.

9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు . 
అర్ధ మంటపం లోని 6 స్తంబాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు .
ప్రక్కన ఉన్న మంటపం లోని 18 స్తంబాలూ 18 పురాణాలకి ప్రతీకలు 
ఇదే విష‌యాన్ని సాంకేతిక పరిజ్ఞానం ఉప‌యోగించి క‌నుక్కోవ‌డానికి 8 సంవ‌త్స‌రాలు ప‌ట్టింది.....చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి(centre of earth magnitic field) మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం పాశ్చాత్య శాస్త్రవేత్తలు తేల్చి చెప్పేసారు.

నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ గా అభివర్ణించారు.
 సైన్స్ ఇప్పుడు ప్రచారం చేస్తున్నది హిందూ మతం వేల సంవత్సరాల క్రితం పేర్కొంది!
హిందూ ధర్మం ఒక మతం కాదు. ఇది సనాతన ధర్మ జీవనవిధానం అని 

1.పృథ్విలింగం:

ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం:

ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:-

ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం:

తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం:

ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.

    🌹

Monday, 7 September 2020

మహిమాన్విత దేవాలయాల వివరణ.


సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు.
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా.

*నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు:* 
1. మహానంది
2. జంబుకేశ్వర్ 
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్ 
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా

*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.* 
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  
3. మంజునాథ్.
*శ్వాస తీసుకునే* కాళహస్తీశ్వర్
*సముద్రమే వెనక్కివెళ్లే* 
1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 
2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.
*స్త్రీవలె నెలసరి* అయ్యే 
1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  
2. కేరళ దుర్గామాత.
*రంగులు మారే ఆలయం.* 
1. ఉత్తరాయణం,  దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు* 
 1. కాణిపాకం,  
2. యాగంటి బసవన్న,  
3. కాశీ తిలభండేశ్వర్,  
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి

*స్వయంభువుగా* 
సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.
*ఆరునెలలకు ఒకసారి తెరిచే* 
1. బదరీనాథ్,  
2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
3. గుహ్యకాళీమందిరం. 

*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు* 
హాసంబా దేవాలయం,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

*12 ఏళ్లకు ఒకసారి*
పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్,  హిమాచల్ ప్రదేశ్.

*స్వయంగా ప్రసాదం* 
1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం

*ఒంటి స్తంభంతో*
యుగాంతానికి గుర్తుగా  ఉండే పూణే కేధారేశ్వర్,  ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

*రూపాలు మారే*
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.

*నీటితో దీపం వెలిగించే* ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,  మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది,  ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.
*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు* 
1. హేమాచల నరసింహ స్వామి.
2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

*మనిషి వలె గుటకలు*  
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.

*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.* 

*ఛాయా విశేషం* 
1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
3. బృహదీశ్వరాలయం

*నీటిలో తేలే* విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ),  నేపాల్

*ఇంకా...* 
తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్,  కంచి, 
చిలుకూరి బాలాజీ,  పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం etc

*పూరీ* 
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి,  దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే  పూరి ప్రసాదం.

ఇవి నాకు తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి.

Saturday, 29 August 2020

ఏడుకొండలవాడా వెంకటరమణా..గోవిందా..గోవిందా అంటూ..


అ స్వామిని చూడటానికి ఎంతో ఆత్రుతగా వెళితే, ఆయన్ని చూసే సమయం చాలా తక్కువ దొరుకుతుంది. 
అలాంటి సమయంలో ఆయన వేసుకునే దండలు, ఎన్ని ఉన్నాయి అనేది చూడటానికి టైం దొరకదు.సమయం సరిపోదు. 

ఆ ఆపదమొక్కుల వాడిని, 
అనాధరక్షకుడిని చూస్తుంటే… 
కళ్ళనిండా ఆనంద బాష్పాలతో 
మనసు పొంగిపోతుంది. 
అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూల దండలు వేస్తారో తెలుసుందాం.

*1.శిఖామణి:*
శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది.

*2.సాలిగ్రామాలు:*
ఇవి రెండు మాలలు. 
ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది. 
శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు.

*3.కంఠసరి:*
ఈ దండ మూడున్నర మూరలు ఉంటుంది. 
మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదికి అలంకరింపబడే దండ బకటి.

*4.వక్ష స్థల లక్ష్మి:*
ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది. 
శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు రెండు దండలు.

*5.శంఖుచక్రం:*
శంఖుచక్రాలకు రెండు దండలు. 
ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది.

*6.కఠారి సరం:*
శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి రెండు మూరలు.

*7.తావళములు:*
రెండు మోచేతుల కింద, 
నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, 
మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ 
వేలాడ దీసే మూడు దండలు ఒకటి 
మూడు మూరలు ఉంటుంది. 
రెండవది మూడున్నర మూరలు ఉంటుంది. మూడవది నాలుగు మూరలు ఉంటుంది.

*8.తిరువడి దండలు:*
శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది.

ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, 
పైన తెలిపిన మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలలమాలతో అలంకరిస్తారు.

 శ్రీవారి ఆలయం చేరుకోవటానికి ఎన్ని నడకదారులు ఉన్నాయో తెలుసా ?

ప్రపంచంలో ఎక్కువ మంది హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ఏటా లక్షల సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు భక్తులు. కొండ మీద ఉన్న శ్రీవారికి దర్శించుకొనేందుకు భక్తులు సాధారణంగా నడక మార్గాన, టాక్సీలలో, జీపులలో మరియు బస్సులలో వెళుతుంటారు. చాలా మందికి తెలిసిన దారి అలిపిరి. కానీ ఎంతమందికి తెలుసు అలిపిరి కాకుండా ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయని ??

అలిపిరి - తిరుమల మెట్ల మార్గం !!

తిరుమలలో ఏడు కొండలు ఉన్నాయని తెలుసుకదా ? ఈ ఏడు కొండలు నడకదారి గుండా ప్రయాణిస్తే తిరుమల ఆలయానికి చేరుకోవచ్చు. ఇప్పుడు ఆ మార్గాల గురించే తెలుసుకుంటున్నాం ఇక్కడ.

మీకు తాళ్ళపాక అన్నమాచార్యులు గురించి తెలుసు కదా ? ఆయన గొప్ప వైష్ణవ భక్తుడు మరియు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి, మర్యాద, గౌరవం, ప్రేమ, వాత్సల్యం. ఆయన వ్రాసిన 32 వేల కీర్తనలలో వెంకటేశ్వరస్వామి కీర్తనలే ఎక్కువ. అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కిన మొట్టమొదటి భక్తుడు అన్నమాచార్యుల వారే.

అలిపిరి నుండి అన్నమాచార్యులు వెళ్లిన దారే మొదటి నుండి గుర్తింపు పొందినది. శ్రీవారి కొండకు చేరుకోవటానికి తక్కువ టైం పట్టే మార్గాలలో ఇది ఒకటి. ఈ దారే కాకుండా తిరుమల చేరుకోవటానికి అనేక దారులు ఉన్నాయి. అయితే సౌకర్యాలు అంతంత్రమాత్రమే.

మొదటి మెట్టు

శ్రీవారికి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 8 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది అలిపిరి. అలిపిరి అంటే 'ఆదిపడి' అనగా మొదటిమెట్టు అని అర్థం.

అలిపిరి

అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవటానికి గంటన్న సమయం పడుతుంది. దూరం 11- 12 KM లు ఉంటుంది.

రెండవ దారి

తిరుపతి కి 10 KM ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడికి 5 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి గుండా మూడు కిలోమీటర్లు నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. పట్టే సమయం గంట. చంద్రగిరి కోట నిర్మించిన తర్వాత ఈ దారి వెలుగులోకి వచ్చింది.
చంద్రగిరి కి 8 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. చంద్రగిరి రాజులు ఈ దారి గుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనేవారు.
కృష్ణదేవరాయలు చంద్రగిరి దుర్గం లో విడిది చేసి, ఈ మార్గం గుండా శ్రీనివాసుడిని ఏడు సార్లు దర్శించుకున్నాడని స్థానికులు చెబుతారు. ఇప్పటికీ కొండ పైకి కూరగాయలు, పాలు, పెరుగు, పూలు వంటివి ఇదే దారిలో చేరుస్తారు. స్థానికులకు తప్ప ఈ దారి గురించి బాహ్య ప్రపంచానికి తెలీదు.

మూడవ దారి

మూడవ దారి మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యాన కలదు. దీనికి మించిన దారి మరొకటిలేదు అంటారు పూర్వీకులు. కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు, ప్రకాశం నుండి వచ్చే భక్తులు ఈ దారి గుండా శ్రీవారి ఆలయం చేరుకుంటారు. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటుచేశారు.

*నాల్గవ దారి*

తిరుమల కొండకు పశ్చిమం వైపున కల్యాణి డ్యాం ... దానికి ఆనుకొని శ్యామలకోన అనే దారి ఉంది. రంగంపేట, భీమవరం వచ్చే భక్తులు ఈ దారిగుండా వెళుతారు.

నాల్గవ దారి

డ్యాం వద్ద నుండి దారి గుండా 3 కిలోమీటర్లు ముందుకు వెళితే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. డ్యాం నుండి తిరుమల మధ్య దూరం : 15 KM.

*ఐదవ దారి*

కడప బోర్డర్ లో చిత్తూర్ ఎంట్రెన్స్ వద్ద కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి తుంబురుతీర్థం --> పాపవినాశనం --> తిరుమల చేరుకోవచ్చు. తుంబురుతీర్థం, పాపవినాశనం మధ్య దూరం 12 KM.

ఆరవ దారి

అవ్వాచారి కొండ/ అవ్వాచారికోన దారి గుండా వెళితే కూడా తిరుమల కొండ చేరుకోవచ్చు. రేణిగుంట సమీపంలో కడప - తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉన్నది. ఇక్కడి నుండి లోయలో ఉన్న అవ్వాచారికోన దారి గుండా పడమరవైపుకి వెళితే మోకాళ్ళపర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.

ఏనుగుల దారి

ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి. పూర్వం చంద్రగిరి శ్రీవారి మెట్టు నుండి అవ్వాచారికోన వరకు దారి ఉండేది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గానే చేరవేసేవారు.

*తలకోన*

తలకోన నుండి కూడా తిరుమలకు దారి కలదు. జలపాతం వద్ద నుండి నడుచుకుంటూ జెండాపేటు దారిలోకి వస్తే ... మీరు తిరుమలకు చేరుకున్నట్లే. నడక మార్గం 20 కిలోమీటర్లు.

తిరుమలలో క్రీ.శ.1387 లో మోకాళ్ళపర్వతం వద్ద మెట్లు నిర్మించారు. విజయనగర రాజులు అలిపిరి - గాలి గోపురం మార్గం 15 వ శతాబ్దంలో వేశారు.

గాలిగోపురం నుండి కిందకు చూస్తే ..

అలిపిరి మెట్లు ఎక్కగానే గోపురం, కుమ్మరి దాసుని సారె, గజేంద్రమొక్షం, గాలిగోపురం వస్తాయి. అలానే ఇంకాస్త ముందుకు వెళితే గాలిగోపురం కనిపిస్తుంది. గాలిగోపురం నుండి కిందకు చూస్తే గోవిందరాజస్వామి, అలివేలుమంగమ్మ దేవాలయాలు , తిరుపతి పరిసరాలు అందంగా కనిపిస్తాయి.

ఆంజనేయస్వామి

గాలిగోపురం లోపలి వెళితే సీతారాముల ఆలయం, హనుమంతుని పెద్ద విగ్రహం, విష్ణుమూర్తి అవతారాలు తారసపడతాయి. దక్షిణంవైపు అడవిలోకి వెళితే ఘంటామండపం, నామాలగవి, అవ్వా చారి కోన కు వెళ్తుంటే అక్కగార్ల గుడి కనిపిస్తాయి. ఆతర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి మందిరం కలదు.

మోకాళ్ళ మిట్ట

మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక సారె పెట్టెలను గమనించవచ్చు. అది దాటితే లక్ష్మీనరసింహ ఆలయం వస్తుంది. అలానే ఇంకాస్త ముందుకు మండపాలను దాటుకుంటూ వెళితే శ్రీవారి ఆలయం కనిపిస్తుంది.

శ్రీవారి మెట్టు

శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం వద్ద కలదు. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీవారు, ఆయన భార్య పద్మావతి ఇక్కడే వివాహం చేసుకొని శ్రీవారి మెట్టు దారిలో కొండ పైకి వెళ్ళి వెలిశారు.

శ్రీవారి మెట్టు

తిరుపతికి శ్రీవారి మెట్టు కు మధ్య దూరం 15 కి.మీ. శ్రీవారి మెట్టు నుండి ఆలయానికి మధ్య 2500 - 2800 మెట్లు ఉన్నాయి. ఇవి ఎక్కటానికి పట్టే సమయం 1-2 గంటలు. ప్రతి 50/100 మెట్లకు నీటి సదుపాయాలు కలవు.

శ్రీవారి మెట్టు గుండా వెళితే 1000 వ మెట్టు వద్ద దివ్య దర్శనం టికెట్లు ఇస్తుంటారు. వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నవి 2000 మెట్ల దగ్గర స్టాంప్ వేసుకుంటే చెల్లుతాయి. 1100 మెట్ల వద్ద శ్రీవారి పాదాలు ఉన్నాయి.

మెట్ల దారిన వెళ్తున్నప్పుడు గుర్తించుకోవాల్సినవి

1. తిరుపతి బస్ స్టాండ్ నుండి ఉచితబస్సు సౌకర్యం ఉంది. 

2. శ్రీవారి మెట్టు కు వెళ్ళే మార్గంలోనే అలిపిరి వస్తుంది. అలిపిరి వద్ద లాకర్ సౌకర్యం ఉంది. శ్రీవారి మెట్టు వద్ద ఆ సౌకర్యం లేదు.

3.మెట్లమార్గం లో తాగునీటి సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. కనుక బాటిల్ తీసుకుపోవాల్సిన అవసరం లేదు. వీలైతే తినుబండారాలను తీసుకొని పోవచ్చు. కొండపైన, ఆలయ పరిసరాలలో ప్లాస్టిక్ వస్తువులు నిషేధo.

వసతి ససౌకర్యాలకు తిరుమల లో కొదువలేదు. ఉత్సవాలు, పండుగలు తప్పనిచ్చి మిగితా అన్ని దినాలలో బస దొరుకుతుంది. టిటిడి విశ్రాంతి గదులు, గెస్ట్ హౌస్ లు, సత్రాలు, లాంటి ఎన్నో వసతులు ఇక్కడ ఉన్నాయి. 
ఈసారి తిరుమలకు  పైన పేర్కొన్న దారుల గుండా వెళ్ళటానికి ప్రయత్నించండి.

Monday, 24 August 2020

ప్రాచీన గ్రంథాలలో సర్పాలు వాటి గురించి ఇచ్చిన సంపూర్ణ వివరణ - చికిత్సలు .



  సకల చరాచర సృష్టిలో సర్పాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటి గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీకు వాటిలోని రకాలు గురించి పూర్తిగా వివరిస్తాను.

               సర్పజాతులు ఈ ప్రపంచంలో రెండు  రకాలుగా ఉన్నాయి.       అవి 

 1 .  దివ్యములు ఇవి దేవతా సర్పములు .

 2 .  భౌమములు  ఇవి భూమి నందు ఉండునవి .

   దివ్యసర్పములు లలో భూమి యందు తిరిగే 
సర్పాలు , మండలీ సర్పములు , ఉపజాతి సర్పములు కూడా ఉండును.

  దివ్య సర్పములలో రకాలు  - 

   1 .  అనంతుడు.

    2 .  వాసుకి.

    3 .  తక్షకుడు.

    4 .  కర్కోటకుడు .

    5 .  పద్ముడు .

    6 .  మహాపద్ముడు .

    7 .   శంఖపాలుడు .

    8 .   కులికుడు . 

  దేవతాసర్పములకు ఉండు గుర్తులు  - 

      అనంతుడుకి ఫణాగ్రము నందు తెల్లటి పద్మాకారం గల తెల్లని చుక్కలు ఉండును.  కులికునికి శిరము నందు శంఖము వంటి చిహ్నము ఉండును. వాసుకి వీపు భాగంలో నల్ల కలువ వంటి గుర్తు ఉండును. కర్కోటకునికి మూడు నేత్రములు పోలిన చిహ్నం ఉండును. తక్షకుని కి పడగ యందు స్వస్తిక్ వంటి గుర్తు ఉండును. శంఖుపాలునికి వీపు నందు అర్ధచంద్ర త్రిశూలాకారం గల గుర్తు ఉండును. మహాపద్మునికి చిన్నచిన్న మణుల 
వంటి చుక్కలు ఉండును.పద్మునికి వీపు నందు ఎర్రని వర్ణం గల పంచ బిందువులు ఉండును. 

             పైన చెప్పిన గుర్తులను బట్టి అవి దేవతా సర్పములుగా గ్రహించవలెను.

  దేవసర్పములకు విషము ఎక్కువ ఉండు సమయములు  - 

      ఆది, సోమ , మంగళ, బుధ , గురు, శుక్ర , శని వారాల్లో పగలు సమయంలో దేవతా సర్పములకు విషం ఎక్కువ ఉండును. రాత్రి సమయంలో విషప్రభావం చాలా తక్కువ ఉండును. ఒక్క శనివారం రాత్రి సమయంలో మాత్రం విషప్రభావం ఎక్కువ ఉండును. ఈ సమయంలో మాత్రమే అనంతుడు వంటి దేవతా సర్పాలు కరుచును . 

  దేవతాసర్పముల యొక్క మహిమ  - 

      అనంత, వాసుకి , తక్షక జాతికి సంబంధించిన దేవతా సర్పాలు ఎనిమిది రకాల సర్పాలు కు జరామరణాదులు లేవు . వీటి విషం అత్యంత తీవ్రం అయినది. వీటి విషం నుంచి కాపాడే ఔషదం ఏమి లేదు . 

  భూమి యందు ఉండు సర్పముల భేదములు 
 

   1 - ఉపజాతి సర్పములు .

   2 -  దర్వీకరములు .

   3 -  మండలీ సర్పములు . 

   4 -  రాజీమంతములు .

           అను నాలుగు రకముల సర్పములు కలవు.

  భౌమ సర్పముల యొక్క లక్షణములు - 

    
       పడగలు గరిట వలే ఉండునవి దర్వీకరములు అనియు , శరీరం అంతయు రత్నాలతో కూడిన కంబళి వలే గాని చిత్రవిచిత్రమైన పొడలు కలిగి ఉండునవి మండలీ సర్పములు అని , శరీరం నందు సన్న చుక్కలు , రేఖలు ఊర్ధ్వంగా ఉండి తిర్యక్ అగ్రరేఖలు కలిగి చిత్రాకారంగా ఉండునవి రాజీమంతములు అని చెప్పబడును 

     ఉపజాతి సర్ప లక్షణములను విష లక్షణములను తరువాత వివరిస్తాను.

  మూడు రకాల సర్పాల విష గుణము  - 

      దర్వీకముల యొక్క విషము కొంచం వేడి కలిగి ఉండి కారముగా ఉండును. మండలీ విషము వేడిగా ఉండి పులుపు రుచి కలిగి ఉండును. రాజీమంత విషము చల్లగా ఉండి మధురముగా ఉండును. 

          పైన చెప్పిన రుచులను బట్టి ఆయా సర్పాలు కరిచినప్పుడు వాటి విషం శరీరం లో ప్రవేశించి వాతాదిదోషములను కలుగచేయును  . 

  మూడు రకాల సర్పములు యొక్క వాతదోషముల వివరములు  - 

 
      దర్వీకర జాతి సర్పములు  వాతోద్రేకం , మండలీ సర్పములు పిత్తోద్రేకం , రాజీమంత సర్పములు శ్లేష్మోద్రేకం కలిగి ఉంటాయి. 

  భూమి యందు ఉండు మూడు రకాల సర్పాల సంఖ్య  - 

 1 -  దర్వీకములు అనగా త్రాచుపాములు వీటిలో మొత్తం 14 రకాలు కలవు. 

 2 -  మండలీ సర్పములు అనగా పింజరలు వీటిలో మొత్తం 21 రకాలు కలవు. 

 3  - రాజీమంత సర్పాలు అనగా క్షుద్రజాతి సర్పాలు వీటిలో 36 రకాలు కలవు.

 భూమి ముందు ఉండు సర్పాలలో ప్రముఖమైనవి , ప్రమాదకరమైనవి త్రాచుపాములు ఇవి మొత్తం 14 రకాలు .  అవి 

   *  చింతపువ్వు వన్నె త్రాచు.

   *  నాగజెర్రి .

   *  రేలత్రాచు .

   *  నాగజెర్రి.

   *  సెనగపువ్వు త్రాచు.

   *  నల్లత్రాచు.

   *  అరికెవన్నె త్రాచు.

   *  కందిపొడల త్రాచు.

   *  మొగలిపువ్వు త్రాచు.

   *  తెల్ల త్రాచు.

   *  కోడె త్రాచు.

   *  గిరినాగు .

   *  నీరు త్రాచు .

   *  గోధుమ త్రాచు.

   *  రాచపాము 

          ఈ విధంగా 14 రకాలుగా త్రాచుపాములు ఈ భూమి యందు నివసించుచున్నాయి.

   ఇప్పుడు వీటి లక్షణాలు తెలియచేస్తాను .

 *  చింతపువ్వు వన్నె త్రాచు  - 

          దీని యొక్క శరీరం మంచి ఛాయతో ఉండి దీని యొక్క కోపం సాధారణంగా ఉండును. ఆదివారం నాడు దీని యొక్క విషతీవ్రత తీవ్రంగా ఉంటుంది.

 *  నాగజెర్రి  - 

           ఇది సగం త్రాచు వలే , సగం జెర్రిపోతు వలే ఉండును. చెట్లు , తోటల యందు , చెట్ల పై భాగంలో నివసించుతూ గోధుమవన్నే తెలుపురంగు కలిగి అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. దీనికి అత్యంత కోపం . సోమవారం నాడు విషాదిక్యత కలిగి ఉండును. నాగజెర్రిని త్రాచుపాముల జాబితాలోనే మన పూర్వికులు చేర్చారు .

 *  రేలత్రాచు  - 

            అడవుల యందు నివసించుట, సన్నంగా, పొడవుగా శరీరం కలిగి ఉంటుంది. సామాన్యమైన కోపం కలిగి ఉంటుంది.సోమవారం నందు దీనియొక్క విష తీవ్రత అధికంగా ఉంటుంది. 

 *  శెనగపువ్వు త్రాచు  - 

             ఇది శెనగ పువ్వు వర్ణం కలిగి ఉంటుంది. సువాసన గల ప్రదేశాలలో ఉంటుంది. సోమవారం నందు దీని యొక్క విషప్రభావం అధికంగా కలిగి ఉంటుంది.

 *  నల్లత్రాచు  - 

             నేరేడు పండు వర్ణం కలిగి ఉండి కొంచం తక్కువ పొడవు కలిగి ఉంటుంది. అత్యంత దుష్టత్వం , అత్యంత కోపం కలిగి ఉంటుంది. దీని విషం స్వచ్చంగా ఉంటుంది. పర్వతాలు, అడవుల యందు నివసిస్తుంది. మంగళవారం తీవ్ర విషాదిక్యత కలిగి ఉంటుంది.

 *  అరికెవన్నె త్రాచు  - 

             ఈ త్రాచు ఎక్కువుగా మనుష్యుల మల విసర్జణ చేసే ప్రదేశాలలో సంచారం చేయును . మలభక్షణం చేయును . అత్యధిక కోపం , స్వచ్చమైన గరళం కలిగి ఉండును. బుధవారం నందు తీవ్ర విషాదిక్యత కలిగి ఉండును. అరిక ధాన్యం వంటి వర్ణం కలిగి ఉంటుంది.

 *  కందిపొడల త్రాచు  - 

            కందికాయ మీద ఉండునట్టి పొడలు వలే దీని శరీరం పైన ఉంటాయి. సామాన్యం అగు కోపం కలిగి ఉంటుంది.బుధవారం నందు దీని విషతీవ్రత అధికంగా ఉండును. 

 *  మొగలిపూత్రాచు - 

             దీనియొక్క శరీరం వెండితో సమానం అయిన ఛాయ ఉంటుంది.పరిమళములు గుభాళించు ప్రదేశాలలో ఉంటుంది. మొగలి పొదలు , పరిమళ ఔషదాలు గల అరణ్యముల 
యందు సంచరిస్తుంది. కోపం తక్కువ, అతిశాంతం , సూక్ష్మమైన మొగలి రేకు ప్రమాణం ,  గురవారం నందు విషోద్రేకం అధికంగా ఉండును. 

 *  తెల్లత్రాచు  - 

              కోపం తక్కువ , సాత్విక గుణం , శాంతస్వభావం , వెన్నెలవంటి శరీర రంగు కలిగి ఉండి తెల్లత్రాచు అని చెప్పబడును .

 *  కోడెత్రాచు  - 

              18 అంగుళముల పొడువు ఉండును. కోళ్ళని భ్రమ చెందించి ఆకర్షించుట కొరకు కోళ్ళవలె అరుచును. ఇండ్ల యందు , కోళ్ల గూళ్ళ యందు నివాసం ఉండును. అత్యధిక కోపం కలిగి ఉండును. రాత్రుల యందు కోళ్ళని భక్షించును. రూపం భయంకరంగా ఉండును. అత్యంత చురుకుగా ఉండును. శుక్రవారం నందు అత్యథిక విషతీవ్రత కలిగి ఉండును.

 *  గిరినాగు  - 

           చంద్రబింబం వంటి వంక కలిగి , మెరుస్తున్న పడగ కలిగి ఉండి పర్వతముల యందు సంచారం చేస్తూ చెట్ల కొమ్మల యందు నివాసం ఉండును. ఇది పక్షులను భక్షించును . పడగ యందు వర్తులాకారం గా కృష్ణపాదములు కలిగి ఉండును. శుక్రవారం నందు విషోద్రేకం కలిగి ఉండును. 

 *  నీరుత్రాచు  - 

          అధికం అగు విషం , అతికోపం కలిగి ఉండి జలం నందు సంచారం , జలజంతు భక్షణ చేయుచూ శుక్రవారం నందు విషోద్రేకం అధికంగా ఉండును.

 *  గోధుమత్రాచు  - 

         సాత్విక స్వభావం కలిగి ఉండి గజము పొడవు ఉంటుంది. శనివారం నందు విషోద్రేకం కలిగి ఉండును.

 *  రాచనాగు అను త్రాచు  - 

          పడగ గుండ్రంగా ఉండి , కృష్ణపాదములు లేని పడగ ఉండి మూడు అడుగుల పొడవు కలిగి ఉండి అధికకోపం కలిగి ఉంటుంది. చాలా భయంకర స్వభావం కలిగి ఉంటుంది. పగదీర్చుకొను పట్టుదల ఉండును. పర్వతాలు అరణ్యముల యందు నివాసము ఉండును.

          ఇప్పుడు మీకు పెంజర పాముల గురించి వివరిస్తాను.

 ఇవి మొత్తం 21 రకాలు  అవి .

 *  కాటుకపోడ పెంజర .

 *  రక్త పెంజర .

 *  ఉడుముపొడ పెంజర.

 *  కలంకారీ పెంజర.

 *  పొట్ల పెంజర.

 *  తివాసిపోడ పెంజర.

 *  ఊదుపొడ పెంజర .

 *  పిచ్చుకపోడ  పెంజర.

 *  అగ్నిపోడ  పెంజర.

 *  పొడ పెంజర.

 *  సున్నపుపొడ పెంజర.

 *  తేనెపొడ పెంజర.

 *  కుళ్ళుపొడ పెంజర.

 *  పాదిరీపొడ పెంజర.

 *  గువ్వపొడ పెంజర.

 *  గరికపోడ పెంజర.

 *  మోదుగపూపొడ పెంజర.

 *  పసుపుపొడ పెంజర.

 *  దొండపండు పొడ పెంజర.

 *  గవ్వపోడ  పెంజర.

 *  రెండు తలల శిఖండి.

           పైన చెప్పిన విధంగా 21 రకాలుగా ఉన్నాయి . 

  మండలీ సర్పముల లక్షణములు  - 

 *  కాటుకపోడ పెంజర లక్షణము  - 

       ఈ పెంజర మిక్కిలి లావుగా , అమితమైన పొడవు , శరీరం అందు పంగనామాలు  కలిగి ఉండును. ఇది జీవజంతువులను కరుచును. దీని కాటు వలన దేహమంతయు వాపు , తెల్లగా పాలిపోవడం , దురద, నిస్సత్తువ కలుగును. మరణం మాత్రం కలుగదు . దీనిని దాసరిపాము అని కూడా పిలుస్తారు . 

 *  రక్త పెంజర  - 

       రక్త పెంజర అనునది చెయ్యి పొడవు కలిగి ఉండి ఎర్రని మచ్చలు , భయంకరమైన విషం కలిగి ఉండును. దీని కాటు వలన మైకం , భ్రాంతి, మూర్చ, నోటివెంట నురుగు పడును. నేత్రములు , పండ్ల చిగుళ్లు , రోమకూపములు , ముక్కు , కంఠం వీటి నుండి విపరీతంగా రక్తస్రావం కలుగును.ఎనిమిది జాములలో మనిషి మరణించుట జరుగును. ఆ సమయం దాటిందో చిత్రంగా బతుకగలడు.

 *  ఉడుముపొడ పెంజర -

        ఈ పెంజర పెద్ద శిరస్సు కలిగి ఉండి గరుకు శరీరం , ఉడుము వంటి ఆకారం కలిగి భయంకరంగా ఉండును. దీని కాటు వలన కలిగిన గాయము నుండి అధికంగా రక్తం స్రవించును . మైకంలో  ఉండి మంత్ర మరియు ఔషధ చికిత్సలకు లొంగక 3 దినములలో తప్పక మనిషికి మరణము కలుగును.

 *  కలంకారీ పెంజర  - 

        కలంకారీ పెంజర అనునది మూరెడు పొడవు కలిగి ఉండి కలంకారీ రంగుల వంటి పొడలు కలిగి ఉండును. దీని కాటు వలన శరీరం మంటలు పుట్టును . శోఫ , కలంకారి పని చేయబడిన చాందిని వంటి మచ్చలు , కంఠం యందు శోఫ , దాహము కలుగును. కాటుపడిన చోట ఆముదం , నూనె మొదలయిన చమురు పదార్థాలను ఉంచిన అవి ఇనికిపోవును . ఇట్టి లక్షణాలు కలిగిన మనిషి ఒక్క రోజులో మరణించును.

 *  పొట్ల పెంజర  - 

        పొట్ల పెంజర అనునది తలయును , తోకయును సన్నంగాను , శరీరం లావుగాను , పొట్లకాయ రంగు కలిగి మూరెడు పొడవు కలదై పొట్లకాయ వలే ఉండును. దీని కాటు తిన్నవారికి గొంతుక యందు గురక కలుగుట , శరీరం వాచుట మొదలగు లక్షణాలు కలుగును. దీని కాటు తినినవాడు 4 వ దినం నందు తప్పక మరణించును.

 *  తివాసిపోడ పెంజర  - 

        ఈ పెంజర అనునది 20 అంగుళాల పొడవు ఉండి తివాసి రంగుల వంటి మచ్చలు కలిగి ఉండును. దీని కాటు పడిన వారి శరీరం అంతా మంటలు , వాపు , మైకం , కనులకు చీకటి కమ్మడం వంటి లక్షణాలు కలిగి నాలుగు జాములలో మరణం సంభంవించును.

 *  ఊదు పొడ పెంజర - 

         ఇది ఒక అడుగు పొడవు ఉండును. ఇది కరవదు . నరులు మొదలయిన వాని శరీరం నందు బుస్సుమని వూదును. అందువలన దేహమందు వాపు , రక్తక్షీణత , పాండు రోగం , నిస్సత్తువ , కీళ్ల యందు చచ్చుదనం వంటి దుర్గుణములు ఏర్పడి చాలా కాలం తరువాత మరణం కలుగును.

 *  పిచ్చుకపోడ పెంజర  - 

          ఈ పెంజర అనునది అడుగు పొడవు ఉండి ముఖం నందు మూడు మచ్చలు ను కలిగి ఉండును. ఇది ఇండ్ల చూరుల యందు ఉండును. ఇది ప్రాకును. మరియు దుముకుతూ వేగంగా పోవును . దీనికాటు పడిన వారికి దేహం నందు పిచ్చుక మచ్చలు వంటివి మచ్చలు కలుగును. కడుపులో తిప్పును. రొమ్మునందు పసరు చేరినట్టు ఉండును. దీనివలన మరణం కలగదు .

 *  అగ్నిపోడ పెంజర  - 

          అగ్నిపోడ పెంజర  అనునది  18 అంగుళాల పొడవు కలిగి ఉండును. ఇది మనుషుల శరీరం నందు కాటువేయుట , ఊదుట , చొల్లు కార్చుట చేయును . ఈ మూడింటిలో ఏ విధంగానైనా అగ్నిపోడ పెంజర విషాన్ని మనుష్యుని  మీదకు విషాన్ని ప్రయోగించిన శరీరం నందు మిక్కిలి మంటలు కలుగును. కొంతకాలం తరువాత చిన్నగా అనారోగ్యం కలుగును. మరణం లేదు .

 *  పొడపెంజర  - 

          ఇది ఒక అడుగు పొడవు ఉండును. ఇది కరవదు. ఊదును. దీని నోటి విషపు గాలి తగిలిన వెంటనే శరీరం నందు ఒక్కసారిగా భగ్గున మంట మొదలగును. గాలిసోకిన స్థలం నందు రెండు మూడు దినముల పిమ్మట నిప్పుతో కాల్చబడినట్టు బొబ్బలు జనించును. నూనె మొదలగు సేవించినట్టైన  శరీరం నందు నల్లని మచ్చలు పుట్టును . కొంతకాలం ఇలా బాధపడిన తరువాత మృత్యువు సంభంవించును.

 *  సున్నపు పొడ పెంజర  - 

           ఇది అడుగు పొడవు మాత్రమే ఉండును. ఇది వరిమళ్ళ లోని ఎండ్రకాయ బొక్కలలో నివసిస్తూ ఎండ్రకాయలను భక్షించును . ఇది కరవదు. ఇది మనుజుల శరీరం నందు ఊదును. దీని విషపు గాలి తగిలిన వెంటనే మంట పుట్టును . శరీరం నందు మచ్చలు , దద్దుర్లు , గ్రంథులు ఏర్పడి , దురద మొదలయి కుష్టురోగి వలే ఉండును.  దీనివల్ల మృతి కలగదు . 

 *  తేనె పొడ పెంజర  - 

          ఇది రెండు మూరల పొడవు కలిగి ఉండి గుర్రపు వన్నె గల మచ్చలు కలిగి ఉండును. ఇది కరిచిన శరీరం నందు వాపు , మచ్చలు జనియించి కొన్నిదినములకు మృతి చెందును 

 *  కుళ్లు పొడ పెంజర  - 

           ఇది ఒక గజం పొడవు ఉండును. దీని శరీరం పైన అనేక వర్ణములు గల పొడలును కలిగి ఉండి చూచుటకు అసహ్యం కలిగి ఉండును. దీని కాటు పడిన వారికి శరీరం బరువు ఎక్కును. ముక్కులు ఎగురుచుండును. శ్వాస బంధించును. కాళ్లు , చేతుల యెక్క గోళ్లు పుచ్చిపోవును . కుష్టువ్యాధి సంభవించినట్టు శరీరం కుళ్ళి దుర్గందం ఏర్పడును . ఇది కరిచిన సంవత్సరం తరువాత మరణించును.

 *  పాదిరీ పొడ పెంజర  - 

           ఇది చేతి పొడవు ఉండును. కలిగొట్టు పువ్వు వన్నె మచ్చలు కలిగి ఉండి మొద్దు స్వభావం కలిగి ఉండును. ఇది కరవదు. మనుజుల శరీరములను నాకును. అందువలన శరీరం నందు పైత్యం , నవ, శరీరం రంగు    మారు ట , నిస్సత్తువ, వాంతులు ఎక్కిళ్లు , అరిచి సంభంవించును. మృతి ఎంత మాత్రం కలగదు . 

 *  గువ్వపోడ పెంజర  - 

           ఇది ముప్పది అంగుళముల పొడవును , పావురపు రంగు శరీరం కలిగి ఉండి పసుపు వన్నె మచ్చలు కలిగి ఉండును. దీని కాటు పడినవారికి శరీరం నందు పాండు వ్యాధి , దురద, శోఫ , పసుపు వర్ణము గల మచ్చలు , దద్దురులు కలుగును. కొంతమందికి మాత్రమే మరణం కలుగును.

 *   గరికపోడ పెంజర  - 

            ఇది గరిక వర్ణపు మచ్చలను కలిగి ఉండి అడుగు పొడవును కలిగి ఉండును. దీని కాటు వలన మనుజులకు శరీరం నందు దురద, వాపు , మాంద్యం, నొప్పి, కన్నులు భ్రమ గప్పుట, దేహంలో నిస్సత్తువ , శరీరం అంతా ఆకు పసుపు వర్ణం గల పొడలు , శరీరం నందు వణుకు వంటి లక్షణాలు కలిగి కుష్టువ్యాది జనింపజేయును . కాళ్ల యొక్క చేతుల యొక్క వ్రేళ్లు వంకరలై ఎండిపోయినట్టు అయ్యి శుష్కించి ఉండును.

 *  మోదుగుపూ పొడ పెంజర  - 

           ఇది రెండు అడుగుల పొడవు , ఎర్రని మచ్చలు కలిగి ఉండును. దీని కాటు తిన్న వారికి శరీరం నందు వాపు , గాయం నందు పోట్లు , శరీరం నందు గ్రంథులు కట్టుట, అప్పటికప్పుడే రక్తం వాంతి అగుట , దగ్గిన రక్తం పడుట వంటి లక్షణాలు కలిగి ఉండును.

 *  పసుపుపొడ పెంజర  - 

           ఇది చేతి పొడవు కలిగి ఉండును. పసుపు వన్నె మచ్చలను కలిగి యుండును. దీని కాటు వలన శరీరం నందు పసుపు రంగు బొబ్బలు , జ్వరం , గాయాల్లో పోట్లు ఏర్పడి మరణం సంభంవించును.

 *  దొండపండు పొడ పెంజర  - 

          ఇది చేతేడు పొడవు ఉండును. చక్కగా పండిన దొండపండు వర్ణం కలిగి ఉండును. దీని కాటువలన శరీరం నందు నరములు ఉబ్బి ఎర్రగా కనిపించును. దేహం శుష్కించును . గాయం నందు పోట్లు కలుగును. మారుతి సంభవింపదు.

 *  గవ్వపోడ పెంజర  - 

          ఇది మూడు మూరల పొడవును , లావుగా భయంకరంగా గవ్వ  వర్ణం కలిగి ఉండును. దీని కాటు వలన శరీరం నందు పాండువు , ముఖం , నేత్రములు పసుపు వర్ణం కలిగి ఉండును. కాటుపడిన ప్రదేశం కుంగి గుంట పడుట జరుగును. మరణం సంభవించదు.

 *  రెండు తలల శిఖండి  -  

         ఈ పెంజర రాగిరంగు కలిగి ఉండును. తెల్లని మచ్చలు , గజము పొడవు కలిగి ఉండును. దీని తోక వైపు మొద్దుగా ఉండటం చేతను తలవైపుకు ప్రాకినట్లే తోకవైపుకు పాకును. అందువలన జనులు దీనికి రెండు తలలు ఉండునని భావించును. దీనిని కర్రతో కొట్టినా చావదు. జెముడు , జిల్లేడు కర్రలతో కొట్టినను , నిప్పులతో కాల్చినను చనిపోవును . ఇది కరవదు . మనుజుల శరీరం నాకును . ఇందువలన దేహం అంతయు నవ, పాండు రోగం , పొడలు , వాపు కలిగి అన్నం తినటం మీద ద్వేషం కలుగును. 
 
   ఇప్పటివరకు  మీకు 21 రకాల పెంజర సర్పాల గురించి తెలియచేశాను . ఇప్పుడు మీకు రాజీమంత సర్పాల గురించి తెలియచేస్తాను .  

     ఈ రాజీమంత సర్పాలలో 4 రకాల సర్పాలు కలవు.       అవి 

  *  క్షుద్రజాతి సర్పాలు . 

   *  కుంభీ వస సర్పాలు .

   *  మహా సర్పాలు .

   *  నిర్విష సర్పాలు .   అని 4 రకాలు కలవు.

  రాజీమంత సర్పాలలో బేధాలు  - 

     పైన చెప్పబడిన నాలుగు జాతుల సర్పాలలో క్షుద్రజాతి సర్పములు 9 జాతులుగాను , కుంభీవస సర్పాలు 8 కులములుగాను , మహాసర్పములు 3 బేధములుగాను , నిర్విష సర్పములు 16 తరగతులుగా పుట్టి ఉన్నవి.

  క్షుద్రసర్పములలో రకాలు  - 

 *  పెద్ద కట్లపాము.

 *  నాగుల కట్లపాము.

 *  నూనె కట్లపాము.

 *  బఱ్ఱె కట్లపాము.

 *  కట్లపాము.

 *  తాటిబొలుగు పాము.

 *  చెట్టెగురు పాము.

 *  గొడ్డలి ముఖపు పాము.

 *  గోడప్రాకుడు పాము.    

         ఈ విధంగా మొత్తం 9 విధాలుగా ఉండును.

 *  పెద్ద కట్లపాము లేదా పెద్ద పరుగుడు పాము 

          ఇది గజము పొడవు ఉండి గోధుమవన్నె త్రాచు పాముని పోలి ఉంటుంది.  దీని కాటు పడిన వానికి మాటిమాటికి విషం ఎక్కి భాధించును. కాని మరణం కలగదు.

 *  నాగుల కట్లపాము  - 

           దీనిని నాగ పరుగుడు అని కూడా అంటారు. ఇది 36 అంగుళముల పొడవు ఉండును. ఇది చూడటానికి నల్ల త్రాచువలె ఉండును. దీని కాటువలన విషం ఎక్కడం దిగడం జరుగును. మంత్రౌషదాల వలన విషం విరుగును. మరణం కలగదు. 

 *  నూనె కట్లపాము  - 

            ఇది 36 అంగుళముల పొడవు కలిగి ఉండి శరీరం అంతయు తెల్లని కట్లు కలిగి ఉండి మెరుస్తూ ఉంటుంది. దీని విషం మిక్కిలి చురుకు అయినది. దీని కాటు వలన బాధ కలుగును. విషం వలన మరణం సంభవించదు.

 *  బర్రెకట్ల పాము  - 

            ఇది 50 అంగుళాల పొడవు ఉండి మొద్దు వలే లావును , శరీరం నందు గరుకు కలిగి ఉండును. ఇది క్రూరమైన విషం కలిగి ఉండును.

 *  కట్లపాము లక్షణము  - 

             ఇది మూడుమూరల పొడవు , శరీరం నందు గణుపుల వంటి కట్లు కలిగి ఉండును. ఇది కాటు వేయడం వలన మాటిమాటికి విషం ఎక్కడం , దిగడం జరుగును. మరణం కలుగనేరదు .

 *  తాడిగిరి లేదా తాటిబొలుగు పాము  - 

              ఇది  చిటికెన వ్రేలు లావును , మూడు జానల పొడవు నూనె రంగును కలిగి ఉండును. ఇది తీగ జాతి చెట్లలో విశేషంగా తాటిచెట్ల యందును సంచరించును. మనుజుల నిది తలమీదనే తప్ప మరి వేరే ప్రదేశంలో కరవదు. అందువలన తక్షణమే విషమెక్కి మనుజుడు గంటలోపునే చచ్చును. దీని విషముకు విరుగుడు లేదు . ఇది పగబట్టిన మనిషిని చంపియే తీరును . ఒకవేళ చంపలేక పోతే నిరసన వ్రతం బూని 6 నెలలలో అతనికోసం వేచి చూసి చివరకు చచ్చును. 

 *  చెట్టగురు పాము  - 

            ఇది చిటికెన వ్రేలు లావు , అడుగున్నర పొడవు ఉండి ఎప్పుడూ చెట్ల మీదనే ఉండును. ఇది ఒక చెట్టు పై నుంచి మరియొక చెట్టు పైకి తటాలున దుమక గలదు. ఇది మనుజులను తలమీద కాని కన్నుల మీద కాని కరుచును. ఇది పగ సాధించుట విషయంలో  తాడిగిరి పామును పోలి ఉండును. ఇది కరిచినచో ఔషదం ఇచ్చు సమయం కూడా ఉండదు. అంతలోపు మనుజుడు మరణించును. జీవజంతువులు ను చంపుటలో దీని విషాన్ని మించినది లేదు . కావున పర్వాతారణ్యాలు , ఉద్యానవనాలు యందు తిరిగే వారు ఈ సర్పాన్ని సదా కనిపెట్టి తిరగగలరు.

 *  గొడ్డలిమొగపు పాముల లక్షణము  - 

             ఇది ఉదారంగును , గొడ్డలి వంటి తల కలిగి ఉండును. రేగటి మట్టి భూములలో , చౌడు భూముల్లో , బురద నేలల్లో నివసించును. వర్షాకాలంలో మాత్రమే బయట తిరుగును. మూరెడు పొడవు కలిగి ఉండును. ఈ పాముచే కరవబడిన మనుజుడు యొక్క అంగాలు కుంచించుకు పోయి పొట్టివాడు అగును.

 *  గోడప్రాకుడు పాము లక్షణము  - 

              ఇది రెండు మూరల పొడవు కలిగి తెల్లని శరీరం కలిగి శరీరం పైన నల్లని అడ్డు చారలు కలిగి ఉండును. వేలెడు లావు కలిగి ఉండును. అతిక్రూరమైన విషము కలిగి ఉండును.ఈ సర్పము ఎంత చదరము అయిన గోడని అయినా ప్రాకి ఎక్కగలదు. కాని దిగుట తెలీదు . గబుక్కున కింద పడును. 
ప్రాచీన గ్రంథాలలో సర్పాలు వాటి వివరణ - 5 

        అంతకు ముందు పోస్టులో రాజీమంత సర్పాలు మొత్తం 21 రకాలు వాటి గురించి సంపూర్ణ వివరణ ఇచ్చాను. ఇప్పుడు కుంభీన జాతి సర్పాలు గురించి వివరిస్తాను. 

   ఈ కుంభీని జాతి సర్పాలు మొత్తం 8 రకాలు .

  *  ఘంటాపుచ్చము .

  *  గరున్నాగము .

  *  త్రిశూలి .

  *  జటాధరము .

  *  కుంభీనసము .

  *  శోణముఖము .

  *  లోహితాక్షము .

  *  ఛత్రపతి.

       ఈ విధంగా 8 రకాలుగా ఉంటాయి.

 *  ఘంటాపుచ్చ సర్ప లక్షణము  - 

         మిక్కిలి పొడవు శరీరం , క్రూరత్వం , మిక్కిలి పరాక్రమం సంచరించునప్పుడు తోక చివర యందు ఘంటానాదం కలిగి ఉంటుంది. ఈ సర్పం సర్వ జంతువులను భక్షించును . ఉగ్రమైన విషం కలిగి ఉండును. సంచారం బయలుదేరడం మొదలు కాగానే దీని తోక యందు ఘంటానాదం వినపడును. ఆ నాదం వినపడిన వెంటనే సమస్త జంతువులు పారిపోవును. ఈ సర్పం ఆఫ్రికా దేశ పర్వతారణ్యములలో సంచరించును.

 *  గరున్నాగ సర్ప లక్షణము  - 

         ఖడ్గము వంటి నాలుక , గబ్బిలపు రెక్కల వంటి రెక్కలు , గుడ్లగూబ వంటి ముఖం, భూమి మీద మరియు ఆకాశ గమనం , 8 మూరల పొడవు కలిగి ఉండును. ఇది పక్షిజాతులను భక్షించును . ఇది ఆఫ్రికా దేశ పర్వతారణ్యాలలో నివశించును.

 *  త్రిశూలీ సర్ప లక్షణము  - 

           పిల్లివంటి ముఖం , తోక యందు గరుడపచ్చ కాంతి వంటి రేఖలతో ప్రకాశించుట , మీసాలు కలిగి ఉండును. 16 మూరలు పొడవు కలిగి ఉండిన దేహము , తోక త్రిశూలం వంటి మూడు చీలికలు కలిగి ఉండును. ఇది ఆఫ్రికా ఖండం నందు ఉండును. 

 *  జటాధరా సర్ప లక్షణము  - 

           మేకవంటి స్వరము , అతి పెద్ద శరీరం , గొఱ్ఱెవలె జడలు , 6 మూరల పొడవు , కంబడి చాయ వంటి లక్షణములు కలది. ఇది సింహళ ద్వీపం నందు ఉండును.

 *  కుంభీనస సర్ప లక్షణము  - 

           మూడు మూరల పొడవు , పంది ముఖం , కడవ వంటి కడుపు , కురచ అయిన తోక , చిన్నగా పాకును .  తుమ్మెద ధ్వని వంటి కూత ఈ లక్షణములు గలది కుంభీనస సర్పం అనబడును. ఇది అన్ని దేశాలలో ఉండును.

 *  శోణముఖ సర్ప లక్షణం  - 

          స్పటిక ఛాయ గల శరీరం , పద్మరాగ మణి వంటి శిరస్సు , అతి భయంకరమైన కామక్రోధములు , భయంకరమైన గర్జన , 12 మూరల పొడవు గల శరీరం కలిగి ఉండునది శోణముఖ సర్పం అనబడును.

 *  లోహితాక్ష సర్ప లక్షణం  - 

         నల్లని వర్ణం, భూమి నుండి చెట్ల పైకి , చెట్ల పై నుంచి భూమి పైకి దుముకుట , బారెడు పొడవు గల శరీరం , అగ్ని కణముల వంటి నేత్రములు , భయంకర ఆకారం కలిగి ఉండును.

 *  ఛత్రపతి సర్ప లక్షణము - 

         5 మూరల పొడవు , అతిస్నిగ్ధమైన కోమలాకారం , సంచరించునప్పుడు శరీరం వికసించును. సంచరించనప్పుడు శరీరం ముడుచుకుని ఉండును. శ్వేత ఛత్రం గల శిరస్సు , సర్వ జంతువుల ధ్వనిని చేయగలిగి ఉండును. క్షణంలో ప్రాణం తీయును.రాత్రుల యందు చెట్ల మీద నివసించును . ఇది కేరళ నందు నివసించును . 

  మహాసర్పముల వివరణ  - 

     మహాసర్పములు మొత్తం 3 రకాలు  అవి 

  *  దాసరి పాము .

  *  కొండ చిలువ .

  *  సముద్రపు చిలువ .

 *  దాసరిపాము లక్షణము  - 

         60 మూరల పొడవు , బారెడు లావుగల శరీరం , శరీరం అంతా త్రిపుండ్రాకారం గల నామములు , కాటుక వంటి ఛాయ , ముఖం నందు ఊర్ద్వత్రిపుండ్రములు కలిగి ఉండునది దాసరిపాము అని చెప్పబడును . దీనికి దొరికిన ఏ జంతువుని అయినా బిర్రుగా చుట్టుకుని చంపి దిగమింగును.

 *  కొండచిలువ లక్షణము  - 

         నూరు మూరల పొడవు , మూడు బారల వలయము , వెడల్పు గల తెల్లని పొడలు , నీలవర్ణం గల శరీరం కలిగి ఉండునది కొండచిలువ అని చెప్పబడును . ఇది ఏ జంతువుని అయినా చటుక్కున మింగి చెట్టుకు చుట్టుకుని నీల్గును . అంతట పొట్టలోని జంతువు జీర్ణం అగును.ఇది కొండల యందు మాత్రమే నివసించును . 

 *  సముద్రపు పాము లక్షణము  - 

          మిక్కిలి పొడవు , స్థూలమగు శరీరం గలది . దీనిచేత కరవబడిన మనిషిని భూమి పైకి తీసుకొచ్చి చికిత్స చేసిన విషము హరించదు. సముద్రము నందు ఉంచే చికిత్స చేయవలెను . 

          *  సర్పజాతి వివరణ సంపూర్ణం *

      ఇప్పుడు మీకు సర్పాలు కాటువేసినప్పుడు చేయవలసిన చికిత్సల గురించి వివరిస్తాను.   
 
     సర్ప విషములకు చేయవలసిన చికిత్సలు -

    
    అంతకు ముందు పోస్టులలో మీకు సర్పాలలో రకాలు మరియు వాటి లక్షణాలు సంపూర్ణంగా వివరించాను. ఇప్పుడు వాటి చికిత్సలు గురించి సంపూర్ణంగా వివరిస్తాను.

 *  1వ చికిత్స -
    
          ఏ సర్పం కోపోద్రేకంతో ఉండునో అట్టి సర్పం నోటి నుండి పొగ వెడలుచుండును. యే మనుజుడు అయినా అట్టి సర్పముచే కరవబడినను ఆ సర్పం వదిలిన పొగచే స్మృశించబడిన ఆహార పదార్థాలను భక్షించిన వెంటనే విషం ఎక్కును.ఆ విషాన్ని చికిత్సల ద్వారా తొలగించవలెను .  వెంటనే ఆ విషార్తునకు ఆవుపాలు , ఆవునెయ్యి , తేనె సమాంతరములుగా కలిపి అందు రెండు గురిగింజల అంత వత్సనాభిని కలిపి త్రాగించి గాయమునకు కూడా వత్సనాభిని కరిచినచొట పైపూతగా రాయవలెను .వెంటనే విషం హరించును . 

 *  2 వ చికిత్స  - 

           సర్పం కాటువేసిన వానికి వెంటనే  ఎడమ ముక్కునందు చెవిలో గులిమి పట్టించి మనిషి మూత్రం ఆ ముక్కులో ఉంచిన విషం ఎక్కదు.

 *  3 వ చికిత్స  - 

           నేలగుమ్ముడు గడ్డను గంథం తీసి కాటువేసిన చోట లేపనం చేసిన విషం హరించును . దీని చూర్ణం మీకు ఆయుర్వేద పచారీ షాపులలో దొరకును. 

 *  4 వ చికిత్స  - 

            పెన్నేరు గడ్డ అనగా అశ్వగంధ , చిర్రివేరు , మహిసాక్షి , కరిదువ్వ ఈ వస్తువులను గోమూత్రం తో నూరి పట్టించిన సర్పవిషం హరించును . విషంని హరించుటలో దీన్ని మించిన గొప్ప ఔషదం లేదు .

 *  5  వ చికిత్స  - 

          ఆగాకర గడ్డ ని గంథం తీసి అనగా సానమీద అరగదీసి ఆ గంధాన్ని తీసి కాటువేసిన స్థలం నందు దానిని పూసిన విషం హరించును . 

 *  6 వ చికిత్స - 

          కాటువేసిన స్థలం నందు జిల్లేడు వేరు అరగదీసి పట్టించినను లేదా ఎర్ర చిత్రమూలం , ఆరుద్ర పురుగు కలిపి నూరి పట్టించినను విషం విరుగును.

 *  7 వ చికిత్స  - 

          కరక్కాయ , తేనె , మిరియాలు , ఆకుపత్రి , ఇంగువ, మణిశిల , వస వీనిని సమానంగా నీరు వేసి నూరి ముక్కులో వేసిన సర్పముచే కరవబడిన వాడు జీవించును.

 *  8 వ చికిత్స  - 

           మణిశిల , ఇంగువ, వస , త్రికటుకములు అనగా శొంటి,పిప్పిళ్లు , మిరియాల సమాన చూర్ణం , కరక్కాయలు, లవంగచెక్క, ఆకుపత్రి అనునవి సమానంగా తీసుకుని నీటితో కలిపి నూరి ముక్కులో వేసినచో ఎంత విషపూరితమైన సర్పం కరిచినను ఆ వ్యక్తి బ్రతుకుతాడు.

 *  9 వ చికిత్స  - 

           దేవకాంచన చెట్టు వేరు గంధంని ముక్కులోపల వేసినచో అసాధ్యం అయిన సర్పవిషం హరించును . 

 *  10 వ చికిత్స  - 

           నేపాళపు గింజల్లోని పప్పులను నిమ్మపండ్ల రసంలో 21 సార్లు భావన చేయవలెను . భావన అనగా నిమ్మపండ్ల రసంలో గింజల్లోని పప్పు నానబెట్టి మళ్ళీ పూర్తిగా ఎండించడం మరలా నానబెట్టి మరలా ఎండించడం ఈ విధముగా 21 సార్లు చేయవలెను . ఆ తరువాత దానికి ఉమ్మి తో నూరి కణికలు చేసి ఎండించి మాత్రలులా చేసుకోవలెను . కావలసినప్పుడు ఉమ్మితో అరగదీసి కాటువేసిన స్థలం నందు లేపనం చేయవలెను . తరువాత కన్నులకు కాటుక వలే ఆ గంధాన్ని పట్టించవలెను  . విషం విరిగిపోవును.

 *  11 వ చికిత్స  - 

              గుంటగలగర వేఱు గాని , తిప్పతీగ వేఱు కాని , త్రిశూలి చెట్టు వేఱు గాని నీటితో నూరి లోపలికి తీసుకుని కాటువేసిన స్థలం నందు పూయడం వలన సర్పవిషం హరించును . 

 *  12 వ చికిత్స  - 

                భావంచి విత్తనాలు గోమూత్రంలో నానబెట్టి గోమూత్రంతోనే నూరి లోపలికి తాగవలెను . 

 *  13 వ చికిత్స - 

             తెల్లగురిగింజ వేరుని నోటిలో ఉంచుకుని రసం మింగుచున్న సర్పవిషం హరించును .

 *  14 వ చికిత్స  - 

             అశ్వగంధ సమూలం మేక మూత్రంతో నూరి దానినే గాయమునకు పట్టించిన సర్వ జంతువుల విషంని హరించును . 

 *  15 వ చికిత్స  - 

             నల్ల ఉమ్మెత్త వేఱు చిన్న ముక్కను తీసుకుని 10 ml కానుగ విత్తనాల నూనె వేసి నూరి మాత్ర వలే చేసి పుక్కిట పట్టుకొని ఆ మాత్రని నిమ్మపండ్ల రసముని కలిపి త్రాగిన సర్పవిషం హరించును . 

 *  16  వ చికిత్స  - 

             అత్తిపత్తి చెట్టు వేఱు అనగా దీనిని పట్టుకున్నచో ఆకులు ముడుచుకొనిపోవును . మరియు నీలివేరు ను మంచి నీటితో నూరి పుచ్చుకొని తెల్ల గురిగింజ లోని పప్పుల గంధమును కాటువేసిన స్థలం నందు పట్టించిన సర్పవిషం హరించును . 

 *  17  వ చికిత్స  - 

              గొమూత్రంలో గాని మనుష్యుని మూత్రంలోగాని పాత నెయ్యిలో గాని పసుపు చూర్ణం కలిపి తాగించిన సర్పవిషము హరించును . 

 *  18 వ చికిత్స  - 

            పాము కరిచిన వెంటనే నరమూత్రం సేవించిన విషం ఎక్కదు.

 *  19 వ చికిత్స  - 

          కటుకరోహిణి , నేలతాడిగడ్డలు నీళ్లతో నూరి పుచ్చుకొనిన సర్పవిషం హరించును . 

 *  20 వ చికిత్స  - 

          కుంకుడువేరు నూరి కుంకుడు గింజ ప్రమాణంలో పుచ్చుకొనిన సర్పవిషం హరించును . 

 *  21 వ చికిత్స  - 

          నాగముష్టి వేరు నూరి రసం తీసి తాగిన అన్ని రకాల సర్పవిషాలు హరించును . 

 *  22 వ చికిత్స  - 

           జిల్లేడు యొక్క లేత మొగ్గలని కోసి ఆ మొగ్గలు తెంచునపుడు స్రవించు పాలను ఒక గ్లాసులో పట్టి ఆ పాలతో ఆ మొగ్గలను నూరి రేగు పండు ప్రమాణం మాత్రలను చేసి ఆ మాత్రలను తమలాపాకులో చుట్టి గంటకి ఒకసారి  మింగించిన సర్పవిషం హరించును . ఇలా 6 మాత్రలు కు తక్కువలేకుండా మింగించవలెను . మింగలేని స్థితిలో ఉన్నచో నీటితో కలిపి తాగించవలెను . 

 *  23 వ చికిత్స  - 

           జిల్లేడు ఆకులకు ఇరువైపులా అంటుకొని ఉండే దూది వంటి తెల్లని నునగును గీచి ఒక గాజుపాత్రలో వేసి జిల్లేడు లేత మొగ్గలను తుంచునప్పుడు తొడిమలు నుండి స్రవించు పాలతో తడిపి చేతితో చక్కగా పిసికి కుంకుడు గింజ అంత మాత్రలు చేసి నీడలో ఎండపెట్టి ఆ మాత్రలకు గాలి తగలకుండా సీసాలో వేసి కార్క్ మూత బిగించి ఈ మాత్రలను గంటకొకటి చొప్పున మూడు గంటలసేపు మింగించిన సర్పవిషం నిస్సందేహంగా నివర్తించును.  

          ఈ మాత్రలు తయారుచేసిన రెండు నెలల వరకే పనిచేయును . కావున రెండు నెలలోకసారి ఈ మాత్రలు తయారుచేసి నిలువ ఉంచుకొనవలెను .

       * సర్ప విష చికిత్సలు సంపూర్ణం *

 గమనిక  - 

          కొంతమంది ప్రాచీన వైద్య పండితులు పాము కరిచిన సాధారణంగా మనుషులకు మృతి సంభవించదు అని తమతమ గ్రంథాలలో వివరించారు . పాము కరిచినవారికి స్మృతి తప్పి ఉచ్వాస నిశ్చ్వాసములు ఆగి , హృదయచలనం ఆగి నాడిగమనం ఆగి ఉన్న సమయంన  మృతుడు అయినట్టు నిర్ణయించుకుని చక్కగా కూర్చొండబెట్టి 500 వందల బిందెల నీటిని నెత్తిన ధారగా పోసిన బొందిలోకి ప్రాణం వచ్చి లేచును. 

                     ఈ విధంగా చేసినను ప్రాణం రానిచో ఒక గచ్చు తొట్టిలో కాని , చెక్క తొట్టిలో కాని నిండుగా నీరు నింపి మూడు దినములు ఉంచిన ఉదకం నుండి బుడగలు వచ్చును. బుడగలు మొదలు అయినచో శరీరంలోకి ప్రాణం ప్రవేశిస్తుంది అని అర్థం. ఈ విధంగా బుడగలు మొదలయిన గడియ తరువాత కాటు తిన్న వాని శరీరం బయటకి తీసి కూర్చుండబెట్టి శిరస్సు పై నుంచి నీటిని ధారగా పోయుచున్న ప్రాణములు నిలబడును. నీటిలో ఉంచినప్పుడు బుడగలు రానిచో మృతుడు అని నిర్ణయించవలెను .  

         సిద్దనాగార్జున తంత్రం నందు తొమ్మిది దినముల వరకు నీటియందు ఉంచవలెను అని ఉన్నది. పాముచే కరవబడిన వాడు చనిపోయినచో వానిని మరలా ఆ సర్పం వలన గాని లేదా మరియొక సర్పం చేత కాని కరిపించినచో కాటు తిన్నవాడు బ్రతుకును కాని సర్పం మరణించును. బహుశా పాముకాటు తిన్నవాడు శరీరంలోని అవయవాలు పనిచేయని ఒక రకమైన అచేతన స్థితికి చేరుకుంటాడు కావోచ్చు ఉదకం సహాయంతో అతన్ని మరలా సాధారణ స్థితికి తీసుకురావొచ్చు అని ఆయుర్వేద పండితుల ఉవాచ కావోచ్చు . 

         నేను చదివిన కొన్ని గ్రంథాలలో పాముకరిచిన వెంటనే ఆ పాముని కాటు తినినవాడు పట్టుకొని కరవాలి అని లేదా మట్టిపెడ్డని నమిలి కాని పాముకాటు పైన కాల్చి కుంకుడు ఆకు నలుగగొట్టి కట్టిన సర్పవిషం హరించును అని ఉన్నది.

 పాములు దగ్గరకు రాకుండా ఉండుటకు రహస్య క్రియలు  - 

 *  1 వ ప్రక్రియ  - 

          పుష్యమి నక్షత్రం నందు సంగ్రహించబడిన తెల్ల జిల్లేడు వేఱు , తెల్ల గలిజేరు వేఱు బియ్యపు కడుగుతో నూరి త్రాగినను , ఆ నక్షత్రం యెక్క సమయం నందు ఆ మూలికలను నూరి బియ్యపు కడుగులో చేర్చి పూసుకుని స్నానం చేయవలెను . ఇలా సంవత్సరంకి ఒకమారు చేయడం వలన  ఆ మనిషి దగ్గరకి సర్పాలు వెళ్లవు . సర్పభయం ఉండదు.

 *  2 వ ప్రక్రియ  - 

            సూర్యుడు మేషరాశి యందు ఉండగా చిరుశెనగలు , వేపాకు కలిపి భక్షించిన ఒక సంవత్సరం వరకు సర్పభయం ఉండదు.

 *  3 వ ప్రక్రియ  - 

             ఆషాడ శుక్ర పంచమి నాడు సంగ్రహించబడిన దిరిసెన చెట్టు వేరుని దూపదీపనైవేద్యములు వొసగి నడుముకి కట్టుకుని బియ్యపు కడుగుతో ఆ వేరుని నూరి తాగిన ఆ సంవత్సరం సర్పభయం ఉండదు. ఇటుల చేసిన వానికి యే కారణం వల్లనైనా పాము కరిచినను పామే చచ్చును.

 *  4 వ ప్రక్రియ  - 

              దూసరి తీగ వేరుని తెచ్చి నివశించే గృహము నందు కనపడునట్టు వ్రేలాడదీసిన సమస్త విషజంతువులు అన్నియు దూరంగా పారిపోవును . 

 *  5 వ ప్రక్రియ  - 

             పుష్యమి నక్షత్రం నందు తిప్పతీగ వేరుని తెచ్చి కణికలుగా ఖండించి దారము నకు మూలికగా గుచ్చి కంఠం నందు ధరించినచో సర్పభయం కలగదు. పాముకాటు వేసిన వాని కంఠం నందు వేసిన విషం దిగును.

 *  6 వ ప్రక్రియ  - 

             పుష్యమి నక్షత్రంతో కూడిన ఆదివారం నందు బియ్యం కడుగుతో తెల్లగలిజేరు వేరు నూరి తాగిన మనుజునిని చూసిన సర్పం వెంటనే పారిపోవును . అట్టి మనిషికి సర్పభీతి ఉండదు.

 *  7 వ ప్రక్రియ  - 

             తెల్ల గంటెన వేరును బియ్యపు కడుగుతో నూరి పుచ్చుకొనిన మనుజుని కి 6 మాసముల వరకు సర్పభయం కలగదు.

 *  8 వ ప్రక్రియ  - 

             దూసరి తీగ వేఱు ఉదకంతో నూరి తాగినవానిని 6 మాసములు వరకు సర్పం కరవదు.దీనిని " గరుడ చూడామణి" అని పిలుస్తారు . 

  *  9 వ ప్రక్రియ  - 

             మనుజులు ప్రతి దినం పడుకొనే సమయం నందు అస్తిక మునిని గూర్చి ధ్యానించి నమస్కారం చేసి పడుకున్నచో ఆ మనుషులకు సర్పభయం లేకపోవుటయే కాక స్వప్నం నందు కూడా సర్పాలు కనపడవు.

 *  10 వ ప్రక్రియ  - 

           గొడుగు వేసుకొని ఆవాలు పిడికిటపట్టుకొని రాత్రియందు గాని , పగటి యందు గాని ఏ మనుజుడు సంచరించునో వాని ఛాయ పడినను , శబ్దము వినినను సర్పములు భయపడి పారిపోవును .

 *  11 వ ప్రక్రియ  - 

           అతిమధురం , విప్పకర్ర  ఈ రెండింటిని చేర్చి మంట వేసినచో ఆ జ్వాలను చూసి నాగుపాములు సైతం దగ్గరకి రావు . 

 *  12 వ ప్రక్రియ  - 

            సింహం దంతంతో గరుడ విగ్రహంని చేయించి రాగి లేక బంగారు తాయత్తు లో పొదిగి శరీరం నందు ధరించిన వానిని చూడగానే సర్పములు పలాయనం చిత్తగించును . 

           పైన చెప్పబడిన రహస్యతంత్రాలలో మీకు ఏది వీలుగా ఉంటుందో అది ప్రయత్నించండి. ముఖ్యముగా అరణ్యములలో సంచరించేవారు , రహస్య ప్రదేశాలలో తిరిగేవారు తప్పనిసరిగా పైన చెప్పిన తంత్రాలు పాటించటం చాలా మంచిది 

          పాముకాటు గుండ్రంగా ఉండినను , నేరేడు పండు వర్ణం కలిగి ఉండినను , నీలపు వర్ణం కలిగి ఉండినను , రక్తహీనం అయ్యి తెల్లగా ఉండినను , రక్తం గూడుకట్టి ఎర్రగా ఉండినను వాడు దేవజాతి అయిన వాడు అయినను బ్రతకడు ఇది నిశ్చయం ...

         నేటితో సర్పాలు గురించి పూర్తి వివరణ వాటి చికిత్సా విధానాలు గురించి పూర్తిగా తెలియచేశాను . అదేవిధంగా సర్పాల నుంచి రక్షించుకొనుటకు కొన్ని ప్రక్రియలు కూడా వివరించాను.  మరలా ఒక మంచి పొస్టుతో మీ ముందుకు వస్తాను . 

  

Saturday, 15 August 2020

సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:*


1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం. 
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం. 
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం. 
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం. 
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా.

*నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు:* 
1. మహానంది
2. జంబుకేశ్వర్ 
3. బుగ్గరామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి.
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.
6. బెంగళూర్ మల్లేశ్వర్ 
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా

*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.* 
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి. 
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,  
3. మంజునాథ్.
*శ్వాస తీసుకునే* కాళహస్తీశ్వర్
*సముద్రమే వెనక్కివెళ్లే* 
1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్, 
2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.
*స్త్రీవలె నెలసరి* అయ్యే 
1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,  
2. కేరళ దుర్గామాత.
*రంగులు మారే ఆలయం.* 
1. ఉత్తరాయణం,  దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు* 
 1. కాణిపాకం,  
2. యాగంటి బసవన్న,  
3. కాశీ తిలభండేశ్వర్,  
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి

*స్వయంభువుగా* 
సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.
*ఆరునెలలకు ఒకసారి తెరిచే* 
1. బదరీనాథ్,  
2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
3. గుహ్యకాళీమందిరం. 

*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు* 
హాసంబా దేవాలయం,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

*12 ఏళ్లకు ఒకసారి*
పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్,  హిమాచల్ ప్రదేశ్.

*స్వయంగా ప్రసాదం* 
1. తినే కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం

*ఒంటి స్తంభంతో*
యుగాంతానికి గుర్తుగా  ఉండే పూణే కేధారేశ్వర్,  ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

*రూపాలు మారే*
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.

*నీటితో దీపం వెలిగించే* ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,  మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది,  ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.
*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు* 
1. హేమాచల నరసింహ స్వామి.
2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

*మనిషి వలె గుటకలు*  
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.

*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.* 

*ఛాయా విశేషం* 
1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
3. బృహదీశ్వరాలయం

*నీటిలో తేలే* విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ),  నేపాల్

*ఇంకా...* 
తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్,  కంచి, 
చిలుకూరి బాలాజీ,  పండరినాథ్, భద్రాచలం,  అన్నవరం etc

*పూరీ* 
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి,  దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే  పూరి ప్రసాదం.

ఇవి మన దేశం లో ఉన్న, మనకు తెలిసిన కొన్ని మహిమాన్విత హిందూ దేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి.🕉💐💐💐🙏🙏

Thursday, 6 August 2020

శ్రీ_వేంకటేశ్వర_దివ్య_చరిత్ర 🌊 #తిరుమల_పుష్కరిణి 🌊



శ్రీవారి ఆలయం సమీపాన ఉత్తరంగా ఉన్న ఈ పుష్కరిణిలో స్నానంచేసి, స్వామి దర్శనానికి వెళ్ళాలనే నియమం ఉంది. వైకుంఠం నుంచి కలియుగ వైకుంఠం అయిన తిరుమలకొండ మీదకు వేంకటేశ్వరుడు దిగివచ్చేవేళ, తన జలక్రీడల కోసం, వైకుంఠం నుంచి భువికి స్వామి స్వయంగా తెప్పించుకున్న తీర్థమిదేనని భావన. సకల పాపనాశనిగా స్వామి పుష్కరిణికి పేరు. 

తారకాసురుని వధించి బ్రహ్మ హత్యాదోషానికి గురైన సుబ్రహ్మణ్యస్వామి సైతం ఈ పుష్కరిణిలో స్నానంచేసి ఆ పాపాన్ని పోగొట్టుకున్నట్లు చెప్తారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి, భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం చెబుతోంది. 

ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు, ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్రస్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నదీ గమనార్హం
తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్నీ కావు. స్వామివారు నెలవై ఉన్న తిరుమలలో భక్తులకే తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఎన్నో యేళ్ల చరిత్ర ఉంది.

స్వామివారి తెప్పోత్సవాలన్నీ ఈ పుష్కరిణి నుంచే జరుగుతుంటుంది. ప్రతి యేడాది తెప్పోత్సవాలు జరిగే సమయంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుంటారు. అలాంటి పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తొమ్మిది తీర్థాలున్నాయి.

శ్రీవారి పుష్కరిణిలో కుబేర తీర్థం, గాలవతీర్థం, మార్కండేయ తీర్థం, అగ్నితీర్థం, యమతీర్థం, వశిష్ట తీర్థం, వరుణ తీర్థం, వాయు తీర్థం, సరస్వతి తీర్థం ఇలా మొత్తం ఏడు తీర్థాలున్నాయి. అసలు తీర్థాలకు ఉన్న ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం.

*కుబేర తీర్థం..* శ్రీవారి పుష్కరిణిలో ఉత్తరాన ధనద తీర్థం ఉంది. ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఇది కుబేర తీర్థం అని కూడా పిలువబడుతోంది. ఈ తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే చాలు సర్వపాపాలు నశించడమే కాదు ధన, ధాన్యాది సంపదలన్నీ సంప్రాప్తిస్తాయి.

*గాలవ తీర్థం..* స్వామి పుష్కరిణిలో ఈశాన్య భాగంలో గాలవ తీర్థం ఉంది. ఇది గాలవ మహర్షిచే నిర్మితమైంది. ఈ భాగంలోని తీర్థాన్ని త్రాగినా, లేదా ఇందులో స్నానం చేసినా ఇహ, పర సుఖాలు రెండూ సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

*మార్కండేయ తీర్థం...* శ్రీనివాసుని పుష్కరిణిలో తూర్పు భాగంలో మార్కండేయ మహర్షి నిర్మించిందే మార్కండేయ తీర్థం. ఇక్కడ స్నానం చేస్తే మానవులకు దీర్ఘాయుస్సు కలుగుతుంది.

*అగ్ని తీర్థం - యమతీర్థం...* వేంకటాచలం మీది స్వామి పుష్కరిణిలో ఆగ్నేయమూలలో అగ్ని దేవునిచే స్థాపించబడిన ఆగ్నేయ తీర్థం ఉంది. ఇందులో స్నానం చేసినట్లయితే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
అలాగే యమతీర్థం దక్షిణ భాగంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే మానవునికి నరక బాధ తప్పుతుంది.

*వసిష్ట తీర్థం...* వసిష్ట మహర్షిచే నైరృతి దిశలో నిర్మింపబడిన వసిష్ట తీర్థం కూడా ఈ స్వామి పుష్కరిణిలో భాగంగానే ఆవిర్భవించింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే తీవ్రమైన అప్పుల బాధలు తొలగుతాయి.

*వరుణతీర్థం - వాయుతీర్థం..* స్వామి వారి పుష్కరిణిలో పడమట వరుణతీర్థం, వాయుమూలన వాయుతీర్థంలు ఉన్నాయి. ఈ తీర్థాలు ముక్తిని కలిగిస్తాయి.

*సరస్వతి తీర్థం...* కలియుగ వైకుంఠుని పుష్కరిణి మధ్య భాగంలో మహాపాతకాలను నాశనం చేసేటటువంటి సరస్వతి తీర్థం ఉంది.

ఈ తొమ్మిది తీర్థాలలో ఒకేరోజున స్నానం చేసిన తర్వాత స్వామి పుష్కరిణికి దక్షిణ తీర్థంలో కొలువై ఉన్న శ్రీనివాస భగవానుని దర్శనం చేసుకున్న మానవునికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అంటే మోక్షం కలుగుతుంది.

స్వామి వారి పుష్కరిణి స్నానం, శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం, విష్ణు సహస్ర నామ పారాయణం ఈ మూడు కార్యాలు అత్యంత ఉత్తమమైన తప ఫలాన్ని కలిగిస్తాయి. అందువల్ల తొమ్మిది తీర్థాల నెలవుగా ఉన్న స్వామి పుష్కరిణిలో తప్పక స్నానం చేస్తుంటారు భక్తులు. ఆ తర్వాత అక్కడే ఉన్న శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుంటుంటారు. అలా ఒకవేళ చేయకపోతే ఆ క్షేత్రంలో ఎన్ని సేవలు చేసినప్పటికీ అవన్నీ ఈ నిష్ఫలాలే అవుతాయని పురాణాలు చెబుతున్నాయి.

వేంకటాచలం మీది ఈ స్వామి పుష్కరిణి ఒకానొకప్పుడు దశరథ మహారాజు సేవించుకుని సంతానాన్ని పొందాడు. ఆ తర్వాత శ్రీరామ చంద్రుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని రావణాసురుని చేత అపహరింపబడిన సీతాదేవిని పొందాడు.

తీర్థాలన్నీ పుష్కరిణిలోనే ఉన్నాయి. పుష్కరిణిలో మూడుసార్లు మునకేస్తే చాలు సర్వం శుభమే



గోవిందా గోవిందా

Tuesday, 21 July 2020

కాణిపాకం విశిష్టత - : 🙏🌺🌿🌺


ఈ పుణ్యక్షేత్రం బాహుధా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడుకట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు.ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది.

చరిత్ర - : 

కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం.చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్దం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది.మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరినీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.

ఏలా వెళ్ళాలి - :                
                                       బస్సు సౌకర్యములు తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును. రైలు సౌకర్యములు: ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరు లకు రైళ్ళు ఉన్నాయి. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా సులభముగా కాణిపాకం చేరవచ్చు.విమాన సౌకర్యములుతిరుపతి (రేణిగుంట) విమానాశ్రయానికి విమానాలు ఉన్నాయి.

కాణిపాకం ఆలయ సమూహము

కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు. సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్దీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం."బ్రహ్మహత్యా పాతక నివృత్తి" కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధిచెందింది ఇక్కడే వరసిద్ది వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజ స్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి వాయువ్వ దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజ స్వామి ఆలయం ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైనది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలున్నాయి.

Thursday, 18 June 2020

పంచభూత క్షేత్రాలలొ రెండవ క్షేత్రం జంబుకేశ్వరం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరాపల్లి జిల్లాలో తిరువనక్కవాల్ అనే గ్రామంలో ఉంది


పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ( తెల్లనేరేడు చెట్లు ) ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది అని అంటారు.శివుడు ఇక్కడ జలలింగ రూపంలో భక్తులకి దర్శనం ఇస్తాడు.

ఈ దేవాలయం విశాలమైన 5 ప్రాకారాలతో , ఎత్తైన 7 గోపురాలతో మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయంలో జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు. గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఆలయప్రాకారములో జంబుకేశ్వర స్వామి ఆలయం, అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయమే కాకుండా అనేక ఉప ఆలయాలు, అనేక మండపాలు ఉన్నాయి.
చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం శ్రీ రంగంలో ఉన్న రంగనాధ స్వామి ఆలయం కన్నా పురాతనమైనదని తెలుస్తోంది
ఈ ఆలయాన్ని క్రీ.శ 2 వ శతాబ్దంలో కోచెంగ చోళుడు నిర్మించాడు. ఆ తర్వాత పల్లవ రాజులు, పాండ్యులు , విజయనగర రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ది చేసినట్లు తెలుస్తోంది.

జంబుకేశ్వరుడిగా పేరుపొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితో నిర్మితమై కానీ నీటిలో లేదు. అయితే ఈ లింగం ఉన్న పానపట్టం నుండి ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టం పై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది.
ఈ ఆలయం ఎంతో విశాలంగా ఉన్నా గర్భాలయం మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. కేవలం ముగ్గురు నలుగురు మించి లోపలకి వెళ్ళి దర్శించుకునేంత అవకాశం లేనంత ఇరుకుగా ఉంటుంది ఇక్కడ. చాలామంది గర్భగుడికి ఉన్న "నవద్వార గవాక్షం" అనే పేరుగల కిటికీ నుండే ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు. ఈ జంబుకేశ్వరుడినే అప్పులింగేశ్వరుడు, నీర్ తిరళ్‌నాథర్ అని కూడా పిలుస్తారు.

ఇక్కడ స్వామివారి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు. అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు. నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకొన్నట్లు, క్రింది చేతులు అభయ హస్తంతో వరద ముద్రతో ఉన్నారు.
అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్ర రూపంగా ఉండేవారని శంకరాచార్యులు ఈమె ఉగ్ర రూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగా మార్చారని చెబుతారు. అమ్మవారి ముందు కనిపించే శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని, అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యులవారే సమర్పించారని చెబుతారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారని ఇక్కడి వారి నమ్మకం.
ఈ ఆలయం శ్రీరంగానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది

Saturday, 13 June 2020

తిరుపతిలోని " అలిపిరి " కి ఆ పేరు ఎలా వచ్చింది ... ?* ( శ్రీవారి మహిమలు - యదార్థ సంఘటనలు )

🌷🌾🍃🍂🌿🎋🌷


" తిరుమల " కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే మనం మొదట కొండ దిగువన ఉన్న " అలిపిరి " ప్రాంతానికి చేరుకోవాలి. 

అక్కడినుంచి కాలినడకన లేదా రకరకాల వాహనాలలో మనం సప్తగిరుల పైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటాం. 

అయితే కొండ క్రింద ఉన్న ఈ    "అలిపిరి" కి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు.

అసలు " అలిపిరి " అనే పేరే ఒక విచిత్రమైన పేరు లాగా ఉంది కదా ... ? మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ " అలిపిరి " అనే పదం లేదు. 

అయితే, " అలిపిరి " అనే ఈ పదం ఎలా పుట్టింది ... ? 

దీని వెనుక చరిత్ర ఏమిటి ... ?

అనే విషయం మన చరిత్రని నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యదార్థ సంఘటలను గురించి మనం తెలుసుకోవచ్చు.

పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం," తిరుపతి " నగరం ఇప్పటిలాగా లేదు.

ఇప్పుడు " అలిపిరి " అని పిలుస్తున్న ప్రాంతానికి-
"అలిపిరి" అన్న పేరు కూడా లేదు.

 మరి " అలిపిరి " అన్న పేరు ఎలా వచ్చిందో  పూర్తిగా చదివి తెలియనివారికి తెలియపరచాలని మా హృదయపూర్వక విజ్ఞప్తి.

అది ( 1656 - 1668 ) ప్రాంతం . ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీ కృష్ణ దేవరాయల అనంతరం జరిగిన " రాక్షసి తంగడి & తళ్ళికోట " మొ || యుద్ధాల తర్వాత, విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది. అప్పుడు నిజాం నవాబు రాయల సీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు. 

ఆ సమయంలో హిందువులను, హిందూ సానుభూతిపరులను, సాధుసంతులను చాలా దారుణంగా హింసించారు. 

ఈ నిజాం నవాబు, ఢిల్లీ సుల్తానుకు - కప్పం కడుతూ సామంతుడిగా పడి ఉంటూ, హిందువులపై నిరాఘాటంగా & ధారావాహికంగా అకృత్యాలు, అరాచకాలు చేస్తూ ఉండేవాడు.

పదిహేడో శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా ( ఆర్డర్ ) మేరకు సుల్తాన్ అబ్దుల్లా - కుతుబ్ షా & వజీర్ల సైన్యం, " ఆలీ " అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో, కడప, కర్నూలు, నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేసారు. ఆ తరువాత " ఆలీ " సైన్యం తిరుపతికి చేరుకుంది.

అప్పుడు, తిరుపతి చిన్న గ్రామం. ఇప్పుడు " మంచినీళ్ళ కుంట " అని చెప్పుకుంటున్న 
" నరసింహ తీర్థమే " అప్పటి తిరుపతి గ్రామం. 

ఇక్కడ ఒక నరసింహ స్వామి మందిరం ఉంది, దానికి ప్రజలు నిత్యం ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని " నరసింహ తీర్థం రోడ్ " అనే పిలుస్తారు.

ఆలీని తిరుపతికి పైకి దండయాత్రకు పంపించటానికి మూల కారణాలు రెండు : 

🌺ఒకటి : శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైన దేవుడు అనీ & తిరుమల లాంటి దివ్య క్షేత్రం ఇంకొకటి లేదు, భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవమ్ విశ్వాసం భారత దేశం నేల నాలుగు చెరలా ఉండడం వలన, ఈ దేవాలయం పై దాడి చేసి స్వామి వారి స్వరూపాన్ని పెకలించి కొండపై నుంచి తొలగించేస్తే, హిందువుల దేవుడు బలహీనుడనీ తద్వారా, ప్రజలందరూ " అల్లా " యే గొప్ప దేవుడని భావించి, " ఇస్లాం " మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన.

🌹రెండోది : శ్రీ కృష్ణ దేవరాయలు, భక్తితో స్వామి వారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు, వైఢూర్యాలు, కనక పుష్యరాగాలు, కెంపులూ & అపారమయిన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందామని. 

అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు, " ఆలీ " ( కమాండర్ ఇన్ చీఫ్ ) ని సమీపించి నీక్కావలసింది బంగారమే కదా ! మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ & పురుషుల వద్ద వున్న బంగారం అంతా ఇచ్చేస్తాం, దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో, కానీ మా స్వామి వారి జోలికి రావద్దు, ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు. 

దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్చందంగా ఇచ్చిన బంగారం, ఆభరణాలు తీసుకుని, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చెయ్యకపోతే నిజాం నవాబూ & ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి, తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు.

సరిగ్గా ఇప్పుడు " అలిపిరి " అని పిలవబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే, శ్రీ ఆది వరాహ స్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు. మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు. అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయమూ లేకుండా అతని రెండు కళ్ళూ పోయాయి, దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు.

అప్పుడు , శ్రీ స్వామి వారి " అమృత వాణి " వాడికి వినబడింది, దైవం పైనే దాడికి సిద్ధపడ్డావా ? ఎంత ధైర్యం ... ? అని. అప్పుడు ఆలీ బిగ్గరగా రోదిస్తూ ... క్షమాభిక్ష అడిగి, నేత్ర దానం చెయ్యమని వేడుకున్నాడు. 

అప్పుడు దయార్ద్రచిత్తుడయిన స్వామి వారు, నీవు వెనుదిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుందని ఆదేశించారు. దానితో ఏమీ సాధించకుండానే రిక్త హస్తాలతో వెనుదిరిగాడు "ఆలీ". 

ఉర్దూ లేక హిందీ భాషలో " ఫిర్ నా " అంటే వెనక్కి మళ్ళడం, " ఫిరే ' అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం. ఎప్పుడు, ఎక్కడా ఓటమెరుగని పరమ ఆ దుర్మార్గుడైన ఆలీ వెనుతిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ " ఆలీ ఫిరే, ఆలీ ఫిరే " అని చెప్పుకునేవారు. 

కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్లిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్లలేక వెనుదిరిగాడు " ఆలీ ఫిరే ", 
"ఆలీ ఫిరే" అని సూచిస్తూ ... చాటింపులు సైతం వేయించారు.

" ఆలీ " ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్నే అప్పటివారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు. ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారని ఎవరైనా అడిగినప్పుడు " అలీ ఫిరే" ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు. 

*కాలక్రమంగా ఆ ఆలీ ఫిరే అనే పదం - ఆలి పిరే గా రూపాంతరం చెంది ఇప్పుడు " అలిపిరి గా స్థిరపడింది.* 

ఇదీ మనమిప్పుడు " అలిపిరి " గా పిలుచుకునే ప్రదేశం యొక్క యదార్థమైన చరిత్ర.

అప్పుడు తురుష్కులు చేస్తున్న, చేసిన దురాగతాలూ మరియు పైన పేర్కొన్న ఘటనల గురించి, " వేంకటాచల విహార శతకము " అని ఒక కవి వ్రాయడం జరిగింది. దీని ఆధారంగా స్వర్గీయ " ఎన్టీఆర్ " " వేంకటేశ్వర కళ్యాణం " సినిమాలో కొంత చూపించారు. 

ఈ " వేంకటాచల విహార శతకము " లో ముఖ్యం గా ( 6, 9, 90 & 98 ) పద్యాలలో, కవి తురుష్కులు చేస్తున్న పాపాలు, దౌర్జన్యాలకు విపరీతంగా కోపం తెచ్చుకుని శ్రీ స్వామి వారిని తీవ్రంగా ప్రశ్నించాడు. మీ గోవిందరాజు బొజ్జ నిండా తిని హాయిగా పడుకున్నాడు, ఇన్ని అరాచకాలు జరుగుతున్నా లేవడా .. ? అని. 

 *పాలు వెన్న బకాళబాతు దధ్యోదనంబు పుళి రెము వెన్న బూరియలును సరడాల పాశముల్ ? చక్కెర పులగముల్ నువ్వుమండిగలు మనోహరములు*

 *అప్పము లిడైన లతిరసాల్ హోళిగల్ వడలు దోసెలు గలవంటకములు శాకముల్ సూపముల్ చాలు లంబళ్లు శుదనములును సద్యోఘృతమ్ము* 

 *పండ్లు తేనెలు హొబ్బట్లు పచ్చడులును మెక్కి మము బోంట్లు గ్రుక్కిళ్లు మ్రింగుచుండ బర్వసేయవు నీవంటి బ్రదుకుగాదె శత్రు సంహార వెంకటాచల విహార* 
( వేంకటాచల విహార శతకం )

సుల్తానుల సైన్యం చేస్తున్న ఆగడాలను భరించలేక వారిని నశింపజేయమని కోరుతూ ఓ అజ్ఞాత కవి ఈ శతకం వ్రాశాడు. 

ఆరోజుల్లో సుల్తానుల సైన్యం ఆలయాలలోకి వెళ్ళి విగ్రహాలను నాశనం చేసేవాళ్లు. జిగురుపాల కోసం అనే వంకతో దేవాలయాలలో ఉండే రావి చెట్లను నరికేసేవాళ్లు. గుడి పూజారులు నుదుట పెట్టుకునే నామాలను బలవంతంగా తుడిపేయించేవాళ్లు. 

ఇలా అరాచకాలు చేసే అల్లరిమూకల్ని అడ్డగించి గెలవడం ఓ వేంకటేశా ... నీకైనా శక్యమేనా ? ఏదో వెఱ్రితనం కొద్దీ నీకు అంటూ దేవుణ్ణి రెచ్చగొట్టే పద్యాలు ఇందులో కనిపిస్తాయి. కొండపైన నువ్వు కొండ దిగువన మీ అన్న గోవిందరాజ స్వామి లేవనైనా లేవకుండా మొద్దు నిద్ర పోతున్నారని ఆరోపిస్తాడు ఈ కవి. ఆయన పేరు ఈ శతకంలో ఎక్కడా కనిపించదు. 

ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలీ వెనుదిరిగిన కారణంగా, ఈనాడు మనం చూస్తున్న " అలిపిరు ఏర్పడింది . 

 *కొసమెరుపు :* ఒక్క ఆలీనే కాదు, తిరుమల శ్రీవారి ఆలయం గురించి, ఏడు కొండల గురించి కానీ, లేదా స్వామి వారిని గురించి కానీ తప్పుగా మాట్లాడినవారు, తప్పుడు ఆలోచనలు చేసిన వారు ఎందరో కాలగర్భంలో కలిసి పోయారు.  

కానీ, అన్ని కాలాలకి, అన్ని సంఘటనలకి ఆ సాక్షిభూతుడిగా సర్వకాల సర్వావస్థుడిగా ఆ శ్రీవారు చిరునవ్వులు చిందిస్తూ ... మన కళ్ళముందే ఉన్నారు, అదే ఆయన వైభవమ్. 

Saturday, 6 June 2020

నక్షత్రము – ధరించవలసిన రుద్రాక్షలు….


అశ్వని – నవముఖి,
భరణి-షణ్ముఖి,
కృత్తిక – ఏకముఖి, ద్వాదశముఖి,
రోహిణి – ద్విముఖి,
మృగశిర -త్రిముఖి,
ఆరుద్ర- అష్టముఖి,
పునర్వసు- పంచముఖి,
పుష్యమి- సప్తముఖి,
ఆశ్లేష – చతుర్ముఖి,
మఖ- నవముఖి,
పుబ్బ- షణ్ముఖి,
ఉత్తర-ఏకముఖి, ద్వాదశ ముఖి,
హస్త – ద్విముఖి,
చిత్త – త్రిముఖి,
స్వాతి- అష్టముఖి,
విశాఖ-పంచముఖి,
అనురాధ – సప్తముఖి,
జ్యేష్ఠ-చతుర్ముఖి,
మూల- నవముఖి,
పూర్వాషాఢ- షణ్ముఖి,
ఉత్తరాషాఢ- ఏకముఖి లేదా ద్వాదశముఖి, శ్రవణం- ద్విముఖి,
ధనిష్ట -త్రిముఖి,
శతభిషం- అష్టముఖి,
పూర్వాభాద్ర – పంచముఖి,
ఉత్తరాభాద్ర- సప్తముఖి,
రేవతి- చతుర్ముఖి

Tuesday, 2 June 2020

చిత్తూరు జిల్లాలో చాల ప్రసిద్ధ దేవాలయాలు



తిరుమల  తిరుపతి :
 ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి.

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో నాలుగు బస్టాండ్‌లు ఉన్నాయి. తిరుమలకు దగ్గరి లోని రైల్వే స్టేషను తిరుపతి. తిరుపతి స్టేషనుకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంట, తిరుమలకు అతి దగ్గరి విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు నుండి నేరుగా విమాన సేవలు ఉన్నాయి.

కాణిపాకం :
కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడు కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.

 తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరు లకు రైళ్ళు ఉన్నాయి. తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయానికి విమానాలు ఉన్నాయి.

శ్రీకాళహస్తి :
ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన, పంచభూతలింగము లలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా, విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల యొక్క పనితనానికి కాణాచిగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు. శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము.

శ్రీకాళహస్తి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన తిరుపతికి ముఫ్ఫై ఎనిమిది కి.మీ.ల దూరంలో నెల్లూరుకు సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి ఇక్కడికి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని ముఖ్య పట్టణాల నుండి ప్రతిరోజు బస్సు సదుపాయం ఉంది.  గూడూరు-తిరుపతి దక్షిణ రైలు మార్గంలో శ్రీకాళహస్తి రైల్వే స్టేషను ఉంది. గూడూరు చెప్పుకోదగ్గ జంక్షన్ కాబట్టి చాలా రైళ్ళు ఇక్కడ ఆగుతాయి.

నారాయణవనం :
శ్రీ వేంకటేశ్వర స్వామికి పద్మావతికి ఇక్కడే వివాహం జరిగిందని అంటుంటారు. దానికి ఋజువుగా ఇక్కడ అమ్మవారి నలుగు పిండికి అవసరమైన తిరగలి కనిపిస్తోంది. ప్రతిఏడూ అమ్మవారికి 18 రోజులపాటు జాతర జరుగుతింది. అది ఆగస్టు 22 - 26 తేదీల మద్యలో ప్రారంబమై సెప్టెంబరు 11 -12 తేదీలలో ముగుస్తుంది. ఈ అమ్మవారికి పూజలు చేస్తే పెళ్ళికానివారికి పెళ్ళి అవుతుందని, పిల్లలు కలగని వారికి పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మిక. శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి అయిన ఆకాశ రాజుకు ఈ అమ్మవారి కటాక్షంతోనే పద్మావతి జన్మించిందని భక్తులు నమ్ముతారు. నారాయణవనం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన జనగణన పట్టణం. ఇది పుత్తూరుకి 5 కి.మి., తిరుపతికి 40 కి.మి. దూరంలో ఉంది.  ఇక్కడ జలపాతాలు సంవత్సరంలో 365 రోజులు ప్రవహిస్తూ ఉంటాయి.

నాగలాపురం :
ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది.శ్రీమహావిష్ణువు మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి మత్స్యావతార మెత్తుతాడు. సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది. ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి.

చిత్తూరు జిల్లాకు చెందిన నాగలాపురం గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది .

కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం :
తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలోని ఆలయాల్లో శ్రీనివాస మంగాపురం ఆలయం ఒకటి. పద్మావతీ శ్రీనివాసుల పెళ్ళి అనంతరం కొత్త పెళ్ళికూతురైన పద్మావతిని తీసుకుని వరాహక్షేత్రానికి దక్షిణంగా స్వర్ణముఖీ నది ఒడ్డునున్న అగస్త్యాశ్రమానికి విచ్చేస్తాదు శ్రీనివాసుడు. స్వర్ణముఖి, కల్యాణి, భీమనదుల త్రివేణీ సంగమంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.

తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో తిరుపతి నుండి మదనపల్లికి వెళ్ళేదారిలో ఉంది. యాత్రికులు తప్పక దర్శించవలసిన క్షేత్రం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాల సందర్శనార్ధం బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు శ్రీనివాస మంగాపురం ఆలయానికి కూడా వెళ్తాయి.

అలమేలు మంగాపురం :

దీనిని అలమేలు మంగా పురమని కూడా అంటారు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీ దేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది. త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడు.

తిరుచానూరు లేదా అలమేలు మంగాపురం అనే ఊరు చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం సమీపంలో ఉంది.  పబ్లిక్ బస్సు సర్వీసు, ప్రైవేట్ బస్సు సర్వీసు , రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం, టాక్సీ సౌకర్యం , ఉన్నాయి.

అరగొండ - అర్ధగిరి :
ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీస్కుని వెళ్తున్న సమయం కాణిపాకం దగ్గర్లో పర్వతం నుంచి కొంతభాగం క్రింద పడినదని స్థలపురాణం. ఆ ప్రదేశాన్ని అర్ధగిరి అని పిలుస్తారు. అరకొండ అని పలకడం బదులు తమిళనాడు సరిహద్దుల్లో ఉండటం వల కొండ బదులు గొండ అయి మొత్తానికి అరగొండ గా మార్చారు. ఇక్కడ తీర్ధం సేవించడం  వల్ల  రోగాలు నయమౌతాయని చెబుతారు.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట :
అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయం అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో ఒకటి. యిది అప్పలాయగుంట లో వెలసినది. శ్రీ వేంకటేశ్వరుడు నారాయణ వనం లో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంట లో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడు. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడ లోని అగస్తేశ్వరు ని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగా పురం లో ఆరునెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా (నూరు మెట్ల దారి) తిరుమల చేరాడని స్థల పురాణం.

అప్పలాయ గుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. తిరుపతి నుండి పరిసరప్రాంతాలలోని ఆలయ సందర్శన బస్సులు కూడ ఇక్కడి వస్తుంటాయి. తిరుపతికి వచ్చిన వారు తప్పక చూడవలసిన ఆలయమిది.

శ్రీ మొగిలీశ్వరస్వామివారి ఆలయం :
చిత్తూరు జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి తరువాత పేర్కొనదగిన ప్రసిద్ధ శైవక్షేత్రం మొగిలి. ఇక్కడ వెలిసివున్న దేవుడు మొగిలీశ్వరుడు. దేవత కామాక్షి. ఈ దేవాలయం రెండు శతాబ్దాల ప్రాచీనతను సంతరించుకుని ఉంది. ఈ దేవాలయానికి బంగారుపాళ్యం జమీందారులు వంశపారంపర్యంగా ధర్మకర్తలుగా ఉంటున్నారు. ఈ దేవాలయంలోని శివలింగం భూగర్భము నుండి ఆవిర్భవించింది. కామాక్షీదేవి విగ్రహము మాత్రము ప్రతిష్ఠించింది. మొగిలి, చిత్తూరు జిల్లా, బంగారుపాలెం మండలానికి చెందిన గ్రామం.

గుడిమల్లం :
ఈ మధ్యకాలంలో ఈ ఆలయంలోని స్వామి వారి ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. విగ్రహం చూడగానే ఆలయం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది.ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము, ముఖ మండపముల కన్నా లోతులో ఉంటుంది . ఇక్కడ గర్భ గృహములో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు. ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. ఈ ఆలయం వున్న గ్రామం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం లో వుంది.

కోదండ రామాలయం, తిరుపతి :
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని కోదండ రామాలయం ప్రాచీనమైన మరియు ప్రఖ్యాతమైన హిందూ దేవాలయం. ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఈ ఆలయం ఎదురుగా భక్తాంజనేయస్వామి వెలసియున్నారు. భవిష్యోత్తర పురాణంలో శ్రీరాముడు సీతాన్వేషణ సఫలమగుటకు శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించినట్లు చెప్పబడింది. ఆ కాలంలో ప్రస్తుతము ఆలయమున్న ప్రదేశంలో ఒక గుహ వెలసి ఉండేదని ప్రతీతి. అందుండి దివ్యమైన తేజస్సు వెలువడుతుండేది.

తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో మరియు తిరుమల తిరుపతి బాలాజీ ఆలయం నుండి 24 కిలోమీటర్ల దూరంలో, కోదండరామ స్వామి ఆలయం తిరుపతి పట్టణం నడిబొడ్డున ఉంది.

తలకోన :
ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటుంది. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాత ప్రదేశం అత్యంత రమణీయ ప్రకృతి ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు. తలకోన శేషాచల కొండల వరుసలో తల భాగంలో వున్నందున దీన్ని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు మూడు వందల అడుగులు. ఈ జలపాత దృశ్యం నయనానంద కరంగా వుంటుంది. ఇక్కడ చేరగానే మొదట మనం కనుగొనేది సిద్దేశ్వరాలయము మరియు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాలు.

తలకోనకు తిరుపతి, పీలేరు నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. పీలేరు నుంచి 50 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది.తిరుపతి బస్ స్టాండ్ నుండి ప్రతి రోజు ఉదయం 7 గంటలకు నేరుగా తలకోనకు బస్సు సౌకర్యం ఉంది, మళ్ళి తలకోన నుండి తిరుపతికి సాయింత్రం 4 గంటలకు ఇదే బస్సు ఉంది.

బోయకొండ గంగమ్మ :
 కొన్నేళ్ల క్రితం వరకు అతి సాధారణ గ్రామ దేవత ఆలయంగా వున్న ఈ ఆలయం కొన్ని సంవత్సరాల నుండి చాల ప్రాముఖ్యత వహిస్తున్నది. చిత్తూరు జిల్లాలో ఈ తరహా గ్రామ దేవతల ఆలయాలన్నింటి కన్న ఈ ఆలయం అతి ప్రసిద్ధి పొందినది. ఈ అలయం ఒక చిన్న కొండపై వెలసి ఉంది. ఇది కర్ణాటకకు తమిళ నాడు రాష్ట్రాలకు కూడా దగ్గరగా వున్నందున ఆ యా రాష్ట్రాల భక్తులు కూడా వస్తుంటారు. ఇక్కడ జరుగుతున్న బలులు, వంట కార్యక్రమాలు హైదరాబాద్ లోని బంజార హిల్సు లోని పెద్దమ్మ గుడి వద్ద జరిగే కార్యక్రమాలను తలపిస్తుంది.

బోయ కొండ గంగమ్మ దేవాలయం చిత్తూరు జిల్లాలో పుంగనూరు దగ్గర ఉంది. ఇది గ్రామ దేవత ఆలయం. ఈ ఆలయానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం తిరుపతి. ఈ ఆలయానికి తరచుగా రోడ్డు రవాణా అందుబాటులో ఉంది. గంగమ్మ ఆలయానికి చేరుకోవడానికి పకాలా రైల్వే జంక్షన్ సమీప రైల్వే స్టేషన్ మరియు ఈ ప్రదేశం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కైలాసకోన గుహాలయం :
చిత్తూరు జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోనలో ఉన్న గుహాలయం దర్శించుకోదగ్గ ఆలయం. ఇది కైలాస కోన కొండపై ఉంది. నారాయణపురంలో పద్మావతీ వేంకటేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు కైలాసం నుండి విచ్చేసిన శివపార్వతులు ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఈ పర్వతం మీదే గడిపారట. పార్వతీపరమేశ్వరులు నివసించడం వల్ల ఈ కొండకు కైలాస కోన అనే పేరు వచ్చిందనే కథనం బహుళ ప్రచారంలో ఉంది. చిత్తూరు జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోనలో ఉన్న గుహాలయం దర్శించుకోదగ్గ ఆలయం.

కైలాసకోన జలపాతం లేదా కోన్ జలపాతం ఉత్తూకోట్టై - పుత్తూరు - తిరుపతి రహదారిపై ఉంది. ప్రధాన జలపాతం కారు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. కార్ పార్కింగ్ వద్ద 10 కి పైగా కార్లు పార్క్ చేయడానికి తగినంత స్థలం ఉంది. కార్ పార్కింగ్ నుండి, ప్రధాన జలపాతం 3 నుండి 5 నిమిషాల నడక ద్వారా, చక్కగా వేయబడిన దశల ద్వారా చేరుకోవచ్చు. ఈ మార్గం రాత్రి సమయంలో ప్రకాశిస్తుంది.