ఆషాఢ మాసంలో కృత్తిక నక్షత్రం ఉన్న రోజున ఆడి కృత్తిక గా జరుపుకుంటారు. సుబ్రహ్మణ్యస్వామికి అత్యంత ప్రీతికరమైన రోజ. ఆడి కృత్తిక నాడు సుబ్రహ్మణ్య భక్తులు తమిళనాడులో *"ఆరు పడైవీడు"* ప్రసిద్ది చెందిన ఆరు ప్రధాన క్షేత్రాలను దర్శించి విశేష పూజలు చేస్తారు. వీటిని ఒకే రోజులో దర్శించలేం. ఆడి కృత్తిక నాడు శరవణ భవ నామంతో కలిపి ఈ క్షేత్రాల పేర్లను తలుచుకుంటే దర్శించిన ఫలం లభిస్తుంది.
పార్వతీ దేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తికా నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందట. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక గనుక దీనిని ఆది కృత్తిక అనీ , ఆషాడ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అనీ కూడా అంటుంటారు. అందుకే ఆషాఢ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది.
ఈ ఆషాడ కృత్తిక సుబ్రహ్మణ్యం స్వామి కి చాలా విశేషం. కావడి ఉత్సవాలతో పళనిలో, తిరుత్తణిలో భక్తులు పోటెత్తి పోతారు. *"మురగనుకు హోరోహర" , "వేలునుకు హరో హరో" , "వెల్ వెల్ మురుగు శక్తివేల్ మురగా"* అంటూ భజనలతో ఆట పాటలతో ఎంతో వైభవంగా ఈ కావడి ఉత్సవాలు ఈ ఆషాడ మాసంలో జరుపుకుంటారు.
ఆషాడ కృతిక నాడు కావడి ఎత్తుతాము అని ఏదైనా మొక్కు ఉన్న వారికి తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది అని భక్తుల నమ్మకం. మొక్కు ఉంటేనే కాదు భక్తితో కావడి ఉత్సవం చేసుకునే వారు చాలా మంది ఉంటారు. ఈ కావడి తీసుకుని సుబ్రహ్మణ్యం స్వామి కొండకు వెళ్లే వారికి వివాహ దోషాలు , తరచూ వచ్చే ఆరోగ్యం సమస్యలు , పిల్లలు పుట్టక ఇబ్బంది పడే వారు , తరచూ ఎదో ఒక ఆటంకాలు తో వ్యాపారం లో ఇబ్బందులు ఉన్న వారు ఈ కావడి ఎత్తి దర్శనం కి వెళ్లడం వల్ల వారి సమస్యలు తొలగి సంతోషం గా ఉన్న కుటుంబాలు ఎందరో ఉన్నారు.
*_ఆడి కృత్తిక ఎలా జరుపుకోవాలి?_*
ముందు రోజు రాత్రి , ఆడికృత్తిక రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మందమతులు , జడులు , మతి స్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు.
ఆడికృత్తిక రోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత చలిమిడితో ప్రమిద చేసి అందులో ఆవు నేతితో మూడు వత్తుల దీపం వెలిగించాలి. ఈ దీపాన్ని శివుడు , పార్వతీ దేవి , వినాయకుడు , సుబ్రహ్మణ్యుడు ఉన్న చిత్రపటం ముందు వెలిగించాలి. పచ్చి పాలు , వడపప్పు , అరటి పండ్లు , తాంబూలం నివేదించి , సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు , సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని , కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ప్రసాదంగా చిమ్మిలి , వడపప్పు , అరటి పండ్లు స్వీకరిస్తారు.
ఆడి కృతిక నాడు ఉదయం తల స్నానం చేసి సుబ్రహ్మణ్యం స్వామి ఫోటో అలంకరణ చేసి , బియ్యం పిండితో దీపాలు వెలిగించాలి. పానకం తో పాటు యధాశక్తిన నైవేద్యం సమర్పించి స్వామికి స్త్రోత్రం , అష్టోత్తర పారాయణ చేసి స్కంద షష్ఠి కవచం పారాయణ చెయ్యవచ్చు. కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. అవకాశం ఉన్నవారు ఎవరికైనా ఇంట్లో భోజనం పెడితే మంచిది. వీలైతే ఎవరైనా వేదవిధునికి కుదిరితే బాల బ్రహ్మచారి అయిన వేదవిధునికి షడ్రసోపేతమైన భోజనం పెట్టి , ఎర్రటి పంచ , పైపంచ , శక్తిమేరకు దక్షిణ , తాంబూలం , అరటి పండ్లు , గొడుగు , పాదరక్షలు , రాగి చెంబు (లేదా పంచపాత్ర ఉద్ధరిణ , అర్ఘ్య పాత్ర) సమర్పించి అతడినే సుబ్రహ్మణ్యునిగా భావించి ఆశీర్వచనం తీసుకుంటే విశేష ఫలితం కలుగుతుందని శాస్త్ర వచనం. ఒకవేళ బాల బ్రహ్మచారియైన వేద విధుడు లేక గృహస్తు అయిన వేద విధుడు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైన ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుగా ఆహారం పెట్టినా మంచిదే. ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశు పక్షాదులకు ఆహారం. సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్ధించినా ఉత్తమ ఫలితం ఉంటుంది.
*_కావడి ఎత్తడం ఎలా?_*
ఆడి కృతిక సుబ్రహ్మణ్యం స్వామి పండగ. ఇందులో మాల వేయడం ఉండదు. ఆ రోజు కావడి తీసే వారు తీస్తారు. ఇందులో పాల కావడి పళ్ళ కావడి అని ఉంటుంది ముందుగా కావడి కి కావాల్సిన కర్రలు , (తెల్లజిల్లేడు కర్ర , నేరేడు కర్ర , పాల కర్ర ) ఇలా రకరకాలుగా కర్రలు కంటలు కట్టి అమ్ముతుంటారు ఏదైనా కర్ర తీసుకోవాలి కావడి కట్టే బట్టలు ఒక పక్క బుట్టలో స్వామి గుడిలో ఇవ్వాల్సిన పూజ సామానులు నింపుతారు ఇంకో వైపు మూడు రకాల పండ్లు నింపుతారు , పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారు , ఇంట్లో పిండి దీపాలు పెట్టి సుబ్రహ్మణ్యం స్వామి కి పూజ చేశాక కావడి అందంగా అలంకారం చేసి పూజ చేస్తారు ఇంట్లో భోజనాలు పెట్టుకుని కావడి భుజాన పెట్టుకుని హరో హర అని భజనలు చేస్తూ తిరుత్తణికి గాని పళణికి గాని వెళ్లి కావడి సమర్పించి వస్తారు. తిరువణ్ణామలైలోని శ్రీరమణులు పళని సుబ్రహ్మణ్యస్వామి స్వరూపం అని చెపుతారు. అందుకని ఆడి కృత్తికకు అరుణాచలానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని గిరి ప్రదక్షిణ చేస్తారు.
No comments:
Post a Comment