🔅 జమ్మూకాశ్మీర్ : కట్రా
🔅 శ్రీ మాత వైష్ణోదేవి మందిర్
💠 వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ దేవాలయం 18 శక్తి పీఠాలలో కాదు కానీ 51 శక్తి పీఠాలలో ఒకటిగా ఉంది.
💠 వైష్ణోదేవి యాత్రికులు ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు మరియు తిరుమల వెంకటేశ్వర ఆలయం తరువాత భారతదేశంలో అత్యధికంగా సందర్శించే రెండవ మత మందిరం ఇది.
💠 హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంభోదిస్తారు.
అమ్మవారికి ఇతర పేర్లు:
వైష్ణవి, మాతా రాణి, అంబే, త్రికూట, షెరావాలి, జ్యోతావళి, పహడవాలి, దుర్గ, భగవతి, జగదాంబ, లక్ష్మి, విష్ణుమాయ, విష్ణుప్రియ, రామ, మణికి.
💠 ఈ ఆలయం జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో సముద్ర మట్టమునకు 5200 అడుగుల ఎత్తులో ఉంది.
💠 వైష్ణవదేవి గుహాలయంలో సృష్టి, స్థితి, లయలకు మూలాధారమైన పరాశక్తిని మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా నిరూపించే మూడు విగ్రహాలున్నాయి.
💠 శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రముతో సతీదేవి శరీరమును ఖండించినప్పుడు సతీదేవి పుర్రె త్రికూట పర్వతములలోని ఈ ప్రదేశమునందు పడినట్లు ఈ క్షేత్రము వైష్ణోదేవి శక్తి పీఠముగా వెలుగొందుచున్నట్లు పురాణ కధనము.
శివుడు శక్తి పీఠములు అన్నిటికీ కాలభైరవుడిని క్షేత్ర పాలకునిగా నియమించాడు.
అందువలన శక్తి పీఠములు అన్నిటిలోనూ క్షేత్ర పాలకుడు కాలభైరవుని ఆలయం కలదు.
🔆 స్థల పురాణం 🔆
💠 పూర్వము అసురుల బాధలు ఎక్కువగా వుండి. వారితో పోరాడి భూలోకంలో ధర్మాన్ని ప్రజలని రక్షించుటకు జగన్మాతలు మహాలక్ష్మీ, మహాకాళి, మహాసరస్వతులు తమ తేజస్సునుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింప చేయ సంకల్పించి ఒక అందమైన యువతని సృష్టించి ఆ యువతిని భూలోకంలో రత్నాకరసాగర్ అనే ఆయనకి విష్ణు అంశతో పుత్రికగా జన్మించి ధర్మ కార్యాలు చేయమని, ఆధ్యాత్మిక పరిపక్వత చెందిన పిమ్మట శ్రీ మహావిష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు.
💠 రత్నాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణం చేశారు.
వైష్ణవి అడవుల్లోకెళ్ళి తపస్సు చేయసాగింది. అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలో వున్న శ్రీరామచంద్రుడు అక్కడికి రాగా వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి శ్రీమహావిష్ణువుగా గుర్తించి, తనని ఆయనలో లీనం చేసుకోమని కోరింది.
💠 శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయంకాదని, తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరకొస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు.
ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం, రావణవధానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమె దగ్గరకు ఒక వృధ్ధుడి రూపంలో వచ్చాడు. కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోతుంది.
అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే కోరిక తీరలేదు.
💠 బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి, ఆమె తనలో ఐక్యమవటానికి తగిన సమయమింకా రాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు.
త్రికూట పర్వత శ్రేణిలోని ఒక గుహలో ధ్యానం చేయమని చెప్పి, ఆమెకు రక్షణగా ఒక విల్లు,బాణం, సింహం మరియు చిన్న వానర సైన్యాన్ని ఇచ్చాడు.
💠 శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వతసానువుల్లో తన తపస్సు కొనసాగించింది.
కొంతకాలం తర్వాత గోరఖ్ నాధ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకు రావటానికి తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు.
💠 భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనించాడు. తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బాణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం వుండటం గమనించాడు.
భైరవనాధుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించి వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు.
భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది.
💠 తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరం మీద పడింది.
అప్పుడు తన తప్పు తెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్ధించాడు.
మాత దయతలచి, తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది.
💠 తదనంతరం వైష్ణవి త్రికూట పర్వతంపైన గుహలో, 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది.
వైష్ణోదేవిలో గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు (పిండీలంటారు అక్కడివారు) ఆ మాత తలలే. వాటినే మహాకాళీ, వైష్ణోదేవి, మహా సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు.