Thursday, 18 June 2020

పంచభూత క్షేత్రాలలొ రెండవ క్షేత్రం జంబుకేశ్వరం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరాపల్లి జిల్లాలో తిరువనక్కవాల్ అనే గ్రామంలో ఉంది


పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ( తెల్లనేరేడు చెట్లు ) ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది అని అంటారు.శివుడు ఇక్కడ జలలింగ రూపంలో భక్తులకి దర్శనం ఇస్తాడు.

ఈ దేవాలయం విశాలమైన 5 ప్రాకారాలతో , ఎత్తైన 7 గోపురాలతో మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయంలో జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు. గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఆలయప్రాకారములో జంబుకేశ్వర స్వామి ఆలయం, అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయమే కాకుండా అనేక ఉప ఆలయాలు, అనేక మండపాలు ఉన్నాయి.
చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం శ్రీ రంగంలో ఉన్న రంగనాధ స్వామి ఆలయం కన్నా పురాతనమైనదని తెలుస్తోంది
ఈ ఆలయాన్ని క్రీ.శ 2 వ శతాబ్దంలో కోచెంగ చోళుడు నిర్మించాడు. ఆ తర్వాత పల్లవ రాజులు, పాండ్యులు , విజయనగర రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ది చేసినట్లు తెలుస్తోంది.

జంబుకేశ్వరుడిగా పేరుపొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితో నిర్మితమై కానీ నీటిలో లేదు. అయితే ఈ లింగం ఉన్న పానపట్టం నుండి ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టం పై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది.
ఈ ఆలయం ఎంతో విశాలంగా ఉన్నా గర్భాలయం మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. కేవలం ముగ్గురు నలుగురు మించి లోపలకి వెళ్ళి దర్శించుకునేంత అవకాశం లేనంత ఇరుకుగా ఉంటుంది ఇక్కడ. చాలామంది గర్భగుడికి ఉన్న "నవద్వార గవాక్షం" అనే పేరుగల కిటికీ నుండే ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు. ఈ జంబుకేశ్వరుడినే అప్పులింగేశ్వరుడు, నీర్ తిరళ్‌నాథర్ అని కూడా పిలుస్తారు.

ఇక్కడ స్వామివారి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు. అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు. నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకొన్నట్లు, క్రింది చేతులు అభయ హస్తంతో వరద ముద్రతో ఉన్నారు.
అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్ర రూపంగా ఉండేవారని శంకరాచార్యులు ఈమె ఉగ్ర రూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగా మార్చారని చెబుతారు. అమ్మవారి ముందు కనిపించే శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని, అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యులవారే సమర్పించారని చెబుతారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారని ఇక్కడి వారి నమ్మకం.
ఈ ఆలయం శ్రీరంగానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది

No comments:

Post a Comment