Saturday, 25 May 2024

రోహిణీ కార్తీ ప్రభావం

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞 
ఈ సంవత్సరం ఋతుపవనాల వలన

రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండలు దద్దరిల్లుతాయి.
మరి ఈ సంవత్సరం రోహిణి కార్తె ఏలా ఉంటుందో గమనిద్దాం. తేదీ. ఈ సంవత్సరం రోహిణి కార్తే మే 25 న ప్రారంభమై జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉంటుంది.

రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు , ఎండ తీవ్రతలు , అగ్ని ప్రమాదాలు , ఉక్కపోతలు ఉంటాయి.

ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావునా ఆరోగ్య రీత్య తగు శ్రద్దలు తీసుకోవాలి. ఎక్కువ మట్టికుండ నీళ్ళు త్రాగడం , మజ్జిగా , పండ్ల రసాలు , కొబ్బరినీళ్ళు , నిమ్మరసం , రాగి జావ , ఫలుదా లాంటివి ఎక్కువగా త్రాగడం వలన ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది కొంత ఉపశమనం లభిస్తుంది. మసాలాకు సంబంధించిన ఆహార పదార్ధాలు , వేపుళ్ళు , పచ్చళ్ళు , ఎక్కువ ఆయిల్ ఫుడ్ కలిగిన ఆహార పదార్ధాలు తినకూడదు.

నీళ్ళ సౌకర్యం ఉన్నవారు తప్పకుండా రెండు పూటల స్నానం చేయండి. అన్నిరకాల వయస్సు వారు ఎక్కువ కాటన్ దుస్తులు వాడండి , తెల్లని రంగు కల్గినవి , తేలిక రంగులు గల కాటన్ బట్టలు ధరిస్తే ఉష్ణ తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. శారీరక తాపం తగ్గుతుంది. చిన్నపిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో తుడిచి బట్టలు మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమం.

ముఖ్యంగా సాటి జీవులైన పశు , పక్ష్యాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటికి నీళ్ళను ఏర్పాటు చేయండి. బాటసారులు ఎవరైనా సరే వాళ్ళు అడగక పోయిన వాళ్ళ దాహాన్ని తీర్చెందుకు వారికి త్రాగడానికి చల్లటి నీళ్ళను అందివ్వండి. ఇలాంటి సంఘ సేవా కార్యక్రమాలు చేయడం వలన మీకున్న గ్రహభాదలు నివారణకు మార్గమై కొంత ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో పుణ్యఫలం దక్కి అంతా మంచి జరుగుతుంది.

Friday, 10 May 2024

తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?

 తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
 
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. *ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ?
 
పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు , విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తన కోసం సింహాచలం కొండ మీద శాశ్వతంగా కొలువుండమంటూ ప్రహ్లాదుడు నారసింహుని వేడుకున్నాడు. ప్రహ్లాదుని కోరికను మన్నించి స్వామివారు ఇక్కడ వెలిశారు. ఆ స్వామివారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి , నిత్యం ఆయనను కొలుచుకునేవాడట ప్రహ్లాదుడు. అయితే కాలం మారింది. యుగం మారింది. సింహాచలం మీద ఉన్న ఆలయం శిథిలమైపోయింది.
 
చాలా సంవత్సరాల తరువాత ఈ ప్రాంతానికి పురూరవుడు అనే రాజు విహారానికి వచ్చాడు. అప్పుడు ఆయనకు స్వామివారు కలలో కనిపించి.... తన విగ్రహం ఒక పుట్టచేత కప్పబడి ఉందనీ , ఆ పుట్టని తొలగించి తనని దర్శించమనీ చెప్పారు. అప్పుడు పురూరవ మహారాజు సహస్ర ఘటాలతో పుట్ట మీద నీరు పోసి స్వామివారి నిజరూపాన్ని దర్శించారు. ఇదంతా జరిగింది అక్షయ తృతీయ రోజునే అని స్థలపురాణం చెబుతోంది.
 
ఉగ్రమూర్తి అయిన నరసింహుని రూపానికి ప్రకృతి యావత్తూ తల్లడిల్లిపోగలదు. అందుకనే తన మీద చందనాన్ని లేపనం చేయమని పురూరవునికి నారసింహుడు ఆదేశించారు. ఇక మీదట తన నిజరూపాన్ని ఏటా ఒక్కసారి మాత్రమే భక్తులు చూడగలరనీ , మిగతా సమయాలలో చందనపు పూతతో నిండిన తన నిత్యరూపాన్ని మాత్రమే చూస్తారనీ అనుగ్రహించారు. అలా స్వామివారి ఆదేశంతో అక్షయ తృతీయ రోజున మాత్రమే ఆయన నిజరూపాన్ని దర్శించేందుకు చందనోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

✍🏻🚩 సర్వే జనాః సుఖినోభవంతు🚩

తులసీ చెట్టు వద్ద ఉంచకుడని వస్తువుల

తులసి చెట్టు వద్ద పెట్టకూడని వస్తువులు ఏమిటి..?? 🌿

🍀 భారతీయ సనాతన ధర్మంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చాలామంది హిందువుల ఇళ్లలో ఖచ్చితంగా తులసి మొక్క ఉంటుంది. ఆ మొక్కకు ప్రతి రోజూ పూజలు చేస్తుంటారు. దీపం వెలిగించి ప్రార్థనలు చేస్తుంటారు. అయితే, తులసి మొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు వేద పండితులు. మనం తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లే.. ఇంట్లో అనేక ఇబ్బందులకు కారణాలు అవుతాయని చెబుతున్నారు. మరి తెలియకుండా చేసే పొరపాట్లు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

🍀1. వాస్తు శాస్త్రం ప్రకారం.. తులసి చెట్టు సమీపంలో పొరపాటున కూడా శివలింగాన్ని ఉంచకూడదు. తులసి మహావిష్ణువుకు ప్రతీకరమైనది. జలంధరుడు అనే రాక్షసుడి భార్య అయిన తులసికి గత జన్మలో బృందా అనే పేరు ఉండేదట. అయితే, జలంధరుడిని పరమ శివుడు సంహరించాడట. ఈ కారణంగా పరమ శివుడిని తులసితో పూజించరని వేద పండితులు చెబుతున్నారు.

🍀2. తులసి చెట్టు వద్ద గణేషుడి విగ్రహం ఉంచకూడదని శాస్త్రాలు, వేద పండితులు చెబుతున్నారు. పౌరాణిక కథ ప్రకారం.. గణేషుడు నది ఒడ్డున తపస్సు చేస్తుండగా తులసి దేవి నదిలోంచి బయటకు వస్తుంది. గణపతి అందానికి ముగ్ధురాలైన ఆమె.. పెళ్లి ప్రతిపాదన చేస్తుంది. అయితే, గణేషుడు ఆమెను నిరాకరించగా.. ఆగ్రహించిన తులసి రెండు వివాహాలు చేసుకుంటావని గణేషుడిని శపిస్తుందట. అలా తులసి చెట్టు వద్ద గణేషుడి ప్రతిమ పెట్టకూడదని చెబుతుంటారు.

🍀3. వాస్తు శాస్త్ర ప్రకారం.. తులసి చెట్టు ఉన్న ప్రదేశంలో చెప్పులు, బూట్లు ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఫలితంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.

🍀4. తులసి చెట్టు దగ్గర ఎప్పుడూ చెత్త బుట్టను ఉంచకూడదు. తులసి మొక్క చుట్టూ చెత్త వేయడం వల్ల ఇంట్లో ఆర్ధిక, అనారోగ్య కష్టాలు మొదలవుతాయి.

🍀5. తులసి మొక్క వద్ద పొరపాటున కూడా చీపురు, చెత్త ఉంచకూడదు. తులసి మొక్క దగ్గర చీపురు పెడితే ఇంట్లో అశుభం జరుగుతుందని అంటారు.

 కెర్లేపల్లి బాలసుబ్రమణ్యం
పుంగనూరుఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

https://kutumbapp.page.link/?isi=1598954409

Tuesday, 23 April 2024

హనుమాన్ చాలీసా

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
తులసీదాస్...
            *హనుమాన్ చాలీసా*
                   ➖➖➖✍️

*500 క్రితం జరిగిన యదార్ధ సంఘటన. పూర్తిగా చదవండి...*

*ఒళ్ళు గగురుపొడిచే అద్భుతమైన హనుమ లీల ...!*

*ఉత్తరభారతదేశంలో క్రీ. శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. *

*భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామ కథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. *

*తులసీదాస్ రచించిన... 'రామచరితమానస్' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామ కథను సుపరిచితం చేసింది. *

*వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. *

*వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు.*

*సమకాలీనులైన ఇతర మత పెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు. ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు.*

*జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది.* 

*ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు.*

*దానితో ఆమె కడు దీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవ యాత్ర చూపించింది.* 
 
*వెంటనే తులసీదాస్ “తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు!” అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామ నామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు.*
*ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.*

*ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామ భక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది.* 

*ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు.*

*ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.*

*పాదుషా :- తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !*

*తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?*

*పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?*

*తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.*

*పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.*

*తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవ మాత్రులు మార్చలేరు.*

*పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.*

*తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం !*

*పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు.*

 *అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు.*

*అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు.*

*అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్ద నున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి.*

*ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు.*

*ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.* 
*ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు.*

*అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మ చరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు.*

*ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వహిస్తాము' అని వాగ్దానం చేశారు.* 

*అప్పట్నుండి ఇప్పటివరకు 'హనుమాన్ చాలీసా' కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.*

*అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక 'హనుమాన్ చాలీసా'. దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతిఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. *
*ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Thursday, 7 March 2024

అష్టాదశ శక్తి పీఠాలు

సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలని శక్తి పీఠాలు అని ఎందుకు అంటారు..??

అష్టాదశ శక్తి పీఠాలు 
         హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలను గుర్తించడానికి ఎటువంటి ఇతిహాసిక ఆధారాలూ లేవు. పురాణాలు, శాసనాల ఆధారముగా ఈ శక్తిపీఠాలను గుర్తించగలిగారు.

🌺ఈ శక్తిపీఠాలు మన దేశములోనే కాకుండా, పాకిస్తాన్, శ్రీలంక, టిబెట్, నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. పరిశోధకుల అంచనాల మేరకు ఆసియాఖండములో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

🌺శక్తిపూజా నేపధ్యాన్ని తెలుసుకోవడము అవసరము. మానవుడు తన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు. ఈ శకులన్నిటి వెనుక ఒక విశిష్టశక్తి ఉన్నదని తెలుసుకొన్నాడు. ఆ శక్తినే దేవుడు అని అన్నాడు. ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ఆడ, మగ అని విడదీసి పెళ్ళిల్లు చేసే ఆచారమూ తీసుకువచ్చాడు. 

🌺ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితమివ్వసాగాడు. అందులోనూ స్త్రీ దేవతకు ఎక్కువ మహిమనిస్తూ భయ భక్తులతో ఆరాధింప సాగాడు. ఈ ప్రక్రియలో త్రిమూర్తుల కల్పన రూపుదాల్చింది. వీరిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులన్నాడు. వారు క్రమముగా సృష్టి, స్థితి, లయ కర్తలని పేర్కొన్నాడు. వీరి భార్యలను సరస్వతి, లక్ష్మి, పార్వతి అనియూ వీరు విద్య, ధన, మాతృరూపాలలో ఉన్నారని అన్నాడు. ఈ విధముగా ప్రకృతి శక్తి ఒక్కటే అయినా మానవుడు తనకిష్టమైన రూపములో, తనకిష్టమైన రీతిలో ఆరాధించడము సాగిస్తూ ఉన్నాడు.

అష్టాదశ శక్తి పీఠాలు - పురాణ కధ
🌺ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. 

🌺ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి, సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ 'శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.

🌺కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

🌺అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. 

🌺మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ (గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్పూర్-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం.

1. శాంకరీదేవి
🌺లంకాయాం శాంకరీదేవి అంటే మునులూ రుషుల లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నా డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.

2. కామాక్షి
🌺సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి. స్థలపురాణం ప్రకారం. మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. 

🌺అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.

3. శృంఖల
🌺అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్లో ఉన్నదని కొందరూ కోల్కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న 'చోటిల్లామాత' ను అక్కడివారు శృంఖలా (శృంగళా) దేవిగా భావిస్తారు. 

🌺కానీ పశ్చిమబెంగాల్లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.

4.చాముండి
🌺హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం చెప్తుంది. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

5.జోగులాంబ
🌺మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి.

6.భ్రమరాంబిక
🌺విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం చెప్తుంది. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.

7. మహాలక్ష్మి
🌺రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్ను 'అవిముక్త క్షేత్రం' గా వ్యవహరిస్తారు.

8. ఏకవీరాదేవి
🌺మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలోని మాహోర్ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు.

9. మహాకాళి
🌺సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా.

10. పురుహూతిక
🌺పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో) తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్పూర్ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.

11. గిరిజాదేవి
🌺గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

12. మాణిక్యాంబ
🌺సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.

13. కామాఖ్య
🌺అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్బేహార్ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

14. మాధవేశ్వరి
🌺అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమని అంటారు.

15. సరస్వతి
🌺పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని నేటి ముజఫరాబాద్కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.

16. వైష్ణవీదేవి
🌺అమ్మవారి నాలుక హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.

17. మంగళగౌరి
🌺సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

18. విశాలాక్షి
🌺సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.

🌺ఇవీ ప్రధానమైన 18 శక్తిపీఠాలు. ఇంకా అమ్మవారి ఆభరాణాలు పడినచోట్లనూ లెక్కిస్తే 51 శక్తిపీఠాలని కొందరూ 108 పీఠాలని మరికొందరూ అంటారు. ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక తదితర దేశాల్లో ఒకప్పుడు ఉండేవని చెబుతారు.

_లింగోద్భవ కాల నిర్ణయం_*

*_𝕝𝕝 ॐ 𝕝𝕝 మహశివరాత్రి లింగోద్భవకాలః 𝕝𝕝 卐 𝕝𝕝_*

*_లింగోద్భవ కాల నిర్ణయం_*

మాఘ కృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిశి। శివలింగ తయోద్భూతః కోటి సూర్యసమప్రభః॥ కృష్ణపక్షే భవేద్యాతు మాఘమాసే చతుర్దశి | శివరాత్రి రితిప్రోక్తా మహాపాతకనాశినీ ॥ యద్యర్థరాత్ర పరక్తం భవేచ్ఛివ చతుర్దశి ॥

॥ ఐశ్వర్యం ఈశ్వారాధిచ్ఛేత్ ॥

“ఒక కణము జలము” “ఒక్కింత భస్మంబు"తో పరవశించి అనుగ్రహించెదవా పరమశివా !

మహా శివరాత్రి రోజున స్వామి నామస్మరణ తెలిసి చేసినా తెలియక చేసినా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది అని మన శాస్త్రాలు, పురాణాలు చెపుతున్నాయి. కాని మనమందరం ఉదయం నుండి ఆహారం తీసుకోకుండా ఆరాధిస్తూ, స్వామి "మనలను అనుగ్రహించే తరుణం లో" మనకు దర్శనమిచ్చే తరుణంలో మాత్రం మనం నిర్లిప్తతో ఉంటున్నాం. అందరం రాత్రి 12 గంటలకు లింగోద్భవకాలం అని అనుకుంటూ ఉంటాం కాని ప్రతి సంవత్సరం లింగోద్భవకాలం మరియూ ప్రమాణము మారుతూ ఉంటుంది. ఇట్టి మహత్తరమైన కాలన్ని మనమందరమూ సద్వినియోగ పరుచుకుని ఆ ఆది దంపతుల అనుగ్రహాన్ని పొందుదాము.

👉 ఈ సంవత్సరం 08-03-2024 శుక్రవారం రా.12 గం 30 ని 13 సె నుండి రా.12 గం 32 ని 53 సె పాటు లింగోద్భవకాలం. అందరం లింగోద్భవకాలంలో పరమేశ్వరున్ని ధ్యానించి ఆ స్వామి అనుగ్రహం పొందుదాం.

లింగోద్భవ కాలంలో కేవలం బిల్వదళం తో కూడిన శివలింగాన్ని దర్శిస్తేనే 76 జన్మల పాపం పోతుంది అని పార్వతీ దేవికి స్వామి వారే స్వయంగా చెప్పారని మన పురాణాలు చెపుతున్నాయి. ఇక మనమే స్వయంగా ఆరాధిస్తే ఎంత పుణ్యమో చెప్పాలా !

👉 ఇంకా విశేషించి శివరాత్రి రోజున నాలుగు యామముల యందు నాలుగు పూజలు చేయుట విశేషము.

*1. ప్రథమ యామం - శ్రీ శివాయనమః -*
*రా.06:25 - 09:28 గంటల వరకు.* 

 *2. ద్వితీయ యామం - శ్రీ శంకరాయనమః - *రా.09:29 - 12:31 గంటల వరకు.* 

 *3. తృతీయ యామం - శ్రీ మహేశ్వరాయనమః -
*రా.12:32 - 03:34 గంటల వరకు.*

 *4. చతుర్ధ యామం - శ్రీ రుద్రాయనమః - *రా.తె.03:35 - 06:37 వరకు.*

సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడూ అందులోనూ తేజో లింగస్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఈ కథా సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది.

ఒక్క శివలింగానికి కాసింత పూజను, అభిషేకాన్ని ఏ రోజు చేసినా పుణ్యఫలమే. అందులోనూ శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు, అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేముంటుందని పురాణజ్ఞులు, పండితులు అంతా అనేమాట వాస్తవమే. 

అసలు మనిషి దైవ సందేశాన్నందుకొని లోక యాత్రలో పుణ్య పురుషుడుగా మెలగాలన్నదే మన ఆర్షవాణి, సంప్రదాయ పర్వదినాల అవతరణలో అసలు విషయం. ఇక లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశమేమిటి? ఆ భవుడికి, భవనాశనుడికి, శంకరుడికి నచ్చనిది ఏది? అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావితమై కనిపిస్తుంది.

పూర్వం ఓసారి బ్రహ్మకు, విష్ణువుకు తాను గొప్పంటే తాను గొప్పన్న అహంకారం కలిగింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది. లోకాలన్నీ ఆ తగవులాటవల్ల భీతిల్లుతున్న తరుణంలో చంద్ర శేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నాడు. వెంటనే వారి ముందు ఒక దివ్యతేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగరూపంలో అవతరించేలా చేశాడు. అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్యతేజోస్తంభం ఏమిటా అని హరి, బ్రహ్మలు యుద్ధంమాని విస్తుపోతూ చూశారు. వెంటనే పార్వతీ వల్లభుడు తన దివ్యలీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని, ఆ స్తంభం (లింగం) అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మురొకరు చూసి రావాలని, ఎవరు ముందుగా వస్తే వారే గొప్పని, వారికే సర్వాధిపత్యం అని చెప్పాడు. వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరటానికి వెళ్ళాడు. విష్ణువు వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవటానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు.

హరి, బ్రహ్మలకు ఆ దివ్యతేజో రాశి ఆద్యంతాలు ఎంతకీ అంతు పట్టలేదు. ఇంతలో పై నుండి ఒక కౌతకి (మొగలిపువ్వు) రావటం హంస రూపంలో ఉన్న బ్రహ్మ చూశాడు. బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజో రాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు. పాతాళం వైపు వెళ్ళిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు. ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకొని శివుడి దగ్గరకొచ్చాడు. బ్రహ్మ, ఆ తర్వాత కొద్ది సేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ పై కొచ్చాడు. శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని కూడా వెంటపెట్టుకొచ్చానన్నాడు. ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకువచ్చిది. వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మను దండించమన్నాడు. 

భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదుతలలలో అబద్ధం ఆడిన తలను తుంచేశాడు. తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశుడిని శరణు వేడుకొన్నాడు. పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడి గొప్పప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించాడు. బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు. శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడ్డాడు. ఇంతకు ముందు లాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని, అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు, పూజలు ఏవీ ఉండవని చెప్పాడు. అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలందుకుంటాడని, స్థితి కారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు.

మొగలిపువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలిపువ్వుకు చోటుండదని అన్నాడు. అయితే ఆ కేతకి శివుడికి పరిపరివిధాల ప్రణమిల్లింది. భక్తవత్సలుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలిపువ్వును ధరిస్తారని, అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్థానమయ్యాడు. ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాపఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది. మానవులాంతా సత్యమార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తోంది.

*సంసార క్లేశ దగ్ధస్య వ్రతేనానేన శంకర |*
*ప్రసీద సుముఖో నాథ జ్ఞాన దృష్టి ప్రదోభవ॥*

 *_స్వస్తి_* 

*𝕝𝕝 ॐ 𝕝𝕝 _oఓo నమః శివాయః_ 𝕝𝕝 卐 𝕝𝕝*

Friday, 19 January 2024

రామాయణంలో చిన్న పాత్రలు

రామాయణంలో చిన్న పాత్రలు

రత్నం వందే అను హనుమత్ స్వయంప్రభా సంభాషణము
మరియు
సీతమ్మ మా యమ్మ 

దక్షిణ సముద్రం అది ! మహోదధిగా పిలుస్తారు. దాని ఒడ్డున దాదాపు పాతిక మంది వీరులు కొందరు కూర్చుని, కొందరు నిలబడి, కొందరు నడుమువాల్చి దక్షిణ దిశగా చూస్తున్నారు. అందరి కళ్ళలో ఆతృత, ఆశ ! నిస్పృహగా ఎవరూ లేరు.

అప్పుడే ఇరవై గడియలు దాటింది. ఇప్పుడో, ఇంకొక గడియో అని ఎదురు చూస్తున్నారు.

"యువరాజా ! మనం ఎంతవరకు వేచి చూడవచ్చు ?" అని అడిగాడొక నవయువక వీరుడు.
""ఆయన తిరిగి వచ్చేదాకా !" క్లుప్తంగా అని మళ్ళీ దక్షిణం వైపు దృష్టి సారించాడు నాయకుడు యువరాజు. "ఈపాటికి వచ్చేస్తూ ఉండాలి " అని స్వగతంగా అనుకున్నాడు.
దూరంగా ఉరిమింది, సాగరం, ఆకసం కలిసేచోట బంగారపు రంగుతో మేఘం కనబడింది. అది అత్యంత వేగంగా ఉత్తర దిక్కుగా వీరి వైపే వస్తున్నది. యువరాజు ముఖంలో చిరునవ్వుతో కూడిన ఉత్సాహం.

ఆ మేఘం రాను రాను పెద్దదవుతూ చివరకు కొండంత ఆకారంతో, వానర రూపంతో, నేలమీదకు దిగి తోకను తిరిగి తిరిగి భూమికి తాటిస్తూ "చూచాను సీతను !" అని నిజ ఆకారం దాల్చింది.

అత్యంత సంతోషంతో అక్కడ సెలయేరులో దూకి ముమ్మారు మునకలు వేసి ఒడ్డుకు వచ్చి ముందుగా అత్యంత వరిష్ట యోధుడైన భల్లూకప్రభువు జాంబవంతునికి భక్తితో సాగిలపడ్డాడు హనుమ.

వానరవీరులందరూ ఒక్కపెట్టున జయజయధ్వానాలు చేశారు. ఆ తర్వాత హనుమ, యువరాజు అంగదుడు, మైందుడు, ద్వివిదుడు ఆదిగా గల వీరులను సమాదరించి లంకకు బయల్దేరి వెళ్ళినది మొదలు తనకు ఎదురైన అవాంతరాలను, తాను ఎదుర్కొన్న వైనాలు, సీతాన్వేషణా వివరాలు, అశోకవనిలో తల్లిని కనుగొన్న వార్త, ఆ తర్వాత రావణ సైన్యంతో యుద్ధం, రావణుడితో భేటీ, లంకా దహనం అన్ని వివరాలూ క్లుప్తంగా చెప్పి అంగదుడి వైపు తిరిగి "యువరాజా ! శ్రీ రామ ప్రభువుకు శీఘ్రంగా ఈ వార్త తెలియజేయాలి. మీరు ఆజ్ఞాపిస్తే వెంటనే ప్రస్రవణ పర్వతాన్ని చేరుకుందాము " అన్నాడు.

********* ***********

వేగంగా కిష్కింధ కు వెళ్తున్న వానరులను మధ్యలో మధువనం నుంచి వచ్చే తేనె పరిమళాలు అకస్మాత్తుగా ఆపేశాయి.

అంగదుడి వైపు వారంతా దీనవదనాలతో చూశారు. వారి ఆకలి, ఆలోచనను పసిగట్టిన యువరాజు చిరునవ్వుతో అంగీకారంగా తల ఊపాడు. ఆయనకీ ఆకలిగానే ఉంది పాపం.

ఆనందోత్సాహాలతో ముందుగా వారు భాండాగారం మీద దండయాత్ర చేశారు. ముందుగా అంగదుడి ఆజ్ఞ మేరకు అన్నిటి కన్నా పెద్ద తేనె భాండాన్ని జాంబవంతుడికి సభక్తికంగా సమర్పించి, ఆ తరువాత అంగదుడికి ఇచ్చి, మిగిలిన భాండాలను సమానంగా పంచుకున్నారు.

ముందుగా ఉత్సాహం, ఆ వెంట ఆనందం, ఆ పైన ఉల్లాసం చివరగా ఉన్మాదం స్థితి లోకి ఇట్టే వెళ్ళి పోయారు. కుండలు ఖాళీ కాగానే చెట్ల మీద పడి తేనె తుట్టెలు పిండేసి తాజా మధువును గ్రోలేశారు. అవి అయిపోగానే చెట్ల పండ్లను ఆరగించేసారు.

తనకిచ్చిన భాండం నుంచి కొద్ది కొద్దిగా తాగిన జాంబవంతుడు ఆ భాండం ఖాళీ ఐన తర్వాత చుట్టూ చూశాడు. కొంచెం దూరంలో హనుమంతునితో మాట్లాడుతున్న యువరాజు కనిపించాడు. హనుమంతుడు చెప్పిన దానికి అంగీకార సూచకంగా తల ఆడించి వేరే కుండ అందుకున్నాడు అంగదుడు.
జాంబవంతుడు రామనామ జపంలో మునిగిపోయాడు.

******** *********

దివ్యమైన మణిమయ హేమ కాంతులతో అలరారే భవనాలు. ఆ ముందర రత్నకాంతులీనుతూ మహా వృక్షాలు . ఒక వృక్షం క్రింద ధ్యాన ముద్రలో పద్మాసనం వేసుకుని ఉంది ఒక వృద్ధ తాపసి.

ఆమె ఎదురుగా రెండు గడియలనుంచి సహనంగా వేచి ఉన్నాడు హనుమ. ఆయన కూడా అర్ధనిమీలిత నేత్రాలతో రామనామ స్మరణ చేస్తున్నాడు. ఆ తాపసి నెమ్మదిగా కళ్ళు తెరిచి నమస్కారం ఆచరించి అప్పుడు హనుమను గమనించింది. .

ఏదో మంత్రం వేసినట్లు హనుమంతుడు కూడా కళ్ళు తెరిచి రాముడికి మనసా నమస్కరించి, ఆ తాపసికి వందనమాచరించాడు.
"నాయనా ! రెండే రోజులైనట్లు ఉంది ? మళ్ళీ వచ్చావు. నీ స్వామి కార్యం సఫలమైనదా ?" అని అడిగింది చిరునవ్వుతో .
"అమ్మా ! మీ ఆశీర్వచనం వమ్ము ఎప్పుడూ అవదుగా తల్లీ ! ఆ రామచంద్ర ప్రభువు అనుగ్రహంతో నేను వెళ్లిన పని సఫలమైనదమ్మా !"
"చాలా సంతోషం నాయనా ! నీకు సమయం ఉంటె నాకు నీ ప్రయాణ విశేషాలు చెబుతావా !"

"ఎంత మాట అమ్మా ! నీకు అన్నీ చెబుదామని వచ్చాను. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి సంపాతి. మాకు మార్గ నిర్దేశనం చేసిన వాడు. ఆయనకీ ప్రభువు కార్యం మీద మాకు మాట సాయం చేసినందుకే కాలిపోయిన ఆయన రెక్కలు తిరిగి వచ్చేసాయి. ఆయనకు నెమ్మదిగా చెపుతాను. మీకు విశేషాలు చెపుతానమ్మా !"
అని హనుమ స్వయంప్రభకు తన మహేంద్రగిరి నుంచి లంక వరకు జరిగిన ప్రయాణాన్ని, మైనాక, సురస, సింహికా వృత్తాంతాలను చెప్పాడు.

"నాయనా ! మైనాకుడు సత్త్వ గుణంతో నీకు ఆతిధ్యమివ్వబోతే నీవూ సత్వ బుద్ధితోనే ఆదరించావు. సురసను దేవతలు నిన్ను పరీక్షించడానికి పంపారు. ఆమె రాజస బుద్ధితో నిన్ను అడ్డుకుంటే రాజసంగానే యుక్తితో ఆమెను అధీగమించావు. తామస ప్రవృత్తి తో సింహిక నిన్ను మడియించాలని చూస్తే నీ పరాక్రమంతో ఆమెను నిర్జించావు. త్రిగుణములను జయించావు నాయనా !"
"అమ్మా ! అంతా మీ ముత్తాత గారు, మా గురుదేవులు శ్రీ సూర్య భగవానుని శిక్షణయే తల్లీ"

లంకలో ప్రత్యేకంగా రావణ మందిరంలో సీతాన్వేషణను, మండోదరికి చూసి సీత అని భ్రమపడడము విని ఆమె చిరునవ్వుతో తలపంకించింది. అశోకవనంలో సీతను కనుగొన్న వైనం విని ఆమె " హనుమా ! లంకకు బయల్దేరే ముందు రామలక్ష్మణులను , నీ తండ్రినీ. దేవతలనూ, మరుద్గణాలనూ స్మరించావు, కానీ అశోక వనం ప్రవేశించే ముందు సీతా లక్ష్మణులను కూడా స్మరించుకున్నావు. అందు వలననే అమ్మ దర్శనమైంది." అన్నది.

"అవునమ్మా ! అది గ్రహించాను తల్లీ!"

హనుమంతుడు సీతా మాత స్థితిని చూసి చలించిపోవడము విని ఆమె సానుభూతితో తల పంకించింది.

ఆ తర్వాత రావణుడు రావడము, సీతమ్మ ఆయనను తృణీకరించడము, రావణుడు బెదిరించి రాక్షస స్త్రీలతో ఆమెను ఒప్పించమని ఆదేశించడము విని సానుభూతిగా శిరః కంపం చేసింది.

హనుమ రామకథను అవధీ భాషలో గానం చెయ్యడం విని మెచ్చుకోలుగా హనుమ వైపు చూసింది. సీతామాత హనుమను చూడడము, ఆయనను రాముడి గురించి ప్రశ్నలు వెయ్యడమూ, ఆయన రామ లక్ష్మణుల వర్ణనను ఆనందంగా విన్నది.

అంగుళీయకం ఇచ్చిన పిమ్మట సీతామాత హనుమను పూర్తిగా నమ్మడము, ఆ పైన హనుమ సీతను తన మూపున అమ్మను తీసుకుని వెళ్తానని వేడుకోవడం విని కొద్దిగా ఆశ్చర్యం ప్రకటించింది. సీతమ్మ తిరస్కరించడం విని సంతృప్తిగా తల ఆడించింది.

ఆ తరువాత అశోకవన ధ్వంసము, రావణ మంత్రి కుమారుల హతము, జంబుమాలి మరణము తరువాత అక్షకుమారుని స్వర్గపురానికి పంపడము చివరిగా మేఘనాధునితో ద్వంద్వ యుద్ధము, ఆ పై బ్రహ్మాస్త్రానికి కట్టుబడినట్లు ఉండి లొంగిపోవడము ఆశ్చర్యముగా విన్నది.

రావణ సభలో రావణునితో సంవాదము, రావణుని మరణ శిక్షా ప్రకటన, విభీషణుడి ప్రమేయంతో అది తోకకు నిప్పు పెట్టడం విని తృప్తిగా తలాడించింది.

లంకా దహనం వృత్తాంతం విని విజయసూచకంగా చిరునవ్వు నవ్వింది.
మరలా సీతా దర్శనం చేసి మరలి వచ్చానని చెప్పి హనుమంతుడు మిన్నకుండిపోయాడు.

హనుమంతుని మాటల్లో తేడాను, ఆయన కంఠంలో ఇంచుక గద్గదతను గమనించి స్వయంప్రభ అడిగింది, "నాయనా ! ఇంతటి కఠినమైన కార్యం అంత సులభంగా పూర్తి చేసి ఈ బేలతనమేమిటయ్యా ?"

హనుమ ముఖంలో ప్రసన్నత ఉన్నా ఆయన కపోలాలపై కన్నీరు కారిపోతున్నది.

"తల్లీ ! ఇంత కాలం సీతా విరహంతో శ్రీరాముడి దుఃఖాన్ని చూశానమ్మా ! ఆయన పడిన కష్టాలు ఎవరూ, చివరికి సుగ్రీవ ప్రభువు కూడా పడలేదని అనుకున్నానమ్మా ! ఈ రోజు సీతమ్మ ను చూసాక ఆ ఆలోచన మారిపోయింది. "

"అలా ఎందుకనిపించింది ఆంజనేయా ?"

"తల్లీ ! శ్రీ రాముడు సీత కనిపించక దుఃఖించాడు. ఎన్నో చోట్ల అన్వేషించాడు, జటాయువు మరణాన్ని దగ్గరగా చూచాడు, తండ్రి వంటి ఆయనకు ఏంటో దుఃఖంతో అంతిమ సంస్కారాలు చేసాడు, తమ్ముడు లక్ష్మణుడు ఆయన వెంటే ఉంటూ ఉత్సాహ పరిచేవాడు.

వారు వనాలు, నదీ నదాలు దాటారు , శబరి ఆశ్రమంలో సేదతీరారు , శ్రీ రాముడు సుగ్రీవుని సఖ్యత పొందాడు, వాలిని కూల్చి సుగ్రీవునికి రాజ్యాభిషేకం చేశాడు , చివరికి సీతమ్మ ఎక్కడ ఉన్నదో తెలియక సుగ్రీవుడు వానర సేనలను నాలుగు దిక్కులకి పంపినప్పుడు ఆమె ఎటువైపు దిక్కులో దొరుకుతుందో తెలియక బాధ పడ్డాడు. చివరకు మమ్ములను దక్షిణ దిక్కుగా పంపుతూ ఎక్కువ సూచనలు ఇస్తూ ఉండడం చూసి ప్రభువు మా మీద నమ్మకంతో అంగుళీయకాన్ని నాకు ఇచ్చారమ్మా !'

"నాయనా ! సుగ్రీవుడికి రావణుడు ఎక్కడ ఉంటాడో తెలియదా ? ఆయన చాకచక్యంగా శ్రీరామునికి ఆ విషయం తెలియనివ్వకుండా నాలుగు చెరగులా వానరులను పంపాడు. ముందరే రాముడికి లంక సంగతి తెలిస్తే అటు వైపే బయల్దేరుదామని తొందర చేసే వాడు. రావణుడు ఆ విషయం పసిగట్టినట్టయితే సీతను వేరేచోట ఇంకా ఎక్కువ జాగ్రత్తలతో దిగ్బంధం చేసేవాడు."

"కానీ అమ్మా ! సీతమ్మను చూశాక ఆమె పరిస్థితి అర్ధం చేసుకున్నాక అమ్మ పడిన కష్టాల ముందు శ్రీ రాముడి కష్టాలు ఎక్కువ కాదనిపించిందమ్మా ! ఆమె కళ్ళ ఎదురుగా మామగారి ప్రియమిత్రుడు జటాయువు రెక్కలు తెగి గిలగిలా కొట్టుకోవడం చూసిందమ్మా ! రావణుడు ఏ దిక్కుగా పోతున్నాడో ఆమెకు తెలియలేదు, మాపై విసిరిన ఆమె ఆభరణాల మూట తప్ప ఇంక ఆవిడ ఏమీ చెయ్యలేక పోయిందమ్మా ! రావణుడి దేశమేదో తెలియదు. ఆ దేశంలో తనను ఉంచిన అశోకవనం ఏ దిక్కున ఉందొ తెలియదామెకు రామా రామా అని అహోరాత్రాలూ శోకించడం తప్ప ఏమీ చెయ్యలేకపోయింది, రావణుడు వచ్చి వదరే మాటలు విని గుడ్ల నీళ్లు కుక్కుకోవడం, రాక్షస స్త్రీలు ఆమెను నిత్యమూ బెదిరించడం, రావణుడు ఇచ్చిన ఏడాది గడువు పది నెలలు గడచిపోవడం, తన ఉనికి శ్రీరాముడికి తెలుసో లేదో కూడా ఎరగదమ్మా ఆమె. చివరకు నేను చేసిన రామ గుణగానం విని కూడా నన్ను రాక్షసుడనే అనుమానించిందమ్మా మా అమ్మ !" అని ఇంక మాట్లాడలేక ఊరుకున్నాడు హనుమ.

కొంత తేరుకుని "నేను వచ్చేటప్పుడు ఏమని అన్నదో తెలుసా అమ్మా , మా సీతమ్మ ? 'నాయనా నిన్ను చూస్తుంటే నా ఆప్త బంధువును చూసినట్లు ఉన్నది. ఇంకొక్క రోజు ఉండిపోరాదా తండ్రీ !' అని అడిగిందమ్మా " అని మళ్ళీ కంఠం రుద్ధమవగా ఆపేశాడు హనుమ.

"నేను ఇంకొక్క రోజు ఆమె దగ్గర ఉండలేదే అని దుఃఖితుడనువుతున్నానమ్మా !" అన్నాడు.

"ఊరడిల్లు నాయనా ! రామునికి ఆ వార్త తెలియక పొతే ఎన్ని అనర్ధాలు కలిగేవో" అన్నది ఆ తాపసి.

"అమ్మా !మా సీతమ్మ కష్టాలు గట్టెక్కేనా ? రామయ్య రావణుడిని నిర్జించి సీతమ్మను చేపడతారు కదా ? ఇద్దరూ అయోధ్యకు మరలివెళ్లి పట్టాభిషిక్తులౌతారు కదా ? అమ్మకు ఇంక పరీక్షలకు తట్టుకునే శక్తి లేదనిపిస్తోందమ్మా ! నువ్వు అవునని అనుమమ్మా ! నీ వాక్కు అమోఘం " అన్నాడు హనుమ.

"నాయనా ! ఇంకా కొంత కర్మ పరిపక్వమవ్వాలి. సీత అగ్నిశిఖ తండ్రీ ! అన్నిటినీ తట్టుకుంటుంది" అన్నదే కానీ ఇంక వివరించలేదు.

హనుమ కూడా ఆమె ముఖ కవళికలు గమనించి ఇంక పొడిగించలేదు.

"నాయనా ! నువ్వు ఇంక బయల్దేరి శ్రీ రాముడి దగ్గరకు వెళ్ళు. ఆయనకు ఈ శుభవార్త అందజెయ్యి. నీ వలన కావలసిన మహత్కార్యాలు ఉన్నాయి తండ్రీ !" అని హనుమను బయల్దేరదీసింది స్వయంప్రభ.

ఋక్ష బిలం ద్వారం దగ్గర హనుమను ఆశీర్వదిస్తూ అన్నది ఆవిడ. "నాయనా !నువ్వు ఈ రోజు చేసినది ఒక మహోపకారం . భూత భవిష్యత్ కాలాలలో ఎవ్వరూ చెయ్యనిది , చెయ్యలేనిది నాయనా ! నీ పేరు సీతా రాముల కధ ఉన్నన్నాళ్లూ ప్రజలు తలచుకుంటారు "

అమ్మా ! నేను లంకకు సునాయాసంగా ఎగిరి వెళ్ళానంటే నా తోడుగా రామ అంగుళీయకము ఉన్నదమ్మా ! వచ్చేటప్పుడు సీతమ్మ చూడామణి నా వెంట ఉన్నదమ్మా !

"అమ్మా ఇది ఉపకారమేమిటి తల్లీ ! శ్రీ రాముడికి సంతోషం కలిగించే వార్త ఏదైనా అది నేను చేసే ఉపకారం అనుకోనమ్మా !"

"ఎంత నిగర్వివి హనుమా ! చిరంజీవ !!"ఇది తన మనసులోనే అనుకొని ఆశీర్వదించిందా వృద్ధ తాపసి .

🙏

Tuesday, 19 December 2023

కాలభైరవాష్టకం

_*కాలభైరవాష్టకం*_
☘️☘️☘️☘️☘️☘️☘️☘️
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౧ 
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౨ 
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౩ 
 భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౪ 
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౫ 
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౬ 
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౭
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ౮ 
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||

*ఇప్పుడు తీక్ష్ణదంష్ట్రకాలభైరవాష్టకం పఠించండి.*

*తరువాత శ్రీ రుద్ర కవచం పఠించండి.*
 _*తీక్షణదంష్ట్రకాలభైరవాష్టకం*_
☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అవమానాలు అపనిందలతో నీ గుండె బాధతో నలిగి పోతున్నప్పుడు , జీవనం సమస్యలుగా సాగుతున్నప్పుడు , అగమ్య మార్గాలలో అశాంతి వచ్చినప్పుడు , అనవసర భయాలు మిమ్మల్ని చుట్టిముట్టి నప్పుడు , కుజ దోషం , సర్ప దోషం , నాగదోషం , కాలసర్పదోషం వెంటాడుతున్నప్పుడు -*
*ఈ తీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం నిత్యపఠనం సర్వరక్షాకరమై , సర్వ దోషాలనుండి మిమ్మల్ని కంటికిరెప్పలా కాపాడుతుంది.* దీనికి కోట్లాది భక్తుల అనుభూతులే ప్రత్యక్ష తార్కాణాలు.. ఎందుకంటే సమస్త కాలనాగులన్నిటికీ (సర్పాలన్నీటికి) అధిపతి - ఈ కాలనీకి అధిపతి కాలభైరవుడు కనుక.....
*తీక్షణదంష్ట్రకాలభైరవాష్టకం*
🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ఓమ్ యంయంయం యక్షరూపం దశదిశి విదితం భూమి కంపాయమానమ్ ! 
సంసంసం సంహారమూర్తిo శిరముకుట జటా శేఖరం చంద్రబింబమ్ ! 
దందందం దీర్ఘకాయం వికృతనఖ ముఖం చోర్ధ్వ రోమం కరాళమ్ ! 
పంపంపం పాప నాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((1))
రంరంరం రక్తవర్ణం కటికటితతనుం తీక్షణదంష్ట్రాకరాళమ్ ! 
ఘంఘంఘం ఘోషఘోషం ఘఘఘఘ ఘటితం ఘర్జరం ఘోరనాదమ్ ! 
కంకంకం కాలపాశం ధ్రుకధ్రుకధ్రుకితం జ్వాలితం కామదే హమ్ ! 
తంతంతం దివ్యదేహం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((2))
లంలంలం వదంతం లలలల లలితం దీర్ఘజిహ్వాకరాలం ! ధుoధుoధుo ధూమ్రవర్ణం స్పూటవికటముఖం భాస్కరం భీమరూపమ్ ! 
రుంరుంరుంరుం రుండమాలం రవితను నియతం తామ్రనేత్రం కరాళమ్ ! 
నంనంనం నగ్నభూషం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((3))
వంవంవం వాయువేగం నతజనసదయం బ్రహ్మపారం పరం తమ్ ! 
ఖంఖంఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం భాస్కరం భీమరూపమ్ ! 
చంచంచం చలిత్వా చలచలచలితా చ్చాలితం భూమిచక్రమ్ ! 
మంమంమం మాయిరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((4))
శంశంశం శంఖహస్తం శశికర ధవళం మోక్షసంపూర్ణతేజం ! 
మంమంమంమం మహంతం కులమకుళకులం మంత్ర గుప్తం సునిత్యమ్ ! 
యంయంయం భూతనాధం కిలికిలికిలితం బాలకేళిప్రధానమ్ ! 
అంఅంఅం అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్!! ((5))
ఖంఖంఖం ఖడ్గభేదం విషమమ్రుతమయం కాలకాలం కరాళమ్ ! 
క్షంక్షంక్షం క్షీప్ర వేగం దహదహనం తప్తసందీప్యమానమ్ ! హౌoహౌoహౌoహౌoకారనాదం ప్రకటిత గహనం గర్జితైర్భుమికంపమ్ ! 
వంవంవం వాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((6))
సంసంసం సిద్ధియోగం సకలగుణమఖం దేవ దేవం ప్రసన్నమ్ ! 
పంపంపం పద్మ నాధం హరిహర మయనం చంద్ర సూర్యాగ్నినేత్రం ! 
ఐoఐoఐo ఐశ్వర్యనాధం సతత భయహరం పూర్వదేవం స్వరూపమ్ ! 
రౌంరౌంరౌం రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((7))
హంహంహం హంసయానం హపితకలహకం ముక్తయో గాట్టహాసమ్ ! 
ధంధంధంధం నేత్రరూపం శిరముకుటజాటాబంధ బంధాగ్రహస్తమ్ ! 
టంటంటంటంకార నాదం త్రిదశల టలటం కామగర్వాపహారమ్ ! 
భ్రూoభ్రూoభ్రూo భూతనాధం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ !! ((8))
ఇత్యేవం కామయుక్తం ప్రపఠతి నియతాం భైరవస్యాష్టకమ్ ! 
యో నిర్విఘ్నం దుఃఖనాశం సురభయహాణం డాకీనీ శాకీనీనామ్ ! 
నశ్యేద్ధి వ్యాఘ్ర సర్పోహుతవహసలిలే రాజ్యశంసస్య శూన్యమ్ ! 
సర్వానశ్వంతి దూరం విపద ఇతి భ్రుశం చింతనాత్సర్వ సిద్ధిమ్ !!(9)
భైరవస్యాష్టకమిదం శాన్మాసం యఃపఠ్ న్నర్ర: ! 
స యాతి పరమం స్థానం యంత్ర దేవో మహేశ్వరః !!
(10)
సిందూరారుణగాత్రం చ సర్వ జన్మ వినిర్మితమ్ !! (11)
*ఇతితీక్షణదంష్ట్ర కాలభైరవాష్టకం* *సంపూర్ణం*

*శ్రీ రుద్ర కవచం*

ఓం అస్య శ్రీ రుద్ర కవచ స్తోత్ర మహామంత్రస్య దూర్వాసఋషిః అనుష్ఠుప్ ఛందః త్ర్యంబక రుద్రో దేవతా హ్రాం బీజం శ్రీం శక్తిః హ్రీం కీలకం మమ మనసోఽభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః
హ్రామిత్యాది షడ్బీజైః షడంగన్యాసః ||
ధ్యానం |
శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం |
శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం |
నాగం పాశం చ ఘంటాం ప్రళయ హుతవహం సాంకుశం వామభాగే |
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ||
 
దూర్వాస ఉవాచ |
ప్రణమ్య శిరసా దేవం స్వయంభుం పరమేశ్వరం |
ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుం ౧ 

రుద్ర వర్మ ప్రవక్ష్యామి అంగ ప్రాణస్య రక్షయే |
అహోరాత్రమయం దేవం రక్షార్థం నిర్మితం పురా ౨ 

రుద్రో మే జాగ్రతః పాతు పాతు పార్శ్వౌ హరస్తథా |
శిరో మే ఈశ్వరః పాతు లలాటం నీలలోహితః ౩ 

నేత్రయోస్త్ర్యంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః |
కర్ణయోః పాతు మే శంభుః నాసికాయాం సదాశివః ౪ 

వాగీశః పాతు మే జిహ్వాం ఓష్ఠౌ పాత్వంబికాపతిః |
శ్రీకంఠః పాతు మే గ్రీవాం బాహూన్-శ్చైవ పినాకధృత్ ౫ 

హృదయం మే మహాదేవః ఈశ్వరోవ్యాత్ స్తనాంతరం |
నాభిం కటిం చ వక్షశ్చ పాతు సర్వం ఉమాపతిః ౬
బాహుమధ్యాంతరం చైవ సూక్ష్మ రూపస్సదాశివః |
స్వరం రక్షతు సర్వేశో గాత్రాణి చ యథా క్రమమ్ ౭ 

వజ్రశక్తిధరం చైవ పాశాంకుశధరం తథా |
గండశూలధరం నిత్యం రక్షతు త్రిదశేశ్వరః ౮ 

ప్రస్తానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే |
సంధ్యాయాం రాజభవనే విరూపాక్షస్తు పాతు మాం ౯ 

శీతోష్ణా దథకాలేషు తుహినద్రుమకంటకే |
నిర్మనుష్యే సమే మార్గే పాహి మాం వృషభధ్వజ ౧౦ 

ఇత్యేతద్ద్రుద్రకవచం పవిత్రం పాపనాశనం |
మహాదేవ ప్రసాదేన దూర్వాస మునికల్పితం ౧౧ 

మమాఖ్యాతం సమాసేన న భయం తేనవిద్యతే |
ప్రాప్నోతి పరమాఽరోగ్యం పుణ్యమాయుష్యవర్ధనమ్ ౧౨ 

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం |
కన్యార్థీ లభతే కన్యాం న భయం విందతే క్వచిత్ ౧౩ 

అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ |
త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహి త్రయీమయ ౧౪ 

త్రాహిమాం పార్వతీనాథ త్రాహిమాం త్రిపురంతక |
పాశం ఖట్వాంగ దివ్యాస్త్రం త్రిశూలం రుద్రమేవ చ ౧౫ 

నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర |
శత్రుమధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాంతరే ౧౬ 

గమనాగమనే చైవ త్రాహి మాం భక్తవత్సల |
త్వం చిత్వమాదితశ్చైవ త్వం బుద్ధిస్త్వం పరాయణం ౧౭ 

కర్మణామనసా చైవ త్వం బుద్ధిశ్చ యథా సదా |
సర్వ జ్వర భయం ఛింది సర్వ శత్రూన్నివక్త్యాయ ౧౮ 

సర్వ వ్యాధినివారణం రుద్రలోకం స గచ్ఛతి
రుద్రలోకం సగచ్ఛత్యోన్నమః ||

*ఇతి స్కందపురాణే దూర్వాస ప్రోక్తం శ్రీ రుద్రకవచం సంపూర్ణం ||*
🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓

Friday, 15 December 2023

_*ధనుర్మాసం విశిష్టత*_🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴🪴

ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని *బాలభోగం* అని పిలుస్తారు.

*భోగితో ముగుస్తుంది:*

సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్‌) *మార్గళి వ్రతం* పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి , స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు,పూజలు,జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు , వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం.

*ఎంతో పునీత మాసం:* 

ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. *ధను* అనగా దేనికొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యాధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి అంటే ఆండాళమ్మ పూజ , తిరుప్పావై పఠనం , గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తారు. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు , సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం.

*బ్రహ్మముహూర్తంలో పారాయణం:*

ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తద్యమని శాస్త్రవచనం. సాక్షాత్‌ భూదేవి , అవతార మూర్తి అయిన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో *"తిరు"* అనగా పవిత్రమైన , పావై అనగా వ్రతం , ప్రబంధం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వా చార్యులు ప్రస్తుతించి యున్నారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభరీతిలో వెలువడి నాయనీ , తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలనీ చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువును మధు సూధనుడు అనే పేరుతో పూజించి , మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్దోజనం అర్పించాలి. పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు , గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.

*శ్రీకృష్ణుడికి తులసిమాల:*

ప్రతి రోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు , నచ్చిన వరునితో వివాహం జరుగు తుంది. ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ , ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో , నారాయణ సంహితలోకనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలను కునేవారు శక్తిమేరకు విష్ణు ప్రతిమని తయారుచేయించి , పూజాగృహంలో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి , స్నానాదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు , పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణు కథలను చదవటం , తిరుప్పావై పఠించటం చెయ్యాలి. నెలరోజులు చెయ్యలేనివారు పదిహేను రోజులు , 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజు అయినా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి , ఆశీస్సులు అందుకోవాలి.

*శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా*
*తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా:* 

ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు , పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చనీ , నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి , తిరుప్పావై గాన , శ్రవణం చేసిన వారికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ , ఆశిద్దాం. 

*ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ?*

ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం, దద్దోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగు తుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం, జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి. 

*కన్నెపిల్లలకు మేలు జరుగుతుంది:*

వివాహం కాని, మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాధుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది.

*ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు:*

రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు , మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభ కార్యం జరపకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా , ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయటం శుభం.

*గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు?*

ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి, పసుపు, కుంకుమ , పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగు తుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్ర్తీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది.

   *కాత్యాయనీ వ్రతం:* 
   *పూజా విధానం:*

రోజులానే ముందు పూజ చేసుకోవాలి. ఆ తరువాత శ్రీ కృష్ణ అష్టోత్తరం , గోదా అష్టోత్తరం చదువుకోవాలి. రంగనాధ అష్టోత్తరం కూడా చదివితే మరి మంచిది. ముందుగా ప్రార్ధన చదవాలి. ఆ తరువాత వరుసగా తనయ చదవాలి. తిరుప్పళ్ళి యోళుచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిరవన్‌ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవంతో కలిపి చదవాలి. తనయ చదువుతూ తొమ్మిది , పది తనయలు రెండు సార్లు చదవాలి. చివర తిరుప్పళ్ళి యోళుచ్చి సంపూర్ణం అని చదవాలి. ఆ తరువాత ప్రార్ధన చదవాలి. ఆ తరువాత గోదాదేవి తనయ చదవాలి. ఆ తరువాత పాశురములు చదవడం ప్రారంభించాలి.

*పాశురములు* చదివేటప్పుడు మొదటి పాశురము రెండు సార్లు చదవాలి. అలా మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి. అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడి గా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను , చివర పాశురంలో ఒక లైను చదవాలి.
చివరగా గోదా హారతి చదవాలి. మంత్ర పుష్పం కూడా చదవాలి. మళ్ళి ఏ రోజు పాశురం ఆ రోజు రెండు సార్లు చదివి హారతి ఇవ్వాలి.

*నైవేద్యం* సమర్పంచాలి(రోజు పొంగలి , దద్ధోజనం , పరవన్నం ఉండి తీరాలి. టైమ్ ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు. కాని ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే నియమం కానీ రోజు ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి , పొంగలి ముఖ్య నైవేద్యం కుదిరితే అది పెట్టండి కుదరని వాళ్ళు పండ్లు , పాలు పెట్టి చేసుకోండి , భక్తి ముఖ్యం*

*హరే క్రిష్ణ గోదా క్రిష్ణ*
🌴🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🌴

Wednesday, 6 December 2023

నాయనార్లు గొప్ప శివ భక్తులు

*భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి..*.

*తిరు నిన్ద్రసీర్ నెడుమార నాయనార్*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

తిరు అలవై (మధురై) నగరాన్ని కున్ పాండియన్ అనే రాజు పరిపాలించే వాడు. అతడి ధర్మపత్ని మనగాయక్కర సియార్. ఆమెకు శివుడంటే మహా భక్తి. పాండియన్ మాత్రం జైన మత ప్రవచనాలు తత్వాలు విని ఆకర్షితుడై జైన మతాన్ని స్వీకరించాడు.
తాను జైన మతాన్ని అనుసరిస్తున్నందు వల్ల ప్రజలంతా తప్పక అదే అనుసరించాలని శివుడికి ఏ విధమైన పూజలు నిర్వహించ రాదని శాసనం చేసి దానిని గట్టిగా అమలు పరిచాడు.
రాణి తన లాగే శివ భక్తుడైన మంత్రి కులచిరైయార్ సహాయంతో తిరుజ్ఞాన సంబంధార్ అనే శైవ మత ప్రచారకుడిని మధురైకు పిలిపించింది.
        
 ఆయన సందేశాలతో శివ మహిమను వ్యాప్తి చేయించి ప్రజలలో శివుడి పట్ల భక్తిని పెంపొందింప చేయడం ద్వారా తన భర్త చేస్తున్న శివాపరాదాన్ని కొంత మేరకయినా తగ్గించాలను కుంది.

  సంబంధార్ మధురై ఊరి పొలిమేరలో విడిది చేసి, జైనుల నుండి వస్తున్న తీవ్ర ప్రతిఘటనల మధ్య తన శిష్య బృందంతో కలిసి, జనంలో శివుడి పట్ల భక్తి ఏర్పడేలా ప్రచారం నిర్వహించ సాగాడు. 
 ఇంతలో దైవ లీల వలన రాజు గారు కున్ పాండియన్ కి సుస్తీ చేసింది. ఆయనకు రాచపుండు లేచి తీవ్రమైన ఇబ్బంది పెట్టింది. ఆ బాధతో లేచి తిన్నగా నిలబడ లేని పరిస్తితి. రాజ వైద్యులు ఇస్తున్న మందులు గానీ, రాజ పురోహితులు చేస్తున్న పూజలు మంత్రాల వల్ల గానీ ఉపయోగం లేకుండా అయింది. మంచానికే అంకిత మయ్యాడు. రాణి గారు చాలా బాధపడింది. ఇది శివ దోష ఫలితమని గ్రహించి, సంబంధార్ ను తీసుకు రావలసిందిగా చెప్పింది.

సంబంధార్ రాజు పరిస్తితిని చూసి, అతడి రోగం తగ్గి పోవాలని ఆ దేవదేవుడైన పరమ శివుడిని అతి మధుర మైన గానంతో స్తుతించాడు. అందరూ చూస్తుండగానే అద్భుతం జరిగింది. రాజు కున్ పాండియన్ శరీరం మీద వున్న వ్రణములు మాయ మయ్యాయి. అతడు లేచి పూర్వం వలే నిటారుగ నిలబడి హుషారుగా కనిపించాడు. 
మృత్యుకోరల నుండి తాను శివ భగవానుడి అనుగ్రహం వల్లనే రక్షింపబడ్డానని గ్రహించిన పాండియన్ గొప్ప శివ భక్తుడిగా మారిపోయాడు. తన జీవిత కాలం శైవ మత సిద్ధాంత వ్యాప్తికి పాటు పడ్డాడు. ఆయనకు తోడుగా భార్య మనగాయక్కరసియార్ సహకరించారు. చరమార్దంలో శివ సాయుజ్యం పొందారు.

*ఓం నమశ్శివాయ...*
*హర హర మహాదేవ శంభో శంకర*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Tuesday, 5 December 2023

శివ దర్శనం

*జంబుకేశ్వరుడు-తిరువనైకావల్- తమిళనాడు*

శంకరుడు జలలింగం రూపంలో ఆవిర్భవించిన క్షేత్రం జంబుకేశ్వరం. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో తిరువనైకావల్‌లోని ఆలయం పంచభూతాల్లో ఒకటైన జలానికి నిదర్శనంగా ఉంది. 

స్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. పార్వతీ మాత అఖిలాండేశ్వరిగా జన్మించిన మహాపుణ్యక్షేత్రమిది.ఒక వైపు కావేరి నది, మరో వైపు కొలరున్‌ నదుల మధ్య ఏర్పడిన ద్వీపంలో జంబుకేశ్వరం ఉంది. తొలి చోళ రాజుల్లో ఒకరైన కొచెంగ చోళుడు నిర్మించినట్టు సంగం గ్రంథాల ద్వారా తెలుస్తోంది. శివభక్తులు నయనార్లు తమ గ్రంథాల్లో జంబుకేశ్వరుడిని స్తుతించారు.

*స్థలపురాణం:*

మహదేవుని ఆజ్ఞమేరకు అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరిగా జన్మించారు. నిత్యం శివుని ఆరాధనతో తరించి కావేరి నదిలోని జలంతో లింగాన్ని తయారుచేసి పూజలు చేయడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సాక్షాత్తు అమ్మవారు పూజించిన లింగం కావడంతో పరమ పవిత్ర ప్రదేశంగా ఖ్యాతిచెందింది. అందుకనే అప్పుస్థలగా కూడా పిలుస్తారు.

*దీనికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.*
 
జంబు అనే మునీశ్వరుడు కఠోరంగా పరమేశ్వరుని దర్శనం కోసం తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమై అతనికి కొన్ని పండ్లను కానుకగా ఇచ్చాడు. భగవంతుడు స్వయంగా ఇచ్చిన పండ్లు కావడంతో వాటి గింజలను బయటకు పడేయలేక మింగేస్తాడు. అనంతరం ఆ గింజల నుంచి వేర్లు శిరస్సు ద్వారాబయటకురావడంతో ముని శివసాయుజ్యం పొందినట్టు తెలుస్తోంది. అందుకనే స్వామి జంబుకేశ్వరుడిగా పూజలు అందు కుంటున్నారు*

సాలెపురుగు, ఏనుగు శివలింగాన్ని భక్తితో పూజించి శివసాయుజ్యం పొందినట్టు తెలుస్తోంది. ఈ కథనం శ్రీకాళహస్తి క్షేత్రంతో పోలివుండటం విశేషం. శివకవి తిరునవక్కురసర్‌ తన రచనల్లో స్వామి వారి మహిమలను వర్ణించాడు. 
స్వామిని ప్రార్థిస్తే చింత లేని జీవితం ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామిని జగన్మాత అఖిలాండేశ్వరి ప్రతిరోజూ మధ్యాహ్నం ప్రార్థిస్తుందని భక్తకోటి ప్రగాఢ విశ్వాసం.

*అద్భుత శిల్పకళ..*

ఆలయంలోని అద్భుతమైన శిల్పకళ చూపరులను ముగ్ధులను చేస్తుంది. మొత్తం ఐదు ప్రాకారాలు కలిగిన ఆలయం బాగా విశాలంగా ఉంటుంది. వెయ్యి స్తంభాల మండపంలో పలు స్తంభాలపై చెక్కిన శిల్పాలు అలనాటి శిల్పుల నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తాయి.

*ఓం నమః శివాయ*
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

Saturday, 26 August 2023

అష్టాదశ శక్తి పీఠాలు

సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలని శక్తి పీఠాలు అని ఎందుకు అంటారు..??

అష్టాదశ శక్తి పీఠాలు 
         హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Shakthi Peethas) అంటారు. ఈ శక్తిపీఠాలను గుర్తించడానికి ఎటువంటి ఇతిహాసిక ఆధారాలూ లేవు. పురాణాలు, శాసనాల ఆధారముగా ఈ శక్తిపీఠాలను గుర్తించగలిగారు.

🌺ఈ శక్తిపీఠాలు మన దేశములోనే కాకుండా, పాకిస్తాన్, శ్రీలంక, టిబెట్, నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. పరిశోధకుల అంచనాల మేరకు ఆసియాఖండములో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

🌺శక్తిపూజా నేపధ్యాన్ని తెలుసుకోవడము అవసరము. మానవుడు తన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు. ఈ శకులన్నిటి వెనుక ఒక విశిష్టశక్తి ఉన్నదని తెలుసుకొన్నాడు. ఆ శక్తినే దేవుడు అని అన్నాడు. ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ఆడ, మగ అని విడదీసి పెళ్ళిల్లు చేసే ఆచారమూ తీసుకువచ్చాడు. 

🌺ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితమివ్వసాగాడు. అందులోనూ స్త్రీ దేవతకు ఎక్కువ మహిమనిస్తూ భయ భక్తులతో ఆరాధింప సాగాడు. ఈ ప్రక్రియలో త్రిమూర్తుల కల్పన రూపుదాల్చింది. వీరిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులన్నాడు. వారు క్రమముగా సృష్టి, స్థితి, లయ కర్తలని పేర్కొన్నాడు. వీరి భార్యలను సరస్వతి, లక్ష్మి, పార్వతి అనియూ వీరు విద్య, ధన, మాతృరూపాలలో ఉన్నారని అన్నాడు. ఈ విధముగా ప్రకృతి శక్తి ఒక్కటే అయినా మానవుడు తనకిష్టమైన రూపములో, తనకిష్టమైన రీతిలో ఆరాధించడము సాగిస్తూ ఉన్నాడు.

అష్టాదశ శక్తి పీఠాలు - పురాణ కధ
🌺ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. 

🌺ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి, సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ 'శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.

🌺కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

🌺అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. 

🌺మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ (గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్పూర్-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం.

1. శాంకరీదేవి
🌺లంకాయాం శాంకరీదేవి అంటే మునులూ రుషుల లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నా డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.

2. కామాక్షి
🌺సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి. స్థలపురాణం ప్రకారం. మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. 

🌺అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.

3. శృంఖల
🌺అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్లో ఉన్నదని కొందరూ కోల్కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో కొలువై ఉన్న 'చోటిల్లామాత' ను అక్కడివారు శృంఖలా (శృంగళా) దేవిగా భావిస్తారు. 

🌺కానీ పశ్చిమబెంగాల్లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.

4.చాముండి
🌺హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం చెప్తుంది. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

5.జోగులాంబ
🌺మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి.

6.భ్రమరాంబిక
🌺విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం చెప్తుంది. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.

7. మహాలక్ష్మి
🌺రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్ను 'అవిముక్త క్షేత్రం' గా వ్యవహరిస్తారు.

8. ఏకవీరాదేవి
🌺మహారాష్ట్రలోని నాందేడ్ సమీపంలోని మాహోర్ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు.

9. మహాకాళి
🌺సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా.

10. పురుహూతిక
🌺పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో) తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్పూర్ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.

11. గిరిజాదేవి
🌺గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

12. మాణిక్యాంబ
🌺సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.

13. కామాఖ్య
🌺అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్బేహార్ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

14. మాధవేశ్వరి
🌺అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమని అంటారు.

15. సరస్వతి
🌺పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని నేటి ముజఫరాబాద్కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.

16. వైష్ణవీదేవి
🌺అమ్మవారి నాలుక హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.

17. మంగళగౌరి
🌺సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

18. విశాలాక్షి
🌺సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.

🌺ఇవీ ప్రధానమైన 18 శక్తిపీఠాలు. ఇంకా అమ్మవారి ఆభరాణాలు పడినచోట్లనూ లెక్కిస్తే 51 శక్తిపీఠాలని కొందరూ 108 పీఠాలని మరికొందరూ అంటారు. ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక తదితర దేశాల్లో ఒకప్పుడు ఉండేవని చెబుతారు.

Wednesday, 1 March 2023

శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయం పునః నిర్మాణం

శ్రీకాళహస్తిలోని అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయం పునః నిర్మాణం కు శిథిలాలు మరియు  ధ్వజస్థభం తొలగిస్తున్న దృశ్యము
ఓం గోవిందాయ నమః 🙏🙏🙏