Thursday, 18 June 2020

పంచభూత క్షేత్రాలలొ రెండవ క్షేత్రం జంబుకేశ్వరం. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో తిరుచిరాపల్లి జిల్లాలో తిరువనక్కవాల్ అనే గ్రామంలో ఉంది


పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ( తెల్లనేరేడు చెట్లు ) ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది అని అంటారు.శివుడు ఇక్కడ జలలింగ రూపంలో భక్తులకి దర్శనం ఇస్తాడు.

ఈ దేవాలయం విశాలమైన 5 ప్రాకారాలతో , ఎత్తైన 7 గోపురాలతో మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయంలో జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు. గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఆలయప్రాకారములో జంబుకేశ్వర స్వామి ఆలయం, అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయమే కాకుండా అనేక ఉప ఆలయాలు, అనేక మండపాలు ఉన్నాయి.
చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం శ్రీ రంగంలో ఉన్న రంగనాధ స్వామి ఆలయం కన్నా పురాతనమైనదని తెలుస్తోంది
ఈ ఆలయాన్ని క్రీ.శ 2 వ శతాబ్దంలో కోచెంగ చోళుడు నిర్మించాడు. ఆ తర్వాత పల్లవ రాజులు, పాండ్యులు , విజయనగర రాజులు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ది చేసినట్లు తెలుస్తోంది.

జంబుకేశ్వరుడిగా పేరుపొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితో నిర్మితమై కానీ నీటిలో లేదు. అయితే ఈ లింగం ఉన్న పానపట్టం నుండి ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టం పై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది.
ఈ ఆలయం ఎంతో విశాలంగా ఉన్నా గర్భాలయం మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. కేవలం ముగ్గురు నలుగురు మించి లోపలకి వెళ్ళి దర్శించుకునేంత అవకాశం లేనంత ఇరుకుగా ఉంటుంది ఇక్కడ. చాలామంది గర్భగుడికి ఉన్న "నవద్వార గవాక్షం" అనే పేరుగల కిటికీ నుండే ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు. ఈ జంబుకేశ్వరుడినే అప్పులింగేశ్వరుడు, నీర్ తిరళ్‌నాథర్ అని కూడా పిలుస్తారు.

ఇక్కడ స్వామివారి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు. అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు. నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకొన్నట్లు, క్రింది చేతులు అభయ హస్తంతో వరద ముద్రతో ఉన్నారు.
అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్ర రూపంగా ఉండేవారని శంకరాచార్యులు ఈమె ఉగ్ర రూపాన్ని ఆరాధించి ఉగ్రాన్ని తగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగా మార్చారని చెబుతారు. అమ్మవారి ముందు కనిపించే శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని, అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యులవారే సమర్పించారని చెబుతారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారని ఇక్కడి వారి నమ్మకం.
ఈ ఆలయం శ్రీరంగానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది

Saturday, 13 June 2020

తిరుపతిలోని " అలిపిరి " కి ఆ పేరు ఎలా వచ్చింది ... ?* ( శ్రీవారి మహిమలు - యదార్థ సంఘటనలు )

🌷🌾🍃🍂🌿🎋🌷


" తిరుమల " కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే మనం మొదట కొండ దిగువన ఉన్న " అలిపిరి " ప్రాంతానికి చేరుకోవాలి. 

అక్కడినుంచి కాలినడకన లేదా రకరకాల వాహనాలలో మనం సప్తగిరుల పైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటాం. 

అయితే కొండ క్రింద ఉన్న ఈ    "అలిపిరి" కి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు.

అసలు " అలిపిరి " అనే పేరే ఒక విచిత్రమైన పేరు లాగా ఉంది కదా ... ? మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ " అలిపిరి " అనే పదం లేదు. 

అయితే, " అలిపిరి " అనే ఈ పదం ఎలా పుట్టింది ... ? 

దీని వెనుక చరిత్ర ఏమిటి ... ?

అనే విషయం మన చరిత్రని నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యదార్థ సంఘటలను గురించి మనం తెలుసుకోవచ్చు.

పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం," తిరుపతి " నగరం ఇప్పటిలాగా లేదు.

ఇప్పుడు " అలిపిరి " అని పిలుస్తున్న ప్రాంతానికి-
"అలిపిరి" అన్న పేరు కూడా లేదు.

 మరి " అలిపిరి " అన్న పేరు ఎలా వచ్చిందో  పూర్తిగా చదివి తెలియనివారికి తెలియపరచాలని మా హృదయపూర్వక విజ్ఞప్తి.

అది ( 1656 - 1668 ) ప్రాంతం . ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీ కృష్ణ దేవరాయల అనంతరం జరిగిన " రాక్షసి తంగడి & తళ్ళికోట " మొ || యుద్ధాల తర్వాత, విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది. అప్పుడు నిజాం నవాబు రాయల సీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు. 

ఆ సమయంలో హిందువులను, హిందూ సానుభూతిపరులను, సాధుసంతులను చాలా దారుణంగా హింసించారు. 

ఈ నిజాం నవాబు, ఢిల్లీ సుల్తానుకు - కప్పం కడుతూ సామంతుడిగా పడి ఉంటూ, హిందువులపై నిరాఘాటంగా & ధారావాహికంగా అకృత్యాలు, అరాచకాలు చేస్తూ ఉండేవాడు.

పదిహేడో శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా ( ఆర్డర్ ) మేరకు సుల్తాన్ అబ్దుల్లా - కుతుబ్ షా & వజీర్ల సైన్యం, " ఆలీ " అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో, కడప, కర్నూలు, నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేసారు. ఆ తరువాత " ఆలీ " సైన్యం తిరుపతికి చేరుకుంది.

అప్పుడు, తిరుపతి చిన్న గ్రామం. ఇప్పుడు " మంచినీళ్ళ కుంట " అని చెప్పుకుంటున్న 
" నరసింహ తీర్థమే " అప్పటి తిరుపతి గ్రామం. 

ఇక్కడ ఒక నరసింహ స్వామి మందిరం ఉంది, దానికి ప్రజలు నిత్యం ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని " నరసింహ తీర్థం రోడ్ " అనే పిలుస్తారు.

ఆలీని తిరుపతికి పైకి దండయాత్రకు పంపించటానికి మూల కారణాలు రెండు : 

🌺ఒకటి : శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైన దేవుడు అనీ & తిరుమల లాంటి దివ్య క్షేత్రం ఇంకొకటి లేదు, భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవమ్ విశ్వాసం భారత దేశం నేల నాలుగు చెరలా ఉండడం వలన, ఈ దేవాలయం పై దాడి చేసి స్వామి వారి స్వరూపాన్ని పెకలించి కొండపై నుంచి తొలగించేస్తే, హిందువుల దేవుడు బలహీనుడనీ తద్వారా, ప్రజలందరూ " అల్లా " యే గొప్ప దేవుడని భావించి, " ఇస్లాం " మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన.

🌹రెండోది : శ్రీ కృష్ణ దేవరాయలు, భక్తితో స్వామి వారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు, వైఢూర్యాలు, కనక పుష్యరాగాలు, కెంపులూ & అపారమయిన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందామని. 

అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు, " ఆలీ " ( కమాండర్ ఇన్ చీఫ్ ) ని సమీపించి నీక్కావలసింది బంగారమే కదా ! మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ & పురుషుల వద్ద వున్న బంగారం అంతా ఇచ్చేస్తాం, దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో, కానీ మా స్వామి వారి జోలికి రావద్దు, ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు. 

దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్చందంగా ఇచ్చిన బంగారం, ఆభరణాలు తీసుకుని, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చెయ్యకపోతే నిజాం నవాబూ & ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి, తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు.

సరిగ్గా ఇప్పుడు " అలిపిరి " అని పిలవబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే, శ్రీ ఆది వరాహ స్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు. మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు. అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయమూ లేకుండా అతని రెండు కళ్ళూ పోయాయి, దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు.

అప్పుడు , శ్రీ స్వామి వారి " అమృత వాణి " వాడికి వినబడింది, దైవం పైనే దాడికి సిద్ధపడ్డావా ? ఎంత ధైర్యం ... ? అని. అప్పుడు ఆలీ బిగ్గరగా రోదిస్తూ ... క్షమాభిక్ష అడిగి, నేత్ర దానం చెయ్యమని వేడుకున్నాడు. 

అప్పుడు దయార్ద్రచిత్తుడయిన స్వామి వారు, నీవు వెనుదిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుందని ఆదేశించారు. దానితో ఏమీ సాధించకుండానే రిక్త హస్తాలతో వెనుదిరిగాడు "ఆలీ". 

ఉర్దూ లేక హిందీ భాషలో " ఫిర్ నా " అంటే వెనక్కి మళ్ళడం, " ఫిరే ' అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం. ఎప్పుడు, ఎక్కడా ఓటమెరుగని పరమ ఆ దుర్మార్గుడైన ఆలీ వెనుతిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ " ఆలీ ఫిరే, ఆలీ ఫిరే " అని చెప్పుకునేవారు. 

కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్లిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్లలేక వెనుదిరిగాడు " ఆలీ ఫిరే ", 
"ఆలీ ఫిరే" అని సూచిస్తూ ... చాటింపులు సైతం వేయించారు.

" ఆలీ " ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్నే అప్పటివారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు. ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారని ఎవరైనా అడిగినప్పుడు " అలీ ఫిరే" ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు. 

*కాలక్రమంగా ఆ ఆలీ ఫిరే అనే పదం - ఆలి పిరే గా రూపాంతరం చెంది ఇప్పుడు " అలిపిరి గా స్థిరపడింది.* 

ఇదీ మనమిప్పుడు " అలిపిరి " గా పిలుచుకునే ప్రదేశం యొక్క యదార్థమైన చరిత్ర.

అప్పుడు తురుష్కులు చేస్తున్న, చేసిన దురాగతాలూ మరియు పైన పేర్కొన్న ఘటనల గురించి, " వేంకటాచల విహార శతకము " అని ఒక కవి వ్రాయడం జరిగింది. దీని ఆధారంగా స్వర్గీయ " ఎన్టీఆర్ " " వేంకటేశ్వర కళ్యాణం " సినిమాలో కొంత చూపించారు. 

ఈ " వేంకటాచల విహార శతకము " లో ముఖ్యం గా ( 6, 9, 90 & 98 ) పద్యాలలో, కవి తురుష్కులు చేస్తున్న పాపాలు, దౌర్జన్యాలకు విపరీతంగా కోపం తెచ్చుకుని శ్రీ స్వామి వారిని తీవ్రంగా ప్రశ్నించాడు. మీ గోవిందరాజు బొజ్జ నిండా తిని హాయిగా పడుకున్నాడు, ఇన్ని అరాచకాలు జరుగుతున్నా లేవడా .. ? అని. 

 *పాలు వెన్న బకాళబాతు దధ్యోదనంబు పుళి రెము వెన్న బూరియలును సరడాల పాశముల్ ? చక్కెర పులగముల్ నువ్వుమండిగలు మనోహరములు*

 *అప్పము లిడైన లతిరసాల్ హోళిగల్ వడలు దోసెలు గలవంటకములు శాకముల్ సూపముల్ చాలు లంబళ్లు శుదనములును సద్యోఘృతమ్ము* 

 *పండ్లు తేనెలు హొబ్బట్లు పచ్చడులును మెక్కి మము బోంట్లు గ్రుక్కిళ్లు మ్రింగుచుండ బర్వసేయవు నీవంటి బ్రదుకుగాదె శత్రు సంహార వెంకటాచల విహార* 
( వేంకటాచల విహార శతకం )

సుల్తానుల సైన్యం చేస్తున్న ఆగడాలను భరించలేక వారిని నశింపజేయమని కోరుతూ ఓ అజ్ఞాత కవి ఈ శతకం వ్రాశాడు. 

ఆరోజుల్లో సుల్తానుల సైన్యం ఆలయాలలోకి వెళ్ళి విగ్రహాలను నాశనం చేసేవాళ్లు. జిగురుపాల కోసం అనే వంకతో దేవాలయాలలో ఉండే రావి చెట్లను నరికేసేవాళ్లు. గుడి పూజారులు నుదుట పెట్టుకునే నామాలను బలవంతంగా తుడిపేయించేవాళ్లు. 

ఇలా అరాచకాలు చేసే అల్లరిమూకల్ని అడ్డగించి గెలవడం ఓ వేంకటేశా ... నీకైనా శక్యమేనా ? ఏదో వెఱ్రితనం కొద్దీ నీకు అంటూ దేవుణ్ణి రెచ్చగొట్టే పద్యాలు ఇందులో కనిపిస్తాయి. కొండపైన నువ్వు కొండ దిగువన మీ అన్న గోవిందరాజ స్వామి లేవనైనా లేవకుండా మొద్దు నిద్ర పోతున్నారని ఆరోపిస్తాడు ఈ కవి. ఆయన పేరు ఈ శతకంలో ఎక్కడా కనిపించదు. 

ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలీ వెనుదిరిగిన కారణంగా, ఈనాడు మనం చూస్తున్న " అలిపిరు ఏర్పడింది . 

 *కొసమెరుపు :* ఒక్క ఆలీనే కాదు, తిరుమల శ్రీవారి ఆలయం గురించి, ఏడు కొండల గురించి కానీ, లేదా స్వామి వారిని గురించి కానీ తప్పుగా మాట్లాడినవారు, తప్పుడు ఆలోచనలు చేసిన వారు ఎందరో కాలగర్భంలో కలిసి పోయారు.  

కానీ, అన్ని కాలాలకి, అన్ని సంఘటనలకి ఆ సాక్షిభూతుడిగా సర్వకాల సర్వావస్థుడిగా ఆ శ్రీవారు చిరునవ్వులు చిందిస్తూ ... మన కళ్ళముందే ఉన్నారు, అదే ఆయన వైభవమ్. 

Saturday, 6 June 2020

నక్షత్రము – ధరించవలసిన రుద్రాక్షలు….


అశ్వని – నవముఖి,
భరణి-షణ్ముఖి,
కృత్తిక – ఏకముఖి, ద్వాదశముఖి,
రోహిణి – ద్విముఖి,
మృగశిర -త్రిముఖి,
ఆరుద్ర- అష్టముఖి,
పునర్వసు- పంచముఖి,
పుష్యమి- సప్తముఖి,
ఆశ్లేష – చతుర్ముఖి,
మఖ- నవముఖి,
పుబ్బ- షణ్ముఖి,
ఉత్తర-ఏకముఖి, ద్వాదశ ముఖి,
హస్త – ద్విముఖి,
చిత్త – త్రిముఖి,
స్వాతి- అష్టముఖి,
విశాఖ-పంచముఖి,
అనురాధ – సప్తముఖి,
జ్యేష్ఠ-చతుర్ముఖి,
మూల- నవముఖి,
పూర్వాషాఢ- షణ్ముఖి,
ఉత్తరాషాఢ- ఏకముఖి లేదా ద్వాదశముఖి, శ్రవణం- ద్విముఖి,
ధనిష్ట -త్రిముఖి,
శతభిషం- అష్టముఖి,
పూర్వాభాద్ర – పంచముఖి,
ఉత్తరాభాద్ర- సప్తముఖి,
రేవతి- చతుర్ముఖి

Tuesday, 2 June 2020

చిత్తూరు జిల్లాలో చాల ప్రసిద్ధ దేవాలయాలు



తిరుమల  తిరుపతి :
 ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ కలిపి "తిరుమల తిరుపతి" అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిదినం లక్ష నుండి రెండు లక్షల వరకు భక్తులు సందర్శిస్తుంటారు. ప్రత్యేక దినాలలో 5 లక్షలమంది వరకూ దర్శనం చేసుకొంటారు. ఈ యాత్రాస్థలం శ్రీవైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్యదేశాలలో ఒకటి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి.

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో నాలుగు బస్టాండ్‌లు ఉన్నాయి. తిరుమలకు దగ్గరి లోని రైల్వే స్టేషను తిరుపతి. తిరుపతి స్టేషనుకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంట, తిరుమలకు అతి దగ్గరి విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు నుండి నేరుగా విమాన సేవలు ఉన్నాయి.

కాణిపాకం :
కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడు కట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పిశైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.

 తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిముషాలకు ఒక బస్సు ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమూల నుండి అయిననూ చిత్తూరుకు లేదా రేణిగుంట లేదా గూడూరు లకు రైళ్ళు ఉన్నాయి. తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయానికి విమానాలు ఉన్నాయి.

శ్రీకాళహస్తి :
ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన, పంచభూతలింగము లలో నాల్గవ దైన వాయు లింగము గల గొప్ప శైవ పుణ్యక్షేత్రము. ఇక్కడ రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు ప్రాచీన భారతీయ వాస్తు కళకు నిదర్శనాలుగా, విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల యొక్క పనితనానికి కాణాచిగా నిలుస్తాయి. వీటిలో ఎత్తైన గాలి గోపురం శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. బాగా పెద్దదిగా కనిపించే వెయ్యి కాళ్ళ మంటపం కూడా ప్రధాన ఆకర్షణే. కళంకారీ కళకు కాళహస్తి పుట్టినిల్లు. శ్రీకాళహస్తి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఒక పట్టణము.

శ్రీకాళహస్తి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రమైన తిరుపతికి ముఫ్ఫై ఎనిమిది కి.మీ.ల దూరంలో నెల్లూరుకు సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి ఇక్కడికి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని దాదాపు అన్ని ముఖ్య పట్టణాల నుండి ప్రతిరోజు బస్సు సదుపాయం ఉంది.  గూడూరు-తిరుపతి దక్షిణ రైలు మార్గంలో శ్రీకాళహస్తి రైల్వే స్టేషను ఉంది. గూడూరు చెప్పుకోదగ్గ జంక్షన్ కాబట్టి చాలా రైళ్ళు ఇక్కడ ఆగుతాయి.

నారాయణవనం :
శ్రీ వేంకటేశ్వర స్వామికి పద్మావతికి ఇక్కడే వివాహం జరిగిందని అంటుంటారు. దానికి ఋజువుగా ఇక్కడ అమ్మవారి నలుగు పిండికి అవసరమైన తిరగలి కనిపిస్తోంది. ప్రతిఏడూ అమ్మవారికి 18 రోజులపాటు జాతర జరుగుతింది. అది ఆగస్టు 22 - 26 తేదీల మద్యలో ప్రారంబమై సెప్టెంబరు 11 -12 తేదీలలో ముగుస్తుంది. ఈ అమ్మవారికి పూజలు చేస్తే పెళ్ళికానివారికి పెళ్ళి అవుతుందని, పిల్లలు కలగని వారికి పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మిక. శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి అయిన ఆకాశ రాజుకు ఈ అమ్మవారి కటాక్షంతోనే పద్మావతి జన్మించిందని భక్తులు నమ్ముతారు. నారాయణవనం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన జనగణన పట్టణం. ఇది పుత్తూరుకి 5 కి.మి., తిరుపతికి 40 కి.మి. దూరంలో ఉంది.  ఇక్కడ జలపాతాలు సంవత్సరంలో 365 రోజులు ప్రవహిస్తూ ఉంటాయి.

నాగలాపురం :
ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది.శ్రీమహావిష్ణువు మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి మత్స్యావతార మెత్తుతాడు. సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది. ఈ ఆలయ విశిష్టత ఏమంటే........ ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి.

చిత్తూరు జిల్లాకు చెందిన నాగలాపురం గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది .

కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం :
తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలోని ఆలయాల్లో శ్రీనివాస మంగాపురం ఆలయం ఒకటి. పద్మావతీ శ్రీనివాసుల పెళ్ళి అనంతరం కొత్త పెళ్ళికూతురైన పద్మావతిని తీసుకుని వరాహక్షేత్రానికి దక్షిణంగా స్వర్ణముఖీ నది ఒడ్డునున్న అగస్త్యాశ్రమానికి విచ్చేస్తాదు శ్రీనివాసుడు. స్వర్ణముఖి, కల్యాణి, భీమనదుల త్రివేణీ సంగమంగా ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.

తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో తిరుపతి నుండి మదనపల్లికి వెళ్ళేదారిలో ఉంది. యాత్రికులు తప్పక దర్శించవలసిన క్షేత్రం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాల సందర్శనార్ధం బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు శ్రీనివాస మంగాపురం ఆలయానికి కూడా వెళ్తాయి.

అలమేలు మంగాపురం :

దీనిని అలమేలు మంగా పురమని కూడా అంటారు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీ దేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది. త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడు. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళింది. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడు.

తిరుచానూరు లేదా అలమేలు మంగాపురం అనే ఊరు చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణం సమీపంలో ఉంది.  పబ్లిక్ బస్సు సర్వీసు, ప్రైవేట్ బస్సు సర్వీసు , రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం, టాక్సీ సౌకర్యం , ఉన్నాయి.

అరగొండ - అర్ధగిరి :
ఆంజనేయుడు సంజీవని పర్వతాన్ని తీస్కుని వెళ్తున్న సమయం కాణిపాకం దగ్గర్లో పర్వతం నుంచి కొంతభాగం క్రింద పడినదని స్థలపురాణం. ఆ ప్రదేశాన్ని అర్ధగిరి అని పిలుస్తారు. అరకొండ అని పలకడం బదులు తమిళనాడు సరిహద్దుల్లో ఉండటం వల కొండ బదులు గొండ అయి మొత్తానికి అరగొండ గా మార్చారు. ఇక్కడ తీర్ధం సేవించడం  వల్ల  రోగాలు నయమౌతాయని చెబుతారు.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, అప్పలాయగుంట :
అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయం అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో ఒకటి. యిది అప్పలాయగుంట లో వెలసినది. శ్రీ వేంకటేశ్వరుడు నారాయణ వనం లో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంట లో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడు. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడ లోని అగస్తేశ్వరు ని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగా పురం లో ఆరునెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా (నూరు మెట్ల దారి) తిరుమల చేరాడని స్థల పురాణం.

అప్పలాయ గుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. తిరుపతి నుండి పరిసరప్రాంతాలలోని ఆలయ సందర్శన బస్సులు కూడ ఇక్కడి వస్తుంటాయి. తిరుపతికి వచ్చిన వారు తప్పక చూడవలసిన ఆలయమిది.

శ్రీ మొగిలీశ్వరస్వామివారి ఆలయం :
చిత్తూరు జిల్లాలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి తరువాత పేర్కొనదగిన ప్రసిద్ధ శైవక్షేత్రం మొగిలి. ఇక్కడ వెలిసివున్న దేవుడు మొగిలీశ్వరుడు. దేవత కామాక్షి. ఈ దేవాలయం రెండు శతాబ్దాల ప్రాచీనతను సంతరించుకుని ఉంది. ఈ దేవాలయానికి బంగారుపాళ్యం జమీందారులు వంశపారంపర్యంగా ధర్మకర్తలుగా ఉంటున్నారు. ఈ దేవాలయంలోని శివలింగం భూగర్భము నుండి ఆవిర్భవించింది. కామాక్షీదేవి విగ్రహము మాత్రము ప్రతిష్ఠించింది. మొగిలి, చిత్తూరు జిల్లా, బంగారుపాలెం మండలానికి చెందిన గ్రామం.

గుడిమల్లం :
ఈ మధ్యకాలంలో ఈ ఆలయంలోని స్వామి వారి ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. విగ్రహం చూడగానే ఆలయం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది.ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము, ముఖ మండపముల కన్నా లోతులో ఉంటుంది . ఇక్కడ గర్భ గృహములో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు. ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. ఈ ఆలయం వున్న గ్రామం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం లో వుంది.

కోదండ రామాలయం, తిరుపతి :
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని కోదండ రామాలయం ప్రాచీనమైన మరియు ప్రఖ్యాతమైన హిందూ దేవాలయం. ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. ఈ ఆలయం ఎదురుగా భక్తాంజనేయస్వామి వెలసియున్నారు. భవిష్యోత్తర పురాణంలో శ్రీరాముడు సీతాన్వేషణ సఫలమగుటకు శ్రీవారి పుష్కరిణిలో స్నానమాచరించినట్లు చెప్పబడింది. ఆ కాలంలో ప్రస్తుతము ఆలయమున్న ప్రదేశంలో ఒక గుహ వెలసి ఉండేదని ప్రతీతి. అందుండి దివ్యమైన తేజస్సు వెలువడుతుండేది.

తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో మరియు తిరుమల తిరుపతి బాలాజీ ఆలయం నుండి 24 కిలోమీటర్ల దూరంలో, కోదండరామ స్వామి ఆలయం తిరుపతి పట్టణం నడిబొడ్డున ఉంది.

తలకోన :
ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటుంది. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాత ప్రదేశం అత్యంత రమణీయ ప్రకృతి ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు. తలకోన శేషాచల కొండల వరుసలో తల భాగంలో వున్నందున దీన్ని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు మూడు వందల అడుగులు. ఈ జలపాత దృశ్యం నయనానంద కరంగా వుంటుంది. ఇక్కడ చేరగానే మొదట మనం కనుగొనేది సిద్దేశ్వరాలయము మరియు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాలు.

తలకోనకు తిరుపతి, పీలేరు నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. పీలేరు నుంచి 50 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది.తిరుపతి బస్ స్టాండ్ నుండి ప్రతి రోజు ఉదయం 7 గంటలకు నేరుగా తలకోనకు బస్సు సౌకర్యం ఉంది, మళ్ళి తలకోన నుండి తిరుపతికి సాయింత్రం 4 గంటలకు ఇదే బస్సు ఉంది.

బోయకొండ గంగమ్మ :
 కొన్నేళ్ల క్రితం వరకు అతి సాధారణ గ్రామ దేవత ఆలయంగా వున్న ఈ ఆలయం కొన్ని సంవత్సరాల నుండి చాల ప్రాముఖ్యత వహిస్తున్నది. చిత్తూరు జిల్లాలో ఈ తరహా గ్రామ దేవతల ఆలయాలన్నింటి కన్న ఈ ఆలయం అతి ప్రసిద్ధి పొందినది. ఈ అలయం ఒక చిన్న కొండపై వెలసి ఉంది. ఇది కర్ణాటకకు తమిళ నాడు రాష్ట్రాలకు కూడా దగ్గరగా వున్నందున ఆ యా రాష్ట్రాల భక్తులు కూడా వస్తుంటారు. ఇక్కడ జరుగుతున్న బలులు, వంట కార్యక్రమాలు హైదరాబాద్ లోని బంజార హిల్సు లోని పెద్దమ్మ గుడి వద్ద జరిగే కార్యక్రమాలను తలపిస్తుంది.

బోయ కొండ గంగమ్మ దేవాలయం చిత్తూరు జిల్లాలో పుంగనూరు దగ్గర ఉంది. ఇది గ్రామ దేవత ఆలయం. ఈ ఆలయానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప విమానాశ్రయం తిరుపతి. ఈ ఆలయానికి తరచుగా రోడ్డు రవాణా అందుబాటులో ఉంది. గంగమ్మ ఆలయానికి చేరుకోవడానికి పకాలా రైల్వే జంక్షన్ సమీప రైల్వే స్టేషన్ మరియు ఈ ప్రదేశం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కైలాసకోన గుహాలయం :
చిత్తూరు జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోనలో ఉన్న గుహాలయం దర్శించుకోదగ్గ ఆలయం. ఇది కైలాస కోన కొండపై ఉంది. నారాయణపురంలో పద్మావతీ వేంకటేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు కైలాసం నుండి విచ్చేసిన శివపార్వతులు ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఈ పర్వతం మీదే గడిపారట. పార్వతీపరమేశ్వరులు నివసించడం వల్ల ఈ కొండకు కైలాస కోన అనే పేరు వచ్చిందనే కథనం బహుళ ప్రచారంలో ఉంది. చిత్తూరు జిల్లా నారాయణపురానికి సమీపంలో కైలాసకోనలో ఉన్న గుహాలయం దర్శించుకోదగ్గ ఆలయం.

కైలాసకోన జలపాతం లేదా కోన్ జలపాతం ఉత్తూకోట్టై - పుత్తూరు - తిరుపతి రహదారిపై ఉంది. ప్రధాన జలపాతం కారు ద్వారా సులభంగా చేరుకోవచ్చు. కార్ పార్కింగ్ వద్ద 10 కి పైగా కార్లు పార్క్ చేయడానికి తగినంత స్థలం ఉంది. కార్ పార్కింగ్ నుండి, ప్రధాన జలపాతం 3 నుండి 5 నిమిషాల నడక ద్వారా, చక్కగా వేయబడిన దశల ద్వారా చేరుకోవచ్చు. ఈ మార్గం రాత్రి సమయంలో ప్రకాశిస్తుంది.