Tuesday, 5 November 2024

కార్తీక పురాణం - 6 వ అధ్యాయము

కార్తీక పురాణం - 6 వ అధ్యాయము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 *దీపదానవిధి - మహాత్మ్యం*
*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*

☘☘☘☘☘☘☘☘☘

ఓ రాజశ్రేష్ఠుడా ! ఏ మానవుడు కార్తీకమాసము నెల రోజులూ పరమేశ్వరుని , శ్రీ మహావిష్ణువును , పంచామృత స్నానంచేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో , అట్టివానికి అశ్వమేథయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే యే మానవుడు కార్తీకమాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట యెటులనగా పైడి ప్రత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి , వత్తులు చేయవలెను. వరిపిండితో గాని , గోధుమపిండితోగాని ప్రమిద వలె చేసి వత్తులు వేసి , ఆవునెయ్యి వేసి , దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షణ కూడా యివ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీకమాస మందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవునెయ్యి నిండుగాపోసి వెనుక చేసిన ప్రకారముగా గోదుమపిందితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపం వెలిగించి యీ నెల రోజులూ దానము చేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానముచేసిన బ్రాహ్మణునకే యిది కూడా దానమిచ్చిన యెడల సకలైశ్వర్యములు కలుగటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు యిట్లు పటింపవలెను.

*సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖవహం |*
*దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ ||*

అని స్తోత్రంచేసి దీపదానం చేయవలెను. దీని అర్ధమేమనగా , *"అన్ని విధముల జ్ఞానం కలుగచేయునదియు , సకల సంపదలు నిచ్చునదియునగు యీ దీపదానము చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక !"* యని అర్ధము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేనియెడల పది మంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షణ తాంబూలముల నివ్వవలెను. ఈ విధంగా పురుషులుగాని , స్త్రీలుగాని యే ఒక్కరు చేసిననూ సిరి సంపదలు , విద్యాభివృద్ధి , ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు . దీనిని గురించి ఒక యితిహాసం గలదు. దానిని వివరించెద నాలకింపుమని వశిష్ఠుడు జనకునితో యిట్లు చెప్పసాగెను.

*లుబ్ధ వితంతువు స్వర్గమున కేగుట*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

పూర్వ కాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున నొక స్త్రీ గలదు. ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయెను. సంతానము గాని , ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుచే ఆమె యితరుల యిండ్లలో దాసి పని చేయుచు , అక్కడనే భుజించుచు , ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులిచ్చిన యెడల ఆ వస్తువులను యితరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగయిన సొమ్మును వడ్డీలకు యిచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు , దొంగలు దొంగిలించి కూడ తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని యితరులకు యెక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను.

ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల యిండ్లలో దాసీపనులు చేస్తూ , తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ? ఆమె ఒక్కదినము కూడా ఉపవాసము గాని , దేవుని మనసార ధ్యానించుటగాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని , తీర్ధయాత్రలకు వెళ్ళేవారిని జూచి అవహేళన చేసి , యే ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక , తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది.

అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగానాయకులను సేవించుటకు బయలుదేరి , మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి , ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని అమెకడకు వెళ్లి *"అమ్మా ! నా హితవచనము లాలకింపుము. నీకు కోపము వచ్చినాసరే నేను చెప్పుచున్న మాటలను అలకింపుము. మన శరీరములు శాశ్వతముకావు. నీటి బుడగలవంటివి. ఏక్షణములో మృత్యువు మనలను తీసుకొనిపోవునో యెవరూ చెప్పలేరు. పంచభూతములు , సప్తధాతువులతో నిర్మించబడిన యీ శరీరములోని ప్రాణము - జీవము పోగానే చర్మము , మాంసము కుళ్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి యీ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లీ ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి , దగ్గరకు వెళ్లి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా యీ తనువు శాశ్వతమని నమ్మి , అంధకారములో బడి నశించుచున్నాడు. కాన , నా మాట లాలకించి నీవు తినక , ఇతరులకు పెట్టక , అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైన పేదలకు దానధర్మములు చేసి , పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి , వ్రతాదికములు చేసి మోక్షము నొందుము. నీ పాపపరిహరార్ధముగా, వచ్చే కార్తీకమాసమంతయు ప్రాతఃకాలమున నదీ స్నానమాచరించి , దానధర్మముల జేసి , బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల"* వని ఉపదేశమిచ్చెను.

ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటినుండి దానధర్మములు చేయుచు కార్తీకమాస వ్రతమాచరించుటచే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావున *కార్తీకమాసవ్రతములో* అంత మహత్మ్యమున్నది.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఆరవ అధ్యాయము - ఆరవ రోజు పారాయణము సమాప్తము.*

Monday, 4 November 2024

నాగుల చవితి

నాగుల చవితి🚩

🕉️🐍🕉️🐍🕉️🐍🕉️🐍🕉️🐍🕉️

ఆశ్లేష , ఆరుద్ర , మూల , పూర్వాభాద్ర , పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది , పాకేది.  నాగములో *‘న , అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. 

జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి.  జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ అనగా ‘నాగం’. సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు.  కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’ మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం , సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది. కార్తీకమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం , ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు , అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య , శంకరునికి ఆభరణము కూడా సర్పమే.  కావున నాగులను ఆరాధించడం వలన హరిహరులను సేవించిన ఫలం దక్కుతుంది.

కార్తికమాసమంతా ఇంట్లో నాగ ప్రతిమను ఆరాధిస్తూ , నాగస్తుతిని చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడు. కార్తీకమాసం నెలరోజులు కాకపోయినా కనీసం కార్తీక శుద్ధ చవితినాడు  నాగులను ఆరాధించాలి. చవితి అంటే నాల్గవది అనగా ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో  నాల్గవది మోక్షం కావున ఆనాడు నాగులను ఆరాధిస్తే మోక్షము లభిస్తుంది. అంటే జీవితంలో వచ్చిన కష్టాల నుండి విముక్తులవుతాము. కావున నాగులను చవితినాడు దేవాలయాలలో , గృహములో లేదా పుట్టల వద్ద నాగ దేవతను ఆరాధించాలి.* 

ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును , పుట్టను , రాయిని , రప్పను , కొండను , కోనను , నదిని , పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకొంటూ ! పూజిస్తూవస్తున్నారు. ఇదే మనభారతీయ సంస్కృతిలోని హిందువుల పండగల విశిష్టత. 

నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే "నాగుపాము" ను కూడా నాగరాజుగా , నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు.

ఈ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయటమనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. 

దేవాలయాల్లో రాతి విగ్రహా జంట పాముల ప్రతిమలు , రెండు పాములు మెలికలు వేసుకొని రావి , వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువ గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు , వైవాహిక , దాంపత్య దోషాలు , గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పుజిస్తారు. ఎందుకంటే కుజ దోషం , కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగులచవితిని జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ  జరుపుకుంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు.  ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయిఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే  క్రిమికీటకాదులను తింటూ , పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట !.  అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.

భారతీయ సనాతన సంప్రదాయాల్లో జంతు పూజ ఒకటి. ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలోనూ వ్యాపించి ఉన్నదని ఉపనిషత్‌ ప్రబోధం. ప్రకృతి పరిరక్షణకు తోడ్పడే సద్భావన అది. వేదంలో నాగ పూజ కనిపించకున్నా -  సంహితల్లో , బ్రాహ్మణాల్లో ఆ ప్రసక్తి వస్తుంది. పురాణ , ఇతిహాసాల్లోని గాథల్లో సర్పాలు వివిధ సందర్భాల్లో ప్రత్యక్షమవుతాయి. ఈ రోజునే తక్షకుడు , కర్కోటకుడు , వాసుకి , శేషుడు మొదలైన 100 మంది నాగ ప్రముఖులు జన్మించారని పురాణ కథనం. భూలోకానికి క్రింద ఉన్న అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళ లోకాలల్లో వివిధ జీవరాసులు నివసిస్తాయి. వాటిలో ఐదు రసాతల లోకాల్లో రాక్షసులు నివసిస్తారు. చివరిదైన పాతాళ లోకంలో నాగులు ఉంటాయి. నాగ ప్రముఖులందరూ అక్కడ ఉంటారు. ఈరోజున నాగులకు ఆహారం అందజేస్తే నాగదోషం సహా మొదలైన దోషాలు తొలగిపోతాయి.
కద్రువ నాగ మాత , మహావిష్ణువుకు శయ్యగా అమరిన ప్రాణి ఆదిశేషువు. సర్పం పరమశివుడి కంఠాన మనోహర ఆభరణం. సూర్యభగవానుడి రథానికి సర్పమే పగ్గం. అదే - ఆకాశం మధ్య వెలసిన కుజగ్రహానికి కుదురు. భైరవుడి భుజంపై వేలాడే యజ్ఞోపవీతం సర్పమే. శనిదేవుడి చేతిలోని  ఆయుధమూ అదే. సర్పమే మంథర పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు , రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయకారిగా ఉపయోగపడింది.

దంపతులకు సంతానం కలగకపోవడానికి ప్రాచీన , ఆధునిక వైద్యశాస్త్రాలు పలు కారణాలు చెబుతాయి.  సర్పదోషమే కారణమని భావించినవారు రామేశ్వరం వెళ్లి నాగప్రతిష్ఠ చేయడం రివాజు. అక్కడికి వెళ్లలేనివారు తమ గ్రామ దేవాలయప్రాంగణంలోనే సర్ప విగ్రహాల్ని ప్రతిష్ఠించే పద్ధతి ఉంది. మన ప్రాచీన దేవాలయాల చుట్టూ శిథిలమైన నాగ విగ్రహాలు ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి.

వర్షకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తాయి. అందుకే శ్రావణ మాసంలో సైతం ‘నాగ పంచమి’  పేరుతో పండుగ చేసుకుంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి , రైతులు వాటిని దేవతలుగా భావిస్తుంటారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో ‘కార్తీక శుద్ధ చవితి’నాడు మనం ‘నాగుల చవితి’ని  పర్వదినంగా ఆచరిస్తున్నాం.

పాములకు ప్రాణదానం చేసిన ఆస్తీకుడి కథ భారతంలో ఉంది. ఇతడు జరత్కారువు అనే నాగజాతి స్త్రీకి జన్మిస్తాడు. జనకుడి పేరు జరత్కారుడు. చిన్నతనంలోనే సకల విద్యలూ నేర్చుకున్న ఆస్తీకుడు గొప్ప జ్ఞాని అవుతాడు !.

పరీక్షిత్తు పాముకాటు వల్ల మరణిస్తాడు. ఇందుకు ఆగ్రహించిన అతడి పుత్రుడు జనమేజయుడు సర్వ సర్ప జాతీ నాశనం కావాలని సర్పయాగం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో పాములు వచ్చి యాగాగ్నిలో పడి మాడిపోతాయి. మిగిలిన సర్పాలు తమను రక్షించాలని జరత్కారువును ప్రార్థిస్తాయి.  రాజును ఒప్పించి సర్పయాగం ఆపించాలని ఆమె తన కుమారుడు ఆస్తీకుణ్ని కోరుతుంది. అతడు జనమేజయుడి వద్దకు వెళ్తాడు. అతడి  విద్యానైపుణ్యాన్ని చూసిన జనమేజయుడు సత్కరించడానికి సిద్ధపడతాడు.

‘సర్ప హింస మంచిది కాదు. నీవు ఈ యాగం మాని , వాటిని రక్షిస్తే చాలు. అదే నాకు పెద్ద సత్కారం’ అంటాడు ఆస్తీకుడు. జనమేజయుడు అందుకు అంగీకరించి , సర్పయాగాన్ని విరమిస్తాడు. నాగుల చవితినాడు ఈ కథ వింటే , నాగ దోషాల నుంచి విముక్తి కలుగుతుందని పలువురి నమ్మకం.

పంట పొలాలకు శత్రువులు ఎలుకలు , వాటిని నిర్మూలించేవి పాములు. అవి క్రమంగా కనుమరుగైతే , మానవాళి మనుగడకే ప్రమాదం. నాడు ఆస్తీకుడు వంటి విజ్ఞాని ప్రబోధం వల్ల జనమేజయుడు ప్రభావితుడయ్యాడు. అదే ఉద్బోధతో మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది నాగుల చవితి పండుగ ! ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా , విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 

ఆధ్యాత్మిక యోగా పరంగా :- ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుపాము' అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ  మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది.

నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం*

పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది.  ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.

”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.

నాగుల చవితి మంత్రం
పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగులు చవితి పూజా సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాముకు పాలను సమర్పిస్తుంటారు. చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
అనంత
వాసుకి
శేష
పద్మ
కంబాల
కర్కోటకం
ఆశ్వతార
ధృతరాష్ట్ర
శంఖపాల
కలియా
తక్షక
పింగళ
ఈ ప్రపంంచంలో పాములు, ఆకాశం , స్వర్గం , సూర్యకిరణాలు , సరస్సులు , బావులు చెరువులు నివసిస్తున్నాయి. ఈ రోజు ఈ సర్పాలను పూజించి ఆశీర్వాదాలు పొందుతారు.

పాము పుట్టలో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .

నడుము తొక్కితే నావాడు అనుకో 
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో 
తోక తొక్కితే తోటి వాడు అనుకో 
నా కంట నువ్వుపడకు నీకంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి. 

ప్రకృతిని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము.  పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.

మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.

🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

Sunday, 3 November 2024

కార్తీకపురాణం - 3 వ అధ్యాయము

కార్తీకపురాణం - 3 వ అధ్యాయము


🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*కార్తీక మాస స్నాన మహిమ*
*బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట*


☘☘☘☘☘☘☘☘


జనక మహరాజా ! కార్తీక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ , అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుదురు. కానీ , కొంత మంది ఆస్థిరములైన భోగ భాగ్య ములు విడువలేక , కార్తీక స్నానములు చేయక , అవినీతి పరులై , భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి , కుక్క , పిల్లిగా జన్మింతురు..

అధమము కార్తీక మాస శుక్ల పార్ణమి రోజు అయిననూ స్నాన దాన జప తపాదులు చేయక పోవుట వలన ననేక చండాలాది జన్మ లెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టెదరు. దీనిని గురుంచి నాకు తెలిసిన యితిహాసమొకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్దగా ఆలకింపుము.

*బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఈ భారత ఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు , తపశాలి , జ్ఞానశాలి , సత్య వ్యాక్య పరిపాలకుడు అగు ' తత్వనిష్టుడు' అను బ్రాహ్మణుడొక డుండెను. ఒక నాడా బ్రాహ్మణుడు తీర్ధ యాత్ర సక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును. ఆ తీర్ధ సమీపమున ఒక మహా వట వృక్షంబు పై భయంకర ముఖములతోను , దీర్ఘ కేశములతోను , బలిష్టంబులైన కోరలతోను , నల్లని బాన పొట్టలతోను , చూచువారుకి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ , ఆ దారిన పోవు బాట సారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంత మంతయు భయకంపితము చెయుచుండిరి. తీర్ధ యాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్య క్షేత్రమున పితృ దేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు అ వృక్షము చెంతకు చేరుసరికి యథా ప్రకారము బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు 
సమయమున , బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజ గజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రం భిగ్గరగా పటించుచు ' ప్రభో ! ఆర్త త్రాణ పరాయణ ! అనాధ రక్షక ! ఆపధలోనున్న గజేంద్రుని , నిండు సభలో అవమానాలు పలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని , బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే - ఈ పిశాచములు బారినుండి నన్ను రక్షించు తండ్రీ ! అని వేడుకొనగా , ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి *'మహానుభావా ! మీ నోటినుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు'* యని ప్రాదేయపడిరి. వారి మాటలకూ విప్రుడు ధైర్యం తెచ్చుకొని *' ఓయీ ! మీరెవరు ? ఎందులకు మీకి రాక్షస రూపంబులు కలిగెను ? మీ వృత్తాంతము తెలుపుడు'* అని పలుకగా వారు *'విప్ర పుంగవా ! మీరు పూజ్యులు , ధర్మాత్ములు , వ్రతనిష్టాపరులు , మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన యే ఆపద కలగదు'* అని అభయమిచ్చి , అందొక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతము ఈవిదముగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం బ్రహ్మనుడను నేను మహా పండితుడనని గర్వము గలవాడినై యుంటిని. న్యాయాన్యాయ విచాక్షణలు మాని పసువునై ప్రవర్తించితిని , బాటసారుల వద్ద , అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాగుకోనుచు , దుర్వ్యసనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక , పండితులను అవమానపరచుచు , లుబ్దుడనై లోక కంటకుడిగ నుంటిని.
ఎట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమర్ధన చేయు తలంపుతో పదార్ధ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చేను. వచ్చిన పండితుని నేను దూషించి , కొట్టి అతని వద్ద ఉన్న ధనము , వస్తువులు తీసుకోని ఇంటినుండి గెంటి వేచితిని. అందులకు విప్రునకు కోపము వచ్చి *'ఓరి నీచుడా ! అన్యక్రాంతముగ డబ్బు కూడా బెట్టినది చాలక , మంచి చెడ్డలు తెలియక , తోటి బ్రాహ్మణుడని గూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకొంటివి , నివు రాక్షసుడవై , నరభక్షకుడవై నిర్మానుష్య ప్రేదేశాములలో నుందువు' గాక !* అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మస్త్రమునైన తప్పించుకొవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము గదా ! కాన నా అపరాదము క్షమింపుమని వారిని ప్రార్దించితిని. అందులకతడు దయతలచి' ఓయీ ! గోదావరి క్షేత్రమందొక వట వృక్షము గలదు. నివందు నివసించుటచే బ్రాహ్మణుడి వలన పునర్జన్మ నొందుదువు గాక' అని వేడలిపోయాను. ఆనాటి నుండి నేని రాక్షస స్వరుపమున నరభక్షణము చేయుచుంటిని. కాన , ఓ విప్రోతమ ! నన్ను నా కుటుంబము వారిని రక్షింపుమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.

ఇక రెండవ రాక్షసుడు - ' ఓ ద్విజోత్త మా ! నేను కూడా పూర్వ జన్మలో బ్రహ్మనుడనే. నేను నీచుల సహవాసముచేసి తల్లితండ్రులను భాదించి వారికీ తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రాయను నటులచేసి , వారి యెదుటనే నా బార్య బిడ్డలతో పంచభక్ష్య పరమన్నములతో భుజించుచుండేడివాడను. నేను యెట్టి దానధర్మములు చేసి ఎరుగను , నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించితిని. కావున , నాకీ రాక్షస సత్వము కలిగెను. నన్ని పాప పంకిలము నుండి ఉద్దరింపుము' అని బ్రాహ్మణుని పాదములపై పడి పరి పరి విధముల వేడుకొనెను.
మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును యిటుల తెలియ జేసెను. ' మహాశయా ! నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రహ్మణుడను. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నాన మైనను చేయక , కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేడి వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యము లైనను అర్పించక , భక్తులు గొనితేచ్చిన సంభావమును నా వుంపుడు గత్తెకు అందజేయుచు మద్యం మాంసము సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణనంతరము ఈ రూపము ధరించితిని , కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపు' మని ప్రార్ధించెను. ఓ జనక మహారాజ ! తపోనిష్టుడగు ఆ విప్రుడు పిశాచములు దినలపము లాలకించి *'ఓ బ్రహ్మ రాక్షసులరా ! భయపడకుడు. మీరు పూర్వ జన్మలో చేసిన ఘోర క్రుథ్యంబులవల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండు మీకు విముక్తిని కలిగింతును'* అని , వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి చేతన విముక్తి సంకల్పము చెప్పుకొని తనే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్య ఫలమున ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంటమున కేగిరి. కార్తిక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది , వారికీ సకలైశ్వర్యములు ప్రసాదించుదురు. అందువలన , ప్రయత్నించి అయినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి.

*ఇట్లు స్కాంద పురాణాంతర్గత, వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య* *ముందలి*
*మూడవ అధ్యాయము -* *మూడవ రోజు పారాయణము సమాప్తము.*

Saturday, 2 November 2024

కార్తీక పురాణగాధ 🙏


కార్తీకపురాణం - 2 వ అధ్యాయం*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*సోమవార వ్రత మహిమ*
*కుక్క కైలాసానికి వెళ్లుట*

☘☘☘☘☘☘☘️☘☘

వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు *”జనకా ! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని , దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను”* అని ఇలా చెప్పసాగాడు.

*”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని , పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం చేసి , తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి , సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి , పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి.*నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత , తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి , సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే… కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను”* అని ఇలా చెప్పసాగాడు.

*🌹కుక్క కైలాసానికి వెళ్లుట🌹*

*”పూర్వ కాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్టురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్హణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు , శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’* అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో , కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తమామలను , భర్తను తిట్టడం , కొట్టడం , రక్కడం చేసేది. పురుషసాంగత్యంతో వ్యభిచారిణియై… తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు , బట్టలు , పువ్వులు , ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు.

ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పడేసి, పైన చెత్తచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని , అడ్డూఅదుపు ఉండదనే అహంకారం పెరిగి… ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి , నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది. అంతటితో ఆగకుండా… కన్యలు , పెళ్లైన మహిళలకు దుర్బుద్దులు నేర్పి , పాడుచేసి , విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది.
ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసినపాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము , రక్తం కారుతూ , క్రమంగా కుష్టువ్యాధిబారిన పడింది. రోజురోజుకూ ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమెకోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి , పురుగులు పడి చనిపోయింది.
బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని , విటులతో సుఖించినందుకు ఇనుపస్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనపగదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు , అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో , చెవిలో పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా , ఇటు ఏడు తరాలు , అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ , క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.
కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే.. తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి , ఉపవాసము ఉండి , సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి , ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి , కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.
వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపెంచిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసము ఉండడము , శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క *‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’* అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. *‘రక్షించు… రక్షించు…’* అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు *‘ఎవరు నీవు ? నీ వృత్తాతమేమిటి ?’* అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు , భర్తను చంపడం , వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి , చనిపోయిన తీరును , నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. *‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి , ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకరాంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి , నాకు మోక్షం కలిగించు’ అని ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క జన్మను చాలించి , సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”*


_*కార్తీకపురాణం - 1 వ అధ్యాయం*_

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*కార్తీక మాసం మహత్యం*
*కార్తీక మాస వ్రతవిధానం*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

ఒక రోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… *”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను , వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత , కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..”* అని కోరారు.

శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… *”ఓ మునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు , పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో , పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి”* అని చెప్పసాగాడు.

పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో *”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి , మానవులంతా కులమత తారతమ్యం లేకుండా , వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి”* అని కోరింది.

అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు *”దేవీ ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….”* అని ఆ దిశగా చూపించాడు.

మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి , ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు *”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను , నా శరీరం , నా దేశం , ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి ?”* అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు *”జనక మహారాజ ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన , సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను”* అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.

దీనికి జనకుడు *”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ , ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ? ఈ నెల గొప్పదనమేమిటి ? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా ?”* అని ప్రార్థించారు.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి *”రాజ ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ , పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….”* అని చెప్పసాగాడు.

*కార్తీక వ్రతవిధానం*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*”ఓ జనక మహారాజా ! ఎవరైనా , ఏ వయసువారైనా పేద - ధనిక , తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి , కాలకృత్యాలు తీర్చుకుని , స్నానమాచరించి , దానధర్మాలు , దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన , శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి”* అని వివరించారు.

వ్రతవిధానం గురించి చెబుతూ… *”ఓ రాజా ! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి , కాలకృత్యాలు తీర్చుకుని , నదికిపోయి , స్నానమాచరించి గంగకు , శ్రీమన్నారయణ , పరమేశ్వరులకు , బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి , సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి , పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా , గోదావరి , కృష్ణ , కావేరీ , తుంగభద్ర , యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని , శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి , నిత్యధూప , దీప , నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి , భగవంతునికి సమర్పించి , తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి , వారికి ప్రసాదం పెట్టి , తన ఇంటివద్దగానీ , దేవాలయంలోగానీ , రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి , శివాలయంలోగానీ , విష్ణు ఆలయంలోగానీ , తులసికోట వద్దగానీ , దీపారాధన చేసి , శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి , స్వామికి నివేదించాలి. అందరికీ పంచి , తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు , మగవారు గతంలో , గతజన్మలో చేసిన పాపాలు , ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు , వీలు పడనివారు వ్రతాన్ని చూసినా , వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.

*ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం.*