Friday, 19 January 2024

రామాయణంలో చిన్న పాత్రలు

రామాయణంలో చిన్న పాత్రలు

రత్నం వందే అను హనుమత్ స్వయంప్రభా సంభాషణము
మరియు
సీతమ్మ మా యమ్మ 

దక్షిణ సముద్రం అది ! మహోదధిగా పిలుస్తారు. దాని ఒడ్డున దాదాపు పాతిక మంది వీరులు కొందరు కూర్చుని, కొందరు నిలబడి, కొందరు నడుమువాల్చి దక్షిణ దిశగా చూస్తున్నారు. అందరి కళ్ళలో ఆతృత, ఆశ ! నిస్పృహగా ఎవరూ లేరు.

అప్పుడే ఇరవై గడియలు దాటింది. ఇప్పుడో, ఇంకొక గడియో అని ఎదురు చూస్తున్నారు.

"యువరాజా ! మనం ఎంతవరకు వేచి చూడవచ్చు ?" అని అడిగాడొక నవయువక వీరుడు.
""ఆయన తిరిగి వచ్చేదాకా !" క్లుప్తంగా అని మళ్ళీ దక్షిణం వైపు దృష్టి సారించాడు నాయకుడు యువరాజు. "ఈపాటికి వచ్చేస్తూ ఉండాలి " అని స్వగతంగా అనుకున్నాడు.
దూరంగా ఉరిమింది, సాగరం, ఆకసం కలిసేచోట బంగారపు రంగుతో మేఘం కనబడింది. అది అత్యంత వేగంగా ఉత్తర దిక్కుగా వీరి వైపే వస్తున్నది. యువరాజు ముఖంలో చిరునవ్వుతో కూడిన ఉత్సాహం.

ఆ మేఘం రాను రాను పెద్దదవుతూ చివరకు కొండంత ఆకారంతో, వానర రూపంతో, నేలమీదకు దిగి తోకను తిరిగి తిరిగి భూమికి తాటిస్తూ "చూచాను సీతను !" అని నిజ ఆకారం దాల్చింది.

అత్యంత సంతోషంతో అక్కడ సెలయేరులో దూకి ముమ్మారు మునకలు వేసి ఒడ్డుకు వచ్చి ముందుగా అత్యంత వరిష్ట యోధుడైన భల్లూకప్రభువు జాంబవంతునికి భక్తితో సాగిలపడ్డాడు హనుమ.

వానరవీరులందరూ ఒక్కపెట్టున జయజయధ్వానాలు చేశారు. ఆ తర్వాత హనుమ, యువరాజు అంగదుడు, మైందుడు, ద్వివిదుడు ఆదిగా గల వీరులను సమాదరించి లంకకు బయల్దేరి వెళ్ళినది మొదలు తనకు ఎదురైన అవాంతరాలను, తాను ఎదుర్కొన్న వైనాలు, సీతాన్వేషణా వివరాలు, అశోకవనిలో తల్లిని కనుగొన్న వార్త, ఆ తర్వాత రావణ సైన్యంతో యుద్ధం, రావణుడితో భేటీ, లంకా దహనం అన్ని వివరాలూ క్లుప్తంగా చెప్పి అంగదుడి వైపు తిరిగి "యువరాజా ! శ్రీ రామ ప్రభువుకు శీఘ్రంగా ఈ వార్త తెలియజేయాలి. మీరు ఆజ్ఞాపిస్తే వెంటనే ప్రస్రవణ పర్వతాన్ని చేరుకుందాము " అన్నాడు.

********* ***********

వేగంగా కిష్కింధ కు వెళ్తున్న వానరులను మధ్యలో మధువనం నుంచి వచ్చే తేనె పరిమళాలు అకస్మాత్తుగా ఆపేశాయి.

అంగదుడి వైపు వారంతా దీనవదనాలతో చూశారు. వారి ఆకలి, ఆలోచనను పసిగట్టిన యువరాజు చిరునవ్వుతో అంగీకారంగా తల ఊపాడు. ఆయనకీ ఆకలిగానే ఉంది పాపం.

ఆనందోత్సాహాలతో ముందుగా వారు భాండాగారం మీద దండయాత్ర చేశారు. ముందుగా అంగదుడి ఆజ్ఞ మేరకు అన్నిటి కన్నా పెద్ద తేనె భాండాన్ని జాంబవంతుడికి సభక్తికంగా సమర్పించి, ఆ తరువాత అంగదుడికి ఇచ్చి, మిగిలిన భాండాలను సమానంగా పంచుకున్నారు.

ముందుగా ఉత్సాహం, ఆ వెంట ఆనందం, ఆ పైన ఉల్లాసం చివరగా ఉన్మాదం స్థితి లోకి ఇట్టే వెళ్ళి పోయారు. కుండలు ఖాళీ కాగానే చెట్ల మీద పడి తేనె తుట్టెలు పిండేసి తాజా మధువును గ్రోలేశారు. అవి అయిపోగానే చెట్ల పండ్లను ఆరగించేసారు.

తనకిచ్చిన భాండం నుంచి కొద్ది కొద్దిగా తాగిన జాంబవంతుడు ఆ భాండం ఖాళీ ఐన తర్వాత చుట్టూ చూశాడు. కొంచెం దూరంలో హనుమంతునితో మాట్లాడుతున్న యువరాజు కనిపించాడు. హనుమంతుడు చెప్పిన దానికి అంగీకార సూచకంగా తల ఆడించి వేరే కుండ అందుకున్నాడు అంగదుడు.
జాంబవంతుడు రామనామ జపంలో మునిగిపోయాడు.

******** *********

దివ్యమైన మణిమయ హేమ కాంతులతో అలరారే భవనాలు. ఆ ముందర రత్నకాంతులీనుతూ మహా వృక్షాలు . ఒక వృక్షం క్రింద ధ్యాన ముద్రలో పద్మాసనం వేసుకుని ఉంది ఒక వృద్ధ తాపసి.

ఆమె ఎదురుగా రెండు గడియలనుంచి సహనంగా వేచి ఉన్నాడు హనుమ. ఆయన కూడా అర్ధనిమీలిత నేత్రాలతో రామనామ స్మరణ చేస్తున్నాడు. ఆ తాపసి నెమ్మదిగా కళ్ళు తెరిచి నమస్కారం ఆచరించి అప్పుడు హనుమను గమనించింది. .

ఏదో మంత్రం వేసినట్లు హనుమంతుడు కూడా కళ్ళు తెరిచి రాముడికి మనసా నమస్కరించి, ఆ తాపసికి వందనమాచరించాడు.
"నాయనా ! రెండే రోజులైనట్లు ఉంది ? మళ్ళీ వచ్చావు. నీ స్వామి కార్యం సఫలమైనదా ?" అని అడిగింది చిరునవ్వుతో .
"అమ్మా ! మీ ఆశీర్వచనం వమ్ము ఎప్పుడూ అవదుగా తల్లీ ! ఆ రామచంద్ర ప్రభువు అనుగ్రహంతో నేను వెళ్లిన పని సఫలమైనదమ్మా !"
"చాలా సంతోషం నాయనా ! నీకు సమయం ఉంటె నాకు నీ ప్రయాణ విశేషాలు చెబుతావా !"

"ఎంత మాట అమ్మా ! నీకు అన్నీ చెబుదామని వచ్చాను. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి సంపాతి. మాకు మార్గ నిర్దేశనం చేసిన వాడు. ఆయనకీ ప్రభువు కార్యం మీద మాకు మాట సాయం చేసినందుకే కాలిపోయిన ఆయన రెక్కలు తిరిగి వచ్చేసాయి. ఆయనకు నెమ్మదిగా చెపుతాను. మీకు విశేషాలు చెపుతానమ్మా !"
అని హనుమ స్వయంప్రభకు తన మహేంద్రగిరి నుంచి లంక వరకు జరిగిన ప్రయాణాన్ని, మైనాక, సురస, సింహికా వృత్తాంతాలను చెప్పాడు.

"నాయనా ! మైనాకుడు సత్త్వ గుణంతో నీకు ఆతిధ్యమివ్వబోతే నీవూ సత్వ బుద్ధితోనే ఆదరించావు. సురసను దేవతలు నిన్ను పరీక్షించడానికి పంపారు. ఆమె రాజస బుద్ధితో నిన్ను అడ్డుకుంటే రాజసంగానే యుక్తితో ఆమెను అధీగమించావు. తామస ప్రవృత్తి తో సింహిక నిన్ను మడియించాలని చూస్తే నీ పరాక్రమంతో ఆమెను నిర్జించావు. త్రిగుణములను జయించావు నాయనా !"
"అమ్మా ! అంతా మీ ముత్తాత గారు, మా గురుదేవులు శ్రీ సూర్య భగవానుని శిక్షణయే తల్లీ"

లంకలో ప్రత్యేకంగా రావణ మందిరంలో సీతాన్వేషణను, మండోదరికి చూసి సీత అని భ్రమపడడము విని ఆమె చిరునవ్వుతో తలపంకించింది. అశోకవనంలో సీతను కనుగొన్న వైనం విని ఆమె " హనుమా ! లంకకు బయల్దేరే ముందు రామలక్ష్మణులను , నీ తండ్రినీ. దేవతలనూ, మరుద్గణాలనూ స్మరించావు, కానీ అశోక వనం ప్రవేశించే ముందు సీతా లక్ష్మణులను కూడా స్మరించుకున్నావు. అందు వలననే అమ్మ దర్శనమైంది." అన్నది.

"అవునమ్మా ! అది గ్రహించాను తల్లీ!"

హనుమంతుడు సీతా మాత స్థితిని చూసి చలించిపోవడము విని ఆమె సానుభూతితో తల పంకించింది.

ఆ తర్వాత రావణుడు రావడము, సీతమ్మ ఆయనను తృణీకరించడము, రావణుడు బెదిరించి రాక్షస స్త్రీలతో ఆమెను ఒప్పించమని ఆదేశించడము విని సానుభూతిగా శిరః కంపం చేసింది.

హనుమ రామకథను అవధీ భాషలో గానం చెయ్యడం విని మెచ్చుకోలుగా హనుమ వైపు చూసింది. సీతామాత హనుమను చూడడము, ఆయనను రాముడి గురించి ప్రశ్నలు వెయ్యడమూ, ఆయన రామ లక్ష్మణుల వర్ణనను ఆనందంగా విన్నది.

అంగుళీయకం ఇచ్చిన పిమ్మట సీతామాత హనుమను పూర్తిగా నమ్మడము, ఆ పైన హనుమ సీతను తన మూపున అమ్మను తీసుకుని వెళ్తానని వేడుకోవడం విని కొద్దిగా ఆశ్చర్యం ప్రకటించింది. సీతమ్మ తిరస్కరించడం విని సంతృప్తిగా తల ఆడించింది.

ఆ తరువాత అశోకవన ధ్వంసము, రావణ మంత్రి కుమారుల హతము, జంబుమాలి మరణము తరువాత అక్షకుమారుని స్వర్గపురానికి పంపడము చివరిగా మేఘనాధునితో ద్వంద్వ యుద్ధము, ఆ పై బ్రహ్మాస్త్రానికి కట్టుబడినట్లు ఉండి లొంగిపోవడము ఆశ్చర్యముగా విన్నది.

రావణ సభలో రావణునితో సంవాదము, రావణుని మరణ శిక్షా ప్రకటన, విభీషణుడి ప్రమేయంతో అది తోకకు నిప్పు పెట్టడం విని తృప్తిగా తలాడించింది.

లంకా దహనం వృత్తాంతం విని విజయసూచకంగా చిరునవ్వు నవ్వింది.
మరలా సీతా దర్శనం చేసి మరలి వచ్చానని చెప్పి హనుమంతుడు మిన్నకుండిపోయాడు.

హనుమంతుని మాటల్లో తేడాను, ఆయన కంఠంలో ఇంచుక గద్గదతను గమనించి స్వయంప్రభ అడిగింది, "నాయనా ! ఇంతటి కఠినమైన కార్యం అంత సులభంగా పూర్తి చేసి ఈ బేలతనమేమిటయ్యా ?"

హనుమ ముఖంలో ప్రసన్నత ఉన్నా ఆయన కపోలాలపై కన్నీరు కారిపోతున్నది.

"తల్లీ ! ఇంత కాలం సీతా విరహంతో శ్రీరాముడి దుఃఖాన్ని చూశానమ్మా ! ఆయన పడిన కష్టాలు ఎవరూ, చివరికి సుగ్రీవ ప్రభువు కూడా పడలేదని అనుకున్నానమ్మా ! ఈ రోజు సీతమ్మ ను చూసాక ఆ ఆలోచన మారిపోయింది. "

"అలా ఎందుకనిపించింది ఆంజనేయా ?"

"తల్లీ ! శ్రీ రాముడు సీత కనిపించక దుఃఖించాడు. ఎన్నో చోట్ల అన్వేషించాడు, జటాయువు మరణాన్ని దగ్గరగా చూచాడు, తండ్రి వంటి ఆయనకు ఏంటో దుఃఖంతో అంతిమ సంస్కారాలు చేసాడు, తమ్ముడు లక్ష్మణుడు ఆయన వెంటే ఉంటూ ఉత్సాహ పరిచేవాడు.

వారు వనాలు, నదీ నదాలు దాటారు , శబరి ఆశ్రమంలో సేదతీరారు , శ్రీ రాముడు సుగ్రీవుని సఖ్యత పొందాడు, వాలిని కూల్చి సుగ్రీవునికి రాజ్యాభిషేకం చేశాడు , చివరికి సీతమ్మ ఎక్కడ ఉన్నదో తెలియక సుగ్రీవుడు వానర సేనలను నాలుగు దిక్కులకి పంపినప్పుడు ఆమె ఎటువైపు దిక్కులో దొరుకుతుందో తెలియక బాధ పడ్డాడు. చివరకు మమ్ములను దక్షిణ దిక్కుగా పంపుతూ ఎక్కువ సూచనలు ఇస్తూ ఉండడం చూసి ప్రభువు మా మీద నమ్మకంతో అంగుళీయకాన్ని నాకు ఇచ్చారమ్మా !'

"నాయనా ! సుగ్రీవుడికి రావణుడు ఎక్కడ ఉంటాడో తెలియదా ? ఆయన చాకచక్యంగా శ్రీరామునికి ఆ విషయం తెలియనివ్వకుండా నాలుగు చెరగులా వానరులను పంపాడు. ముందరే రాముడికి లంక సంగతి తెలిస్తే అటు వైపే బయల్దేరుదామని తొందర చేసే వాడు. రావణుడు ఆ విషయం పసిగట్టినట్టయితే సీతను వేరేచోట ఇంకా ఎక్కువ జాగ్రత్తలతో దిగ్బంధం చేసేవాడు."

"కానీ అమ్మా ! సీతమ్మను చూశాక ఆమె పరిస్థితి అర్ధం చేసుకున్నాక అమ్మ పడిన కష్టాల ముందు శ్రీ రాముడి కష్టాలు ఎక్కువ కాదనిపించిందమ్మా ! ఆమె కళ్ళ ఎదురుగా మామగారి ప్రియమిత్రుడు జటాయువు రెక్కలు తెగి గిలగిలా కొట్టుకోవడం చూసిందమ్మా ! రావణుడు ఏ దిక్కుగా పోతున్నాడో ఆమెకు తెలియలేదు, మాపై విసిరిన ఆమె ఆభరణాల మూట తప్ప ఇంక ఆవిడ ఏమీ చెయ్యలేక పోయిందమ్మా ! రావణుడి దేశమేదో తెలియదు. ఆ దేశంలో తనను ఉంచిన అశోకవనం ఏ దిక్కున ఉందొ తెలియదామెకు రామా రామా అని అహోరాత్రాలూ శోకించడం తప్ప ఏమీ చెయ్యలేకపోయింది, రావణుడు వచ్చి వదరే మాటలు విని గుడ్ల నీళ్లు కుక్కుకోవడం, రాక్షస స్త్రీలు ఆమెను నిత్యమూ బెదిరించడం, రావణుడు ఇచ్చిన ఏడాది గడువు పది నెలలు గడచిపోవడం, తన ఉనికి శ్రీరాముడికి తెలుసో లేదో కూడా ఎరగదమ్మా ఆమె. చివరకు నేను చేసిన రామ గుణగానం విని కూడా నన్ను రాక్షసుడనే అనుమానించిందమ్మా మా అమ్మ !" అని ఇంక మాట్లాడలేక ఊరుకున్నాడు హనుమ.

కొంత తేరుకుని "నేను వచ్చేటప్పుడు ఏమని అన్నదో తెలుసా అమ్మా , మా సీతమ్మ ? 'నాయనా నిన్ను చూస్తుంటే నా ఆప్త బంధువును చూసినట్లు ఉన్నది. ఇంకొక్క రోజు ఉండిపోరాదా తండ్రీ !' అని అడిగిందమ్మా " అని మళ్ళీ కంఠం రుద్ధమవగా ఆపేశాడు హనుమ.

"నేను ఇంకొక్క రోజు ఆమె దగ్గర ఉండలేదే అని దుఃఖితుడనువుతున్నానమ్మా !" అన్నాడు.

"ఊరడిల్లు నాయనా ! రామునికి ఆ వార్త తెలియక పొతే ఎన్ని అనర్ధాలు కలిగేవో" అన్నది ఆ తాపసి.

"అమ్మా !మా సీతమ్మ కష్టాలు గట్టెక్కేనా ? రామయ్య రావణుడిని నిర్జించి సీతమ్మను చేపడతారు కదా ? ఇద్దరూ అయోధ్యకు మరలివెళ్లి పట్టాభిషిక్తులౌతారు కదా ? అమ్మకు ఇంక పరీక్షలకు తట్టుకునే శక్తి లేదనిపిస్తోందమ్మా ! నువ్వు అవునని అనుమమ్మా ! నీ వాక్కు అమోఘం " అన్నాడు హనుమ.

"నాయనా ! ఇంకా కొంత కర్మ పరిపక్వమవ్వాలి. సీత అగ్నిశిఖ తండ్రీ ! అన్నిటినీ తట్టుకుంటుంది" అన్నదే కానీ ఇంక వివరించలేదు.

హనుమ కూడా ఆమె ముఖ కవళికలు గమనించి ఇంక పొడిగించలేదు.

"నాయనా ! నువ్వు ఇంక బయల్దేరి శ్రీ రాముడి దగ్గరకు వెళ్ళు. ఆయనకు ఈ శుభవార్త అందజెయ్యి. నీ వలన కావలసిన మహత్కార్యాలు ఉన్నాయి తండ్రీ !" అని హనుమను బయల్దేరదీసింది స్వయంప్రభ.

ఋక్ష బిలం ద్వారం దగ్గర హనుమను ఆశీర్వదిస్తూ అన్నది ఆవిడ. "నాయనా !నువ్వు ఈ రోజు చేసినది ఒక మహోపకారం . భూత భవిష్యత్ కాలాలలో ఎవ్వరూ చెయ్యనిది , చెయ్యలేనిది నాయనా ! నీ పేరు సీతా రాముల కధ ఉన్నన్నాళ్లూ ప్రజలు తలచుకుంటారు "

అమ్మా ! నేను లంకకు సునాయాసంగా ఎగిరి వెళ్ళానంటే నా తోడుగా రామ అంగుళీయకము ఉన్నదమ్మా ! వచ్చేటప్పుడు సీతమ్మ చూడామణి నా వెంట ఉన్నదమ్మా !

"అమ్మా ఇది ఉపకారమేమిటి తల్లీ ! శ్రీ రాముడికి సంతోషం కలిగించే వార్త ఏదైనా అది నేను చేసే ఉపకారం అనుకోనమ్మా !"

"ఎంత నిగర్వివి హనుమా ! చిరంజీవ !!"ఇది తన మనసులోనే అనుకొని ఆశీర్వదించిందా వృద్ధ తాపసి .

🙏