Monday, 30 November 2020

*శివ దర్శనం



*కార్తీకమాసం* సందర్భం గా *శివదర్శనం* శీర్షికన రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకుందాం.  ....

 *నటరాజస్వామి ఆనందతాండవ క్షేత్రం-* 
 *చిదంబరం -తమిళనాడు* 

☘️☘️☘️☘️☘️☘️☘️☘️

పరమశివుడు నటరాజస్వామిగా ఆనంద తాండవం చేసిన మహాపుణ్యక్షేత్రం చిదంబరం. తమిళనాడులోని చిదంబరం పంచభూత క్షేత్రాల్లో ఒకటిగా యుగయుగాల నుంచి ప్రసిద్ధిపొందింది. పంచభూతాల్లో ఒకటైన ఆకాశతత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.

 50 ఎకరాలుగా పైగా ఉన్న సువిశాల స్థలంలో విస్తరించివున్న ఈ క్షేత్రంలో శివ, కేశవ మందిరాలు ఉండటం విశేషం. వైష్ణవులకు శ్రీరంగం ఎంత పవిత్రమో.. శైవులకు చిదంబరం అంత పవిత్రమైన మహాక్షేత్రమని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి. పంచభూత ఆలయాల్లోని శ్రీకాళహస్తి, కంచి, చిదంబరం ఒకే అక్షాంశంపై నిర్మితమై ఉండటం విశేషం.


నటరాజస్వామి.. ఇక్కడ ఈశ్వరుడు నటరాజస్వామిగా దర్శనమిస్తాడు.

 నాట్యభంగిమలో ఉన్న స్వామి పాదం కింద అజ్ఞానం రాక్షసుడి రూపంలో ఉంటుంది.చేతిలో నిప్పు దుష్టశక్తులను నాశనం చేస్తుందని అర్థం. అలాగే మరో హస్తం సర్వజగత్తును పరిరక్షించేవాడని సూచిస్తుంది. ఢమరుకం జీవం పుట్టుకను సూచిస్తుంది. పరమశివుడు చిద్విలాస నాట్యాన్ని వీక్షించాలని ఆదిశేషువు ఆశిస్తాడు. అంత మహావిష్ణువు యోగ స్వరూపుడైన పతంజలి రూపాన్ని ప్రసాదించి భూమిపైకి పొమ్మని ఆజ్ఞాపించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.


*స్థల పురాణం:*


‘చిత్‌’ అంటే మనస్సు. అంబరం అంటే ఆకాశం అని అర్థం. ఎన్నో యుగాలకు ముందు పరమేశ్వరుడు ఇక్కడి తిలై వనాల్లో విహరించేవాడు. శివుడు భిక్షువు రూపంలో తిరుగుతుంటే మోహిని అవతారంలోని విష్ణుమూర్తి ఆయనను అనుసరిస్తాడు. పార్వతీనాథుని ప్రకాశవంతమైన తేజస్సుకు మునుల సతీమణులు ఆశ్చర్యానికి లోనవుతారు. దీంతో ఆగ్రహించిన మునులు సర్పాలను వదులుతారు. లయకారకుడైన శివుడు వాటిని మెడకు, నడుముకు కట్టుకుంటాడు. ఈ సంఘటనతో మరింత ఆగ్రహించిన మునులు ఒక రాక్షసుడిని పంపుతారు. శివుడు ఆ రాక్షసుడి వీపు మీద కాలు మోపి కదలకుండా చేస్తాడు. అనంతరం ఆనందతాండవం చేస్తాడు. దీంతో భగవంతుని నిజ స్వరూపాన్ని గ్రహించిన మునులు ఆయనను శరణు వేడుకుంటారు.


చిదంబర రహస్యమంటే.. ఈ క్షేత్రంలో స్వామి విగ్రహ, ఆకార రహిత ఆకాశ, స్ఫటిక లింగ రూపాల్లో ఉంటారు. అయితే, విగ్రహాన్ని మాత్రమే చూడగలం గానీ ఇతర రూపాలను చూడలేము. 

చిత్‌సభానాయక మండపంలోని స్వామివారు ఆకాశ రూపంలో కంటికి కనిపించకుండా ఉంటారు. పురోహితులు మందిరంలోని తెరను తొలగించి హారతిని ఇస్తారు.

 భగవంతుడు ఆదియును అంతమును లేనివాడు అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఉండబోదు. 

మన అజ్ఞానాన్ని తొలగించుకొని భగవంతున్ని సన్నిధిని వీక్షించడంతో దివ్యానుభూతి కలుగుతుంది.


గోవిందరాజస్వామి సన్నిధి 
ఆలయ ప్రాంగణంలోనే శ్రీ గోవిందరాజస్వామి మందిరం ఉంది. శివ,కేశవ మందిరాలు ఒకే ప్రాంగణంలో ఉండటం అరుదైన విశేషం. హరి, హరులకు ఎలాంటి భేదాలు లేవని ఈ క్షేత్రం నిరూపిస్తోంది.

 108 దివ్యదేశాల్లో ఒకటిగా గోవిందరాజస్వామి ఆలయాన్ని పేర్కొంటారు. కులశేఖర ఆళ్వారు తన రచనల్లో ఈ ఆలయాన్ని ప్రస్తావించారు.
మానవదేహానికి ప్రతీక..

 ఆలయం మానవ దేహానికి ప్రతీకగా ఉంటుందని పెద్దలు చెబుతారు. నమఃశివాయ మంత్రంలో 21,600 బంగారు పలకలను వినియోగించారు. ఒక మనిషి ప్రతిరోజూ తీసుకునే శ్వాస ప్రక్రియతో ఈ సంఖ్య సరిపోతుంది. అలాగే చిత్‌సభ (పొన్నాంబళం)లో 72 వేల మేకులు వాడారు. ఇది మన దేహంలోని నరాల సంఖ్య అని చెప్పవచ్చు. 

ఇలా అనేక విశేషాల సమాహారంతో కూడిన చిదంబర క్షేత్ర సందర్శన మనకు మంచి ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది.
 
ఓం నమః శివాయ 🙏🙏

☘️☘️☘️☘️☘️☘️

Monday, 16 November 2020

కార్తిక_పురాణం -3 వ భాగం:


అథ తృతీయోధ్యాయ ప్రారంభః

శ్లో!! కార్తీకేమాసి రాజేంద్ర స్నానదాన జపాదికం!
లేశంవాకురుతేమర్త్యః తదక్షయ్య ఫలం స్మృతమ్!!

ఓ జనకమహారాజా! వినుము. కార్తీకమాసమందు స్నానము దానము జపము మొదలయిన పుణ్యములలో ఏదయినను స్వల్పమైనా చేసినయెడల ఆస్వల్పమే అనంతఫలప్రదమగును. స్త్రీలుగాని, పురుషులుగాని, అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీరకష్టమునకు భయపడి కార్తీకవ్రతమును జేయని యెడల నూరుమారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పున్నమిరోజున స్నానదానములు ఉపవాసమును జేయని మనుష్యుడు కోటిమారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివకు బ్రహ్మ రాక్షసుడైయుండును. ఈవిషయమందొక పూర్వకథ గలదు. చెప్పెదను వినుము.

ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిదైయున్నది. గనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రిఅయములను జయించివాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలందాసక్తి గలవాడు. రాజా! ఆబ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకుబోవుచు గోదావరీ తీరమందు ఆకాశమునంటియున్నట్లుండు ఒక మర్రిచెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులనుజూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తలవెంట్రుకలు పైకి నిక్కియున్నవి. నోరు వికటముగానున్నది. శరీరము నల్లగానున్నది. ఉదరము కృశించియున్నది. నేత్రములు, గడ్డము, ముఖము ఎర్రగానున్నవి. దంతములు పొడుగుగానున్నవి. చేతిలో కత్తులపైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి. ఆరాక్షసుల భయముచేత ఆవటవృక్షమునకు ఆరుక్రోశముల దూరము లోపల మనుష్యులు పక్షులు మృగములు సంచరించుటయే లేదు. ఆవట సమీపమందు పర్వతసమాన శరీరులగు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలయిన జంతుజాలములయొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దములను జేయుచుండెడివారు. అనేక కార్తీక వ్రతములాచరించిన ఆ తత్త్వనిష్ఠుడు దైవవశముచేత మార్గమున పోవుచు మర్రిచెట్టుమీదనున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను జూచెను. తత్త్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదారవిందములను స్మరించుచు దేవేశా౧ నన్ను రక్షించుము. లోకేశా!నారాయణా!అవ్యయా!నామొర ఆలకించుము. సమస్త భయముల నశింపజేయు దేవా! నాభయమును పోగొట్టుము. నాకు నీవే దిక్కు. నీవు తప్ప నన్ను రక్షింపసమర్థులెవ్వరును లేరు. ఈప్రకారము హరిని గూర్చి మొరబెట్టుచు వారి భయమున పరుగెత్తుచున్న బ్రాహ్మణుని జూచి బ్రహ్మ రాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతనివెంబడి పరుగెత్తసాగిరి. ఇట్లు కొంతదూరము పోగానే వెనుకకు తిరిగిన ఆబ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మ రాక్షసులకు జాతి స్మృతిగలిగినది.

ఓరాజా! తరువాత వారు ఆ బ్రహ్మణునిముందు భూమియందు దండప్రణామములాచరించి అంజలిపట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లనిస్తుతించిరి. బ్రాహ్మణోత్తమా! మీదర్శనమువలన మేము పాపరహితులమైతిమి. మీరాక మాకు ఉపకారము కొరకయినది. అది న్యాయమే, మహాత్ములు జీవించుట యాత్ర చేయుట లోకమును ఉద్ధరించుటకొరకే ఉపకారము కొరకే అగునుగదా. బ్రాహ్మణుడీమాటలను విని భయమును వదలి మంచి మనస్సుతో ఇట్లనియెను. మీరెవ్వరు. ఏకర్మచేత మీకిట్టి వికృతరూపములు గలిగినవి. లోకనిందితమైన ఏకర్మను మీరు పూర్వమందు చేసినారు. భయమును వదలి సర్వమును నాకు జెప్పుడు. తరువాత రాక్షులు తాము చేసిన నింద్య కర్మలను వేరువేరుగా తలంచుకొని ఆబ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పల్కెను. అయ్యా నేను పూర్వజన్మమందు ద్రావిడదేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని. బ్రాహ్మణులలో నీచుడను. కఠినముగా మాటలాడువాడను. ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నాకుటుంబలాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడయినను అన్నమును బెట్టియెరుగను. బ్రాహ్మణులసొమ్ము స్నేహముచేత హరించుటచేత ఏడుతరములు కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనమపహరించిన యెడల సూర్యచంద్ర నక్షత్రములుండువరకు కుటుంబము నశించును. తరువాత మృతినొంది యమ బాధలను అనేకములనొందితిని. ఆదోషము చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడనై జన్మించితిని. కనుక బ్రాహ్మణోత్తమా! ఈ దోషము నశించు ఉపాయమును విచారించి క్చెప్పుము. అందులో రెండవవాడిట్లు చెప్పెను. అయ్యా నేను ఆంధ్రదేశమందుండువాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండువాడను. ఇదిగాక నేనును, నా భార్యాపిల్లలును, షడ్రసోపేతమైన అన్నమును భుజించుచు నాతల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండువాడను, బంధువులకుగాని, బ్రాహ్మణులకుగాని, ఒకనాడయినను అన్నమును పెట్టినవాడనుకాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించియుంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు యెనిమిదియుగముల వకు యమబాధలనుబొంది బ్రహ్మరాక్షసుడనై భూమియందు జన్మించితిని. ఓబ్రాహ్మణోత్తమా! నాకీపాపము తొలగు ఉపాయము జెప్పి నన్ను ఉద్ధరింపుము. తరువాత మూడవవాడు నమస్కరించి తనస్థితిని ఇట్లు చెప్పెను. అయ్యా! నేను ఆంధ్రదేశ నివాసిని. బ్రాహ్మణుడను. విష్ణ్వాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదలి పరనిందలను జేయుచు విశేషముగా మాటలాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెను అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆనేతిని వేశ్యకు యిచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి క్దానితో సంభోగించుచుండువాడను. ఆ దోషముచేత నరకములందు అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మ రాక్షసుడనై బుట్టి ఈ మర్రిమీద ఉంటిని కనుక సమస్త భూతదయాపరా బ్రాహ్మణోత్తమా! నన్ను రక్షించుపు. నాకీ బ్రహ్మరాక్షస జన్మమును నశింపజేయుము.

తత్త్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యమునొంది మీకు కొంచెమైనను భయములేదు. మీదుఃఖము పోగొట్టెను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను. నాతో మీరుకూడా రండి అని వారిని తీసుకొనిపోయి కావేరి నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే గూడ స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసెను. "అముకానాం బ్రహ్మరాక్షసత్త్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్స్నానమహం కరిష్యే" ఇట్లు సంకల్పము చేసి ఆబ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆముగ్గురు దోషవిముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠలోకమునకు బోయిరి. ఓ జనకమహారాజా! వినుము. మోహము చేతగాని, అజ్ఞానముచేత గాని కార్తీకమాసంబున శుక్ర నక్షత్రముదయించినప్పుడు (తెల్లవారుఝామున) సూర్యోదయకాలమందు కావేరీనది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణుపూజను జేసిన వానికి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీకమాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నామును తప్పక చేయవలయును. కార్తీకమాసమందు దామోదరప్రీతిగా ప్రాతస్స్నానముజేయని వాడు పదిజన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీగాని, పురుషుడుగాని కార్తీకమాసమందు ప్రాతస్స్నానము తప్పక చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయపనిలేదు.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే తృతీయోధ్యాయస్సమాప్తః
హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం
జై శ్రీమన్నారాయణ
హర హర మహాదేవ శంభో శంకర
గమనిక: శక్తి ఉన్న వారు ఈరోజు చంద్రశేఖర అష్టకం 8మార్లు పారాయణ చేయగలరం 
సేకరణ :ముత్యాల మురళీ కృష్ణ

కార్తీకపురాణం 2 అధ్యాయం

💥కార్తీక పురాణం ప్రారంభం

🌹సోమవార వ్రత మహిమ*

వశిష్టుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు ”జనకా! ఇంతవరకు నీకు కార్తీక మాసములో చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే… కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబతాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.
”కార్తిక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడుగాని ఏజాతి వారైనా గాని రోజంతా ఉపవాసముండాలి. నదీస్నానం చేసి, తమ శక్తికొద్దీ దానధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి, సాయంత్రం నక్షత్రదర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉంటూ… ఆ రాత్రంతా జాగరణ చేసి, పురాణ పఠనం చేయాలి. ఉదయం నదీస్నానమాచరించాలి. నువ్వులను దానం చేయాలి (తిలాదానం). తమ శక్తికొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత,
తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి, సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాదికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే… కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసముంది. దాన్ని మీకు తెలియజేస్తాను. సావధానంగా విను” అని ఇలా చెప్పసాగాడు.
కుక్క కైలాసానికి వెళ్లుట…
”పూర్వ కాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృతిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర నిష్టురి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్హణుడికి ఇచ్చి పెళ్లి చేశాడుఏ. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు, శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని ‘అపర బ్రహ్మ’ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో, కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తమామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుషసాంగత్యంతో వ్యభిచారిణియై… తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు, ధరించి దుష్టురాలై తిరుగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా… ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కలవారంతా ఆమెను గయ్యాళి అని ఏవగించుకుంటూ… కర్కశ అని పేరుపెట్టి ఎగతాళి చేసేవారు.
ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా… ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి, పైన చెత్తచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురులేదని, అడ్డూఅదుపు ఉండదనే అహంకారం పెరిగి… ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి, నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలైంది. అంతటితో ఆగకుండా… కన్యలు, పెళ్లైన మహిళలకు దుర్బుద్దులు నేర్పి, పాడుచేసి, విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది.
ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడసాగింది. చేసినపాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము, రక్తం కారుతూ, క్రమంగా కుష్టువ్యాధిబారిన పడింది. రోజురోజుకూ ఆమె శరీర పటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమెకోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామెవైపు కన్నెత్తికూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి, పురుగులు పడి చనిపోయింది.
బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరవు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుపస్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనపగదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణిలుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో, చెవిలో పోశారు. ఇనపకడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కంఉబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకత్తే కాకుండా, ఇటు ఏడు తరాలు, అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచజన్మలు ఎత్తుతూ, క్రిమికీటకాలుగా పుట్టి.. చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది.
కుక్కజన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికీ తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే.. తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే… ఒక బ్రాహ్మడు కార్తీక సోమవార వ్రతమాచరించి, ఉపవాసముండి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి, ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి, కాళ్లూచేతులు కడుక్కునేందుకు వెళ్లాడు. అయితే… ఆ కుక్క గబగబా వెళ్లి ఆ ఆహారాన్ని భుజించింది.
వ్రత నిష్ఠ గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపెంచిన బలియన్నం కావడం… కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసముండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క ‘విప్రోత్తమా… నన్ను కాపాడుము’ అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. ‘రక్షించు… రక్షించు…’ అనే కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ‘ఎవరు నీవు? నీ వృత్తాతమేమిటి?’ అని ప్రశ్నించాడు. అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. పదిహేను జన్మల క్రింద సద్భ్రాహ్మణుడి భార్యయైన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్టువ్యాధితో దినదినగండంగా బతికి, చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ‘ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి, ఇక్కడ పెట్టిన బలిఅన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా…! నాకు మహోపకరాంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి, నాకు మోక్షం కలిగించు’ అని ప్రార్థించింది.
దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలాచేసిన వెంటనే… ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క తన జన్మను చాలింది, సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుంచి శివసాన్నిథ్యాన్ని చేరుకుంది.”
*ఇతి శ్రీ సాంద పురాణే తర్గత, వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్తం.*

   🪔 ఓం నమః శివాయ 🪔

    🌹సర్వేజనా సుఖినోభవంతు🌹 
సేకరణ : ముత్యాల మురళీకృష్ణ

భారతదేశం లోని మొట్టమొదట శివాలయం

గుడిమల్లం, చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామము.చారిత్రకంగా ప్రాముఖ్యమైనది. ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. ఈ ఆలయమునకు సంబంధించిన మరికొంత సమాచారము చంద్రగిరి కోటలో గల మ్యూజియంలో లభ్యమవుతున్నది.

దేవాలయ చరిత్ర:
ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచ్ఛస్థితిలో నిలిపారు. తదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు పాడు చేసారు. కాకుంటే మూలవిరాట్ స్వామికి మాత్రం హాని కలగలేదు.

గుడిమల్లం శివలింగ విశిష్టత:
గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది.ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము మరియు ముఖమండపముల కన్నా లోతులో ఉంటుంది . ఇక్కడ గర్భగృహములో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు. ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన (స్థానకమూర్తి) రూపంలో ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు. కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యొక్క కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప) ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రము) ధరించి ఉన్నాడు. ఆ వస్త్రము మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తున్నాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్రభాగము మరియు క్రింది పొడవైన స్తంభభాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము, పురుషాంగమును పోలి ఉంది. ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది.

గుడిమల్లం 2009 వరకు వురావస్థు శాఖ వారి ఆధీనంలో ఉంది. పూజా పునస్కారాలు ఏవీ జరగలేదు. కనుక ప్రజలు ఎక్కువగా రాలేదు. పురావస్తు శాఖ వారి ఉద్యోగి ఒకరు దానికి సంరక్షకుడిగా వుండి అరుదుగా వచ్చే సందర్శకులకు చూపిస్తూ ఉంటారు. గుడిమల్లం చిన్న పల్లెటూరు. తిరుపతికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని పరశురామేశ్వారాలయం అని కూడా అంటారు. అంత దూరం వెళ్ళి చూడ లేని వారికి ఈ ఆలయంలోని మూల విరాట్టును అన్ని విధాల పోలిన ప్రతి రూపాన్ని చంద్రగిరి కోటలోని ప్రదర్శన శాలలో ప్రదర్శనకు పెట్టారు. అక్కడ దీన్ని చూడవచ్చు.

ఇది క్రీస్తుపూర్వం 1వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులంటున్నారు. 1911లో గోపీనాధరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల ఈ శివ లింగం పై ఒక చేత్తో పశువును, మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా, దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ రుగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవపూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భగుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది.

ఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయట పడ్డాయి. చోళ, పల్లవ, గంగపల్లవ, రాయల కాలంలో నిత్యం ధూప, దీప, నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. చాలా విగ్రహాలు చోరికి గురయ్యాయి. ఆర్కియాలజీ వెబ్‌సైట్‌లో ఇంత ప్రముఖమైన శివలింగం గురించి కనీస సమాచారం లేదు. గుడి చుట్టూ పచ్చిక పెంచడం మినహా ఆ శాఖ సాధించిన మార్పు ఏమీ లేదు.

ఏ ఎస్‌ ఐ ధర్మాన కనీసం పూజలు కూడా చేసుకోలేక పోతున్నామని……వాపోతున్న గుడిమల్ల గ్రామస్తుల్లో ఒకరైన వున్నం గుణశేఖర నాయుడు 2006 నుండీ 2008 వరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆర్కియాలిజీతో సమాచార చట్టం ఆయుధంగా యుద్ధం చేసి వారిని కేంద్ర సమాచార చట్టం ముందు నిలబెట్టాడు.ఈ గుడికి సంబంధించిన ఆస్తుల వివరాలు అటుంచితే కనీసం గుడికి సంబంధించిన సాహిత్యం కూడా వారి దగ్గర లేదనే నగ్నసత్యం బయట పడింది. ఈ క్రమంలో గుణశేఖర నాయుడు చేసిన కృషి ఫలితంగా 2009లో గుడిలో పూజలు జరిపేందుకు గ్రామస్తులకు అనుమతి సాధించాడు.

గతంలో ఎపుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఉంది. ఇక ఇంగువ కార్తికేయ శర్మ రాసిన ‘పరమేశ్వర టెంపుల్‌ ఎట్‌ గుడిమల్లం’ ‘డెవలప్‌ మెంట్‌ ఆఫ్‌ ఎర్లీ శైవ ఆర్ట్‌ అండ్‌ అర్కిటెక్చర్‌ ‘ అనే రెండు పుస్తకాలు, మరి కొన్ని శిల్ప, కళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారం లేదు. ఇపుడిపుడే ఈ ఆలయం మార్కెట్‌ దేముడి మాయలో పడబోతుంది. కోట్లరూపాయల హెరిటేజ్‌ ప్రాజెక్టులో ఇదీ భాగం అయింది. అంబికా సోనీ ఇటీవలే ఇక్కడ అంగపూజలు జరిపారు. ఒక ఎంపీ ఇక్కడ గెస్ట్‌హౌస్‌ కట్టే ప్లాన్‌లో ఉన్నారు.

ఉజ్జయినిలో లభించిన కొన్ని రాగినాణాలపై ఈ లింగమును పోలిన బొమ్మలు ఉన్నాయి. ఈ నాణాలు క్రీ.పూ. 3వ శతాబ్ధానికి చెందినవిగా గుర్తించబడ్డాయి.

మరొక పురాణ కధ:
పురాణాలలోని కథ తన తండ్రి ప్రోద్బలంతో అతని తల్లి శిరఛ్చేదం పరశురాముడు చెబుతుంది. ఆవేదన నుంచి కోలుకోవడానికి గాను ఋషులు ఒక శివ లింగం వెతికి దానికి పూజించవలసిందిగా సూచిస్తారు. చాలాసార్లు శోధించిన తరువాత, పరశురాముడు ఈఅడవి మధ్యలో ఒక లింగాన్ని గుర్తించి అటుపై ఆలయ సమీపంలోని ఒక చెరువు తవ్వి పూజించుచుండెను.

ప్రతి రోజు ఆచెరువు ఒక దైవిక పుష్పం పెరుగుతూ ఉండగా, దానితో ఆతను శివునికి పూజిస్తూ ఉండేవాడు. ఆ పువ్వును అడవి జంతువుల నుండి కాపాడటం కొరకు ఆతను ఒక యక్షుడుని (చిత్రసేనుడు) కాపలాగా ఉంచుతాడు. అందుకు గాను పరశురాముడు రోజూ ఆతనికి ఒక జీవి, ఆటబొమ్మలను తీసుకొని ఇచ్చేవాడు.ఒకమారు పరశురాముడు లేని సమయంలో చిత్రసేనుడు (బ్రహ్మ భక్తుడు) ఆ పుష్పంతో శివునికి పూజ చేస్తాడు. పరశురాముడు వచ్చేసరికి పుష్పం లేకపోవడం చూచి కోపోధ్రిక్తుడై చిత్రసేనుడు మీద దెండెత్తుతాడు. ఆ యుద్ధం 14 సంవత్సరాల పాటు కొనసాగింది, అందువల్ల ఆప్రదేశం ఒక పెద్ద గొయ్య, లేదా పల్లం లా తయారి అయింది. అందుకే ఈ ప్రదేశానికి గుడిపల్లం అని పేరు వచ్చింది అందురు.

ఆయుద్ధం ఎంతకీ ముగియక పోవడంతో పరమశివుడు వారిరువురికి ప్రత్యక్ష్యమై వారిరువురిని శాంతపరిచి, వారి భక్తికి మెచ్చి తాను రెండుగా విచ్చిన్నమై వారిలో ఏకమవుతాడు. అందుకు గాని ఇక్కడి లింగము ఒక ఆకారము పరశురాముడు (విష్ణు రూపం) ఒక చేతిలో వేటాడిన మృగముతోటి, రెండవచేతిలో ఒక కల్లుకుండ ఉండినట్లు, మరియు చిత్రసేనుడు (బ్రహ్మ) ముఖముతో, శివడు లింగ రూపముతో మలచబడెనని ఒక కధ ప్రాచుర్యంలో కలదు.

ఈఆలయానికి సమబంధించి మరియొక రహస్యమైన సన్నివేశం ప్రాచుర్యంలో కలదు. అది ఈ ప్రధాన గదిలో ప్రతి అరవై సంవత్సరాలకు వరదలు వచ్చి లోపలభాగం మొత్తం నీటి వరదతో మునుగి పోతుంది.. ఒక చిన్న భూగర్భ తొట్టి మరియు దానిని కలుపబడి ఒక వాహిక శివలింగం ప్రక్కన నేటికీ కూడా చూడవచ్చు. ఈ వరద నీరు అకస్మాత్తుగా, శివలింగం పైభాగానికి తాకి అటుపై ఒక్కసారిగా క్రిందికి ప్రవహిస్తుంది. ఈ భూగర్భ ట్యాంక్ తరువాత ఎండి పోతుంది. ఇది డిసెంబరు 4, 2005 లో జరిగినట్లు ఆలయ సర్వే అటెండంతు పి.సీనప్ప ఆలయ జాబితా పుస్తకంలో వ్రాసినట్లు తెలుపబడినది. ఆ వరద నీదు అలానే ఒక 4 గంటలు ఉండి అటుపై మరల ఆలయంలో ఏమీ జరుగనట్లు అదృశ్యమైనదని వ్రాసినారు.రామయ్య అనే 75 ఏళ్ళ గ్రామస్థుడు దీనిని తాను 1945 సం.లో చూచినట్లు తెలిపినట్లు పలువురు వివరింతిరి.

ఆలయ మరో అధ్బుత ఉంది. పెరుగుతున్న సూర్యుని కిరణాలు ఉత్తరాయణము మరియు దక్షిణాయనము లో రెండుసార్లు ఈ రాతి గోడలపై చెక్కిన గ్రిల్ గుండా ప్రధాన శివలింగం యొక్క నుదిటి నేరుగా వస్తాయి.

మరికొన్ని ఆలయ విశేషాలు:
విశాలమైన ఈ దేవాలయ ప్రాంగణమున యెన్నియో చిన్న గుళ్ళున్నవి. అన్నింటిని చుట్టునూ, ఆవలి ఇటుక ప్రాకారగోడ, నలువైపుల కలదు.ఈ ప్రాకారమునకు పడమటివైపున పెద్ద గోపుర ద్వారము కలదు. ఈ గోపురద్వారము, మరియు స్వామివారి అభిషేకజలమునకూ కట్టిన బావి యాదవదేవరాయలు కాలమునకు (క్రీ.శ.13-14 శతాబ్దము) చెందినది.

ముఖ్య దేవాలయము- పరశురామేశ్వరస్వామి పేరున పలువబడుచున్నది. ఈ ఆలయమునకు వాయవ్య దిశన అమ్మవారి దేవాలయము ఉన్నది. దానిని ఆనుకొని దక్షిణమున వల్లీ-దేవసేనా సమేత కార్తికేయస్వామి గుడి కలదు. పై రెండును తూర్పు ద్వారమును కల్గిఉన్నవి. తూర్పు చివర ఆనుకొని సూర్యనారాయణుని దేవాలయము కలదు. ఈ చిన్ని ఆలయమును బహుసా మరికొన్ని శిధిలములై ఉండవచ్చును. మరికొన్ని పరివార దేవతల గుళ్ళు కలవు. ఇవన్నీ బాణ చోళరాజుల (క్రీ. శ. 9-12 శతాబ్దులు) కాలమున చెందినట్టివి.

ముఖ్య దేవాలయము గోడలపైని, రాతిపలకలపైని పెక్కు శాసనములు కలవు. ఇవి తరువాతి పల్లవులు, వారి సామంతులు గంగ పల్లవులు (క్రీ.శ. 897-905), బాణ చోళులు, చోళరాజు విక్రమచోళుడు, రాజరాజు కాలమునకు చెందినవి. యాదవ దేవరాయల కాలమునాటికి చెందిన మరికొన్ని శాసనములు కలవు.విక్రమ చోళుడు కాలమున (క్రీ.శ.1126) దేవాలమును పూర్తిగా తిరుగ కట్టినట్లు, రాతితో కట్టడములు చేసినట్లు తెలియుచున్నది. దేవాలయములో విశాలమైన మహామండపము గర్భగుడి ఆవలివైపు దాని ఆనుకొని ఎత్తైన రాతి ప్రాకారమును కలుపుచున్న అరుగు, నలుప్రక్కల ప్రదక్షిణమునకు వీలుగా స్తంభములపై శాల నిర్మింపబడెను.ఈ కాలమున మహామండపమునకు దక్షిణముగా ముఖద్వారము, దానికి నేరుగా ప్రాకారమును కూడా కుడ్యస్తంభములతో చక్కని ద్వారశాలను ఏర్పరచిరి.

గర్భగుడి మాత్రము గజపృష్ఠాకారము కలిగి ఉన్నది. అందున అర్ధ మండపము మహామండపములు కలవు.అన్నియు తూర్పు ముఖద్వారములు కలిగి ఉన్నవి. గర్భగుడి, అర్ధ-మహామండపముల కన్న, చాలా పల్లములో ఉన్నది. అందువల్లనే కాబోలు ఈ గ్రామనామము గుడిపల్లము అని వాడుకలో కలదు. శివుని ప్రతిమ, యవ్వనుడైన మల్లునిబోలి ఉన్నందున గ్రామనామము గుడిమల్లము అని ప్రతీతి. కాని శాసనములలో ఎక్కడా ఈనామము కానరాదు. ఈ గ్రామమును విప్రపీఠము గా పేర్కొనబడెను. గుడిపేరు పరశురామేశ్వరాలయము గా చెప్పబడినది. చిత్రమేన ఈ ఆలయము నెవ్వరు ప్రతిష్ఠించిరో, ఎప్పుడు జరిగినో శాసనములు తెలుపుటలేవు. శాసనములు స్వామి వారి నిత్య సేవల కొరకు దానములు తెలుపుచున్నవి. ఇటీవలి పరిశోధనల ఫలితముగా ఇది క్రీ.పూ 1-2 శతాబ్దము. సంబంధించిన లింగముగా భావింపవచ్చును.

ముఖ్య దేవాలయములోని మూలవిరాట్టు గుండ్రని రాతి పీఠములోని (యోని), లింగము (అడుగు భాగమున చతురస్రాకమైన స్తంభము) అమర్చబడెను. ఈ పీఠములు చాలా నునుపుగా లింగ మెంత సుందరముగా నున్నదో అట్లున్నవి.కాని రాయి వేరు- ఇసుకరాయి.ఈ యోని నిర్మాణము కేవలము స్త్రీ యోని నిర్మాణము బోలి యుండుట చాల చిత్రముగ ఉన్నది.పీఠము చుట్టును 1.35 మీటర్లు పొడవుతో నలుప్రక్కల చతురస్రాకారం నిర్మించబడెను.దీని చుట్టును స్తంభము శైలి, అమరావతి-మధురల స్తూపవేదిక స్తంభములను బోలియుండుట గమనార్హము. ఈ స్తంభ పలకములపైన వివిధ రీతుల పద్మములు, పూలు, చక్రములు మలచిఉన్నవి.ఈ కాలమున దేవాలయ కట్టడము లేదు.కేవలము లింగముపై ఆరుబయట పూజించబడునట్లు తెలియుచున్నది.ఈ లింగముపై, దానిపైన శివుని ప్రతిమ అతి ప్రాచీనమైన శైవపూజా విధానమును తెలుపుటయే కాక దక్షిణమున శైవ మత్యంత పురాతన మైనట్టిదని తెలియుచున్నది.ఉజ్జయినిలో లభించిన కొన్ని రాగినాణాలపై ఈ లింగమును పోలిన బొమ్మలు ఉన్నాయి. ఈ నాణాలు క్రీ.పూ. 3వ శతాబ్ధానికి చెందినవిగా గుర్తించబడ్డాయి. అట్లె మధుర మ్యూజియంలో క్రీ.పూ.1 వ శతాబ్దమునకు చెందిన శిల్పము ఈ లింగమును పోలియున్నది.ఇది చెట్టు క్రింద ఎత్తైన ఆరు బయట వేదికలోనుంచి, పూజించబడు లింగగముగా గోచరించును.

ఈ లింగము ఊర్ధ్వరేతయైన మానవుని లింగమెట్లుండునో అట్లు చెక్కబడినది. నరముల వెలే కనిపించును లింగమధ్యభాగము.శివుని రూపము, లింగ ముఖభాగమున, చాల చక్కని యవ్వనుడిగా చూపడం జరిగినది.స్వామి రెండు కన్నులు, నాసికాగ్రమును చూచుటనుబట్టి విరూపాక్షుడగను, యోగ లేక ధ్యాన పురుషుడగను చెప్పుకొనవచ్చును.యెడమ భుజమ నానుకొని పరశు ఉన్నది.చేతిలో కుండ, కుండ చేతిలో పొట్టేలు (మృగము-బహుశ చర్మమే కాబోలు), తల క్రిందులుగా పట్టుకొని ఉన్నాడు.ఇచ్చట శివుని భిక్షాటన్ మూర్తిగా పోల్చుకొనవచ్చును.చక్కని ధోవతి మేఖలతో బంధించి యున్నను పురుషుని లింగము వెలికి యున్నట్లు చూపబడియుండుట చిత్రముగా ఉన్నది.ఇతడిని మనము రుద్రుడుగా శిశ్నిన దేవుడుగా ఊహించుట సమ్ంజసము. ఋగ్వేద రుద్రుడుకి జంధ్యము లేదు. ఈ ప్రతిమలో యజ్ఞపవీతము కానరాదు. పైగా స్వామి చలమూర్తి. అపస్మార పురుషుని భుజ స్కంధములపై ఉన్నాడు కావున, లింగము వ్రేలాడు చున్నట్లు చాలా సాధారణముగా చూపబడెను. కానీ గమనించినచో, శివలింగ మంతయు తీసికొన్నచో ఊర్ధ్వ రేతమనే చెప్పక తప్పదు.శివుని తలపాగా చిత్రముగా ఉన్నది, పట్టబంధముతో నొసలు పైకిగా కట్టబడినది.లేతతాటి ఆకు అల్లి చుట్టినట్లున్నది. దీనిని బట్టి దక్షిణామూర్తిగానో లేక కపర్దిగనో ఉద్దేంశింపబడినాడు.

ఇట్టి సంయుక్త ప్రతిమయే తరువాత వివిధ రూపములలో ప్రత్యేకముగా శివుని చూపుటకు దోహదమై ఉండునని పలువురి అభిప్రాయము. యేల అనగా ఈ దేవాలయమును పూర్తిగా కట్టించి, పెద్దదిగా చేసిన తరువాత- పల్లవులు, చోళులు, బాణులు వివిధ రూపములలో శివుని ప్రతిమలను విడివిడిగా (దక్షిణామూర్తి, కంకాలమూర్తి, పశుపతమూర్తి, వీణాధారి, ఉమాసహితమూర్తి) దేవకోషములలో ఉంచిరి.

ఈ వేదిక లింగము చుట్టునుమ చేసిన త్రవ్వకములలో క్రీ.శ.2-3 శతాబ్దములకు చెందినట్టి, ఇటుకలతో కట్టిన అర్ధగోళాకారపు గుడి-గోడకూడా బయల్పడినది. దీనిని బట్టి క్రీ.శ.2-3 శతాబ్దములలో బహుశ శాతవాహనులు- ఇక్ష్వాకులు కాలమున ఈ లింగము చుట్టును దేవాలయము కట్టిఉండవచ్చును. ఈ ఆలయము శిధిలమగుటచే పల్లవులు- బాణ- చోళులు దీనిని రాతితో, అదే ఆకృతిలో విశాలముగా కట్టి, కొన్ని మార్పులు, కూర్పులు గావించిరి.అప్పటి వాస్తునుబట్టి లింగము చుట్టునున్న వేదికను, గుండ్రని యోని పీఠమును, పూడ్చి వేయటం జరిగినది.చతురస్రమైన చిన్న పీఠికను మాత్రము చేసి అభిషేకజలము పోవుటకు ప్రణాళిని గావించినారు..
ముత్యాల మురళి కృష్ణ  ---- సేకరణ
శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా.

Saturday, 14 November 2020

కార్తీకపురాణం - 1 వ అధ్యాయం


*కార్తీక మాసం మహత్యం*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️



ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… *”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను , వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత , కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..”* అని కోరారు.

శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… *”ఓ మునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు , పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో , పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి”* అని చెప్పసాగాడు.


పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో *”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి , మానవులంతా కులమత తారతమ్యం లేకుండా , వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి”* అని కోరింది.

అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు *”దేవీ ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….”* అని ఆ దిశగా చూపించాడు.

మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి , ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు *”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను , నా శరీరం , నా దేశం , ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి ?”* అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు *”జనక మహారాజ ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన , సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను”* అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.

దీనికి జనకుడు *”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ , ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ? ఈ నెల గొప్పదనమేమిటి ? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా ?”* అని ప్రార్థించారు.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి *”రాజ ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ , పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….”* అని చెప్పసాగాడు.


*కార్తీక వ్రతవిధానం*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*”ఓ జనక మహారాజా ! ఎవరైనా , ఏ వయసువారైనా పేద - ధనిక , తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి , కాలకృత్యాలు తీర్చుకుని , స్నానమాచరించి , దానధర్మాలు , దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన , శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి”* అని వివరించారు.

వ్రతవిధానం గురించి చెబుతూ… *”ఓ రాజా ! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి , కాలకృత్యాలు తీర్చుకుని , నదికిపోయి , స్నానమాచరించి గంగకు , శ్రీమన్నారయణ , పరమేశ్వరులకు , బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి , సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి , పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా , గోదావరి , కృష్ణ , కావేరీ , తుంగభద్ర , యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని , శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి , నిత్యధూప , దీప , నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి. గంధము తీసి , భగవంతునికి సమర్పించి , తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి , వారికి ప్రసాదం పెట్టి , తన ఇంటివద్దగానీ , దేవాలయంలోగానీ , రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి , శివాలయంలోగానీ , విష్ణు ఆలయంలోగానీ , తులసికోట వద్దగానీ , దీపారాధన చేసి , శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి , స్వామికి నివేదించాలి. అందరికీ పంచి , తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు , మగవారు గతంలో , గతజన్మలో చేసిన పాపాలు , ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు , వీలు పడనివారు వ్రతాన్ని చూసినా , వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.


*ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం సేకరణ : ముత్యాల మురళి కృష్ణ గారు