Tuesday, 26 May 2020

లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ ?



లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ ?
గొప్ప సంగీత విద్వాంసుడు, మధురమైన గానంతో కౌశికుడు అనే విష్ణుభక్తుడు తన భక్తి, గానమాధుర్యంతో విష్ణువుని మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. కౌశికుడు మరణించిన తరువాత వైకుంఠం చేరుకున్నాడు. మహావిష్ణువు కౌశికుడిని తన అంతరంగిక సంగీత సభను ఏర్పాటు చేశాడు. త్రిలోకసంచారి నారదునికి ఆ సభలోకి ప్రవేశించడానికి అనుమతి లభించలేదు.

తుంబురుడికి స్వాగత సత్కార్యాలు లభించడం చూసిన నారదుడు తన శత్రువైన తుంబురుడికి లభించిన స్థానం తనకు ఎందుకు దక్కలేదని మండిపడుతూ లక్ష్మీదేవి మందిరంలో నుండి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కానీ లక్ష్మీదేవి చెలికత్తెలు నారదుణ్ణి లోనికి అనుమతించలేదు. కోపగించిన నారదుడు లక్ష్మీదేవిని శపించాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి, మహావిష్ణువు నారదుడి ఎదుట ప్రత్యక్షమై తన పొరపాటును మన్నించమని వేడుకున్నారు. దాంతో నారదుడు శాంతించాడు.

నారదుడు చల్లబడడం చూసిన మహావిష్ణువు నారదునితో ఇలా అన్నాడు … నారదా నీకోపానికి కారణం నాకు తెలుసు. నిజానికి భక్తిజ్ఞానంలో, శీలవర్తనలో తుంబురుడు నీకన్నా గర్విష్టి కాదు. కపట భక్తిని ప్రదర్శించేవారు ఎన్ని తీర్థాలు సేవించినా అవి వ్యర్థం అవుతాయి. భక్తిశ్రద్ధలతో నన్ను కొలిచేవారికి నేను ఎప్పుడూ దాసుడనే. సంగీతంతో నన్ను చేరవచ్చు అనే సత్యాన్ని చాటిచెప్పడానికే నేను తుంబురుడిని, కౌశికులను సత్కరించాను. నీవు ఇచ్చిన శాపం లోకానికి మేలే జరుగుతుంది అని చెప్పాడు.

దీంతో జ్ఞానోదయమైన నారదుడు … ఓ దేవా నా తప్పులను క్షమించు. అవివేకుడిలా ప్రవర్తించాను. నన్ను కాపాడు. తుంబర, కౌశికుల సంగీత పరిజ్ఞానం నాలో లేదు అందుకే ఇంతకీ విపరీతం జరిగి ఉండేది కాదు అంటూ తీవ్ర దుఃఖభారంతో కన్నీళ్లు కారుతుండగా నారదుడు మహావిష్ణువు పాదాలపై పడ్డాడు.

విష్ణువు నారదుణ్ణి పైకి లేపి ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలనే సంకల్పం నిజంగా నీకు ఉంటే నేను చెప్పినట్లు చేయి. ఉత్తరాన మానస సరొవరానికి అవతలివైపు ఒక పర్వత శిఖరం ఉంది. దానిమీద ఒక ఉలూకపతి ఉన్నాడు. అతనికి శుశ్రుష చేసి సంగీతంలో మేటివి అవమని దీవించాడు. మహావిష్ణువుకి కృతజ్ఞతలు తెలిపి మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు నారదుడు.

అక్కడికి చేరుకున్న నారదుడికి కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపించింది. గాలిలో తెరలు తెరలుగా వస్తున్న ఆ గానమాదుర్యాన్ని అనుసరించి అవతల ఉన్న శిఖరాన్ని చేరుకున్నాడు. అక్కడ గాంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరసలు ఎందఱో సంగీత అభ్యాసం చేస్తూ కనిపించారు. వారి మధ్యలో దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న ‘గానబంధు’ నారదుణ్ణి చూసి ఎదురేగి ఆదరంగా ఆహ్వానించి ఆసనం చూపించి కుశలప్రశ్నలు వేశాడు. వచ్చిన కారణం ఏమిటని అడిగాడు.

నారదుడు ‘గానబందు’ వినయానికి, సంగీత పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయి తనకు తెలియని ఈ సంగీత సామ్రాట్టు ఎవరు అని ఆలోచించసాగాడు. అతను ఎవరైతే తనకెందుకు తనకు కావలసింది సంగీత విద్య. నారదుడు ఉలూకపతికి నమస్కరించి తానూ వచ్చిన కారణం తెలుపుతూ తుంబుర, కౌశికులు తమ గానమాధుర్యంతో విష్ణువుని ప్రసన్నం చేసుకున్నారని తనకు కూడా అలాంటి దివ్యగాన విద్యని ప్రసాదించమని వేడుకున్నాడు. నారదుడి ఆంతర్యం కనిపెట్టిన గానబంధు ముందుగా తానూ ఎవరో వివరించసాగాడు.

పూర్వకాలంలో ధర్మవర్తనుడు, జాలిగుండెగల భువనేశుడనే రాజు ఉండేవాడు. అతను సంప్రదాయాలను అనుసరించి ధర్మకార్యాలు అన్నీ క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉండేవాడు. అటువంటి ఉత్తమపాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. తన రాజ్యంలో ఎవరైనా గానం ఆలపిస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు ఆజ్ఞ ఇచ్చాడు. భగవంతుణ్ణి కూడా భక్తీ గీతాలతో స్తుతించకూడదని చాటింపు వేయించాడు.

ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజు ఆజ్ఞను విస్మరించి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గానమాదుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదు అన్న విషయాన్ని మరచిపోయారు. వెంటనే రాజభటులు వచ్చి హరిమిత్రున్ని తీసుకువెళ్ళి రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచనలో పడ్డాడు. గానం ఆలపించినవాడు బ్రాహ్మణుడు. అతన్ని చంపితే బ్రాహ్మహత్యా దోషం కలుగుతుంది, అందుకే హరిమిత్రుని సంపదను స్వాధీనం చేసుకుని, మరణశిక్షకు సమానమైన దేశబహిష్కరణ శిక్షను విధించాడు.

కొంతకాలానికి రాజు మరణించాడు. మానవుడిగా మరణించిన రాజు మరుసటి జన్మలో గుడ్లగూబగా జన్మించాడు. గుడ్లగూబ రాత్రిళ్ళు మాత్రమే ఆహారాన్ని సంపాదించుకోవాలి. అందుకు తిండి ఒక సమస్యగా తయారయింది గుడ్లగూబకు. గతజన్మ దోషఫలితం వల్ల ఒకసారి నాలుగు రోజులు అయినా ఆహారం లభించలేదు. ఆకలితో అలమటిస్తూ ఆఖరికి మరణాన్ని ఆహ్వానించాడు. గుడ్లగూబగా జన్మించిన రాజు గతజన్మలో తాను చేసిన కొన్ని పుణ్యకార్యాలవల్ల యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు.

యమున్ని చూసి … యమధర్మరాజా ఎందుకు ఈ విధంగా నన్ను బాధపెడుతున్నావు. నేను గతజన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదాక్షిణ్యాలు చూపించాలో అంతవరకూ చూపించాను. నీవు ఎందుకు నాపై దయ చూపావు అన్నాడు. భువనేశుడి స్థితికి జాలిపడ్డాడు యమధర్మరాజు. తాము చేసిన తప్పు తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు, తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది అని ఆలోచించిన యమధర్మరాజు భువనేశుడికి అతను చేసిన తప్పు ఏమిటో చెప్పాడు …

గానబంధు! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే. కానీ పరమాత్ముణ్ణి వేదమంత్రాలతో మాత్రమె స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమపావనమైన సన్తేఎతమ్తొ హరికీర్తన చేసిన హరిమిత్రున్ని శిక్షించిన పాపం ఏమైనా తక్కువా. ఆ పాప ఫలితం కొండంత అయి నీకు లభించిన పుణ్యఫలాన్ని మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టిపీడిస్తుంది. విష్ణుభక్తులకు చేసిన చేసిన కీడు నీకు ఈ అవస్థ తెచ్చిపెట్టింది. దీనినుండి బయటపడటం ఎవరికీ సాధ్యం కాదు.

యమధర్మరాజు చెప్పింది విన్నాక గాని గుడ్లగూబకు తానూ చేసిన తప్పు ఏమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుణ్ణి స్తుతించవచ్చు అన్న జ్ఞానం కలిగి తానూ చేసిన తప్పును క్షమించి ఈ సంకటం నుండి ఎలాగైనా బయటపడే మార్గాన్ని చూపించమని యమధర్మరాజు పాదాలపై పడి వేడుకున్నాడు.

యమధర్మరాజు హృదయం ద్రవించి … ఉలూకరాజా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పాడు. ఈ పాపానికి మించిన శిక్ష అనుభవించినట్లయితే శిక్ష కాస్తంత తగ్గుతుంది. నీవు అంగీకరిస్తే అక్కడ నున్న గుహలోకి వెళ్ళు. అందులో నీ గతజన్మ దేహం ఉంది. అందులోనుండి రోజూ కొంత మాంసాన్ని చీల్చుకుని భుజించు. అది పూర్తి అయిన అనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి అంతర్థానం అయ్యాడు.

ఈ వివరాలు నారదుడికి చెప్పిన గుడ్లగూబ ఓ మహర్షీ ఆ దురదృష్టవంతుడిని నేనే. ఆ తరువాత నేను ఒకరోజు నా శవం దగ్గర కూర్చుని ఉండగా, దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో వెళ్తూ నా ముందు ఉన్న శవాన్ని చూసి రథాన్ని ఆపి దగ్గరకి వచ్చి చూసి ఇది భువనేశుని శవంలా ఉంది. ఇక్కడెందుకు పడి ఉంది? దీన్ని ఈ పక్షి తినడం ఏమిటి? అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు.

అప్పటికి నేను ఆ బ్రాహ్మణుడిని గుర్తించాను. అతను నా చేత దేశబహిష్కరణకు గురైన హరిమిత్రుడు. వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను. తప్పును క్షమించమని వేడుకున్నాను. దుఃఖ అశ్రువులు నేలపై పడుతుండగా యమధర్మరాజు తెలిపిన విషయం అంతా హరిమిత్రుడికి వివరించాను, హరిమిత్రుడు అది విని చలించిపోయి తన అంతరంగం భావాలకు అనుగుణంగా ఇలా పలికాడు …

నీ బాధలు చూస్తుంటే నాకు ఎంతో విచారం కలుగుతుంది. నీవు నాపట్ల చూపిన కాఠిన్యాన్ని నేను ఆరోజే మరచిపోయాను. నీవు అనుభవించిన బాధలు ఇక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అనేది లేకుండుగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువుగాక అంటూ హరిమిత్రుడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి చేరుకున్నాడు. అతని దీవెనలు ఫలించి నేను ఇలా ఉన్నాను అంటూ గానబందు తన కథను వివరించాడు.

ఆపై నారదుడు గానబందు విద్వాంసుని శిష్యుడు అయ్యాడు. తొలిరోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతోగాని, తామసంతో కాని సంగీతం పట్టుబడదు అని చెప్పాడు. కళ కోసం జీవితాన్నే అర్పించాలి అని అన్నాడు. కష్టపడి నిరంతరం సాధనచేస్తే ఎవరైనా అపురూపమయిన ఈ కలలో ఆధిక్యం సాధించవచ్చు అన్నాడు. నారదుడు గానబంధుపై గౌరవభావం మోహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తలవంచుకుని విన్నాడు.

వెయ్యేళ్ళు సంగీత సాధనలో గడిచిపోయాయి. కఠోరదీక్షతో నారదుడు 3,60,006 రాగాలలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. సహచరులు పొగుడుతూ ఉంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదని అనే గర్వంతో ఉబ్బిపోయాడు నారదుడు. అమితానందంతో గురువైన గుడ్లగూబను చేరుకొని కృతజ్ఞతలు తెలుపుతూ గురుదక్షిణ చేల్లిస్తాను. ఏం కావాలో సెలవివ్వమన్నాడు. ఎలాంటి కోరికనైనా సంశయం లేకుండా అడగమన్నాడు.

శిష్యుడి మాటలు విన్న గురువు సంతోషంతో ఓ మహర్షీ! దేవరుషులు అయిన మిమ్మల్ని నేను ఏమి కోరిక కోరగలను. గుడ్లగూబకు కావలసిన అవసరాలు ఏమి ఉంటాయి? నీవు శిష్యుడివి కాబాట్టి ఏదో ఒకటి కోరుకోక తప్పాడు. ఈ భూమి నిలిచి ఉన్నంతకాలం సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండిపోయేలా వరం ప్రసాదించు అని మనసులోని మాట బయట పెట్టడు.

నారదుడు నవ్వి గురువర్యా! ఇది మరీ చిన్న కోరిక … ఈ చిన్ని కోరిక మీకు ఉన్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్యకోటి వలన భూతలంలో సంగీతకళ నిలిచి ఉన్నంత వరకు మీ కీర్తికి భంగం కలగదు. మీరు చేసిన ఈ మహోపకార్యానికి గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షం, వారి సేవాభాగ్యాన్ని, శాశ్వత సన్నిధానాన్ని ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీమహావిష్ణువుకి గరుత్మంతునిలా శ్రీమహాలక్ష్మీదేవికి నీవు వాహనమై తరించుగాక అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరాన్ని సమర్పించి గుడ్లగూబ దగ్గర సెలవు తీసుకుని స్వర్గలోకానికి చేరుకున్నాడు. ఈ విధంగా గానబందు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం అయింది.

Sunday, 24 May 2020

రామాయణం


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
= వాల్మీకి.

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
= నారదుడు.

3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
= తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
=24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
=కుశలవులు.

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
=సరయూ నది.

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
=కోసల రాజ్యం.

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
=సుమంత్రుడు.

9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
=కౌసల్య, సుమిత్ర, కైకేయి.

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
=పుత్రకామేష్ఠి.

11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
= కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కైకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వానరుడెవరు?
=జాంబవంతుడు.

13. వాలి ఎవరి అంశతో జన్మించెను?
= దేవేంద్రుడు.

14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
=హనుమంతుడు.

15. కౌసల్య కుమారుని పేరేమిటి?
=శ్రీరాముడు.

16. భరతుని తల్లి పేరేమిటి?
=కైకేయి.

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
=లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
=వసిష్ఠుడు.

19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
=12 సంవత్సరములు.

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
=మారీచ, సుబాహులు.

21.  రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
=బల-అతిబల.

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
=సిద్ధాశ్రమం.

23. తాటక భర్త పేరేమిటి?
=సుందుడు.

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
=అగస్త్యుడు.

25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
=భగీరథుడు.

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
=జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

27. అహల్య భర్త ఎవరు?
=గౌతమ మహర్షి.

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
=శతానందుడు.

29. సీత ఎవరికి జన్మించెను?
=నాగటి చాలున జనకునికి దొరికెను.

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
=దేవరాతుడు.

31. శివధనుస్సును తయారు చేసినదెవరు?
=విశ్వకర్మ.

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
=మాండవి, శృతకీర్తి.

33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
=జనకుడు.

34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
=కుశధ్వజుడు.

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
=వైష్ణవ ధనుస్సు.

36. భరతుని మేనమామ పేరు ఏమిటి?
=యధాజిత్తు.

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
=మంధర.

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
=గిరివ్రజపురం, మేనమామ యింట.

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
=శృంగిబేరపురం.

40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
=గారచెట్టు.

41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
=భారద్వాజ ముని.

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
=మాల్యవతీ.

43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
=తైలద్రోణములో.

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
=జాబాలి.

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
=నందిగ్రామము.

46. అత్రిమహాముని భార్య ఎవరు?
=అనసూయ.

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
=విరాధుడు.

48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
=అగస్త్యుడు.

49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
=గోదావరి.

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
=శూర్ఫణఖ.

51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
=జనస్థానము.

52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
=మారీచుడు.

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
=బంగారులేడి.

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
=జటాయువు.

55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
=దక్షిణపు దిక్కు.

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
=కబంధుని.

57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
=మతంగ వనం, పంపానదీ.

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
=ఋష్యమూక పర్వతం.

59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
=హనుమంతుడు.

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
=అగ్ని సాక్షిగా.

61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
=కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.

62. సుగ్రీవుని భార్య పేరు?
=రుమ.

63. వాలి భార్యపేరు?
=తార.

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
=కిష్కింధ.

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
=మాయావి.

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
=దుందుభి.

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
=మతంగముని.

68. వాలి కుమారుని పేరేమిటి?
=అంగదుడు.

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
=ఏడు.

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
=ప్రసవణగిరి.

71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=వినతుడు.

72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=అంగదుడు.

73. సుగ్రీవునికి,  సీతాన్వేషణ కోసం *పశ్చిమ* దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
=మామగారు, తార తండ్రి.

74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
=శతబలుడు.

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను? 
=మాసం (ఒక నెల).

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
=దక్షిణ దిక్కు.

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
=తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
=స్వయంప్రభ.

79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
=సంపాతి.

80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
=పుంజికస్థల.

81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
=మహేంద్రపర్వతము.

82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
=మైనాకుడు.

83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
=సురస.

84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
=సింహిక.

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
=నూరు యోజనములు.

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
=లంబ పర్వతం.

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
=అశోక వనం.

88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
=రెండు.

89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
=త్రిజట.

90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
=రామ కథ.

91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
=చూడామణి.

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
=ఎనభై వేలమంది.

93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
=ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
=విభీషణుడు.

95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
=మధువనం.

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
=మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
=ఆలింగన సౌభాగ్యం.

98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
=నీలుడు.

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
=నికుంభిల.

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
=అగస్త్యుడు.

101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
=ఇంద్రుడు.

102.  రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
=మాతలి.

103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
=కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
=హనుమంతుడు.

105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
=శత్రుంజయం.

106.  శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
=స్వయంగా తన భవనమునే యిచ్చెను.

107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
=బ్రహ్మ.

108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన  బహుమతి ఏమిటి?
=తన మెడలోని ముత్యాలహారం. 

Wednesday, 13 May 2020

నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం

శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా.,పరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు.

అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకొనే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండదీపారాధన మాత్రమే వాడతారు. మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు.

సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార(ఇతర)దేవతల దర్శనం చేసి పరమశివున్ని దర్శించుకుంటాము. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి. 

పరమ శివుడు ఏ శివాలయంలో అయిన శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతలలాగ కరచరనాదులు(విగ్రహ రూపం) లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు కానీ, లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సు పై కేంద్రీకృతం చేయాలి. 

అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది శృంగము(కొమ్ముల)నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సు పై కేంద్రీకరింఛి దర్శనం చేసుకోవాలి. నంది యొక్క పృష్ట భాగంను నిమురుచూ, శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి. 

అంతే కాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది.

కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి.
గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు.

అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్యనుంచి శివదర్శనం చేసుకోవాల్సివుంటుంది.  శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు. 

రాశి చక్రంలోని మిథున రాశి గౌరీ శంకర స్వరూపం. వృషభరాశి నందిశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృభరాశి, మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథున రాశి, వృషభరాశి కిందుగాను ఉంటుంది. ఆ కారణం వలనే శివుడు వృషభవాహనుడు, వృషభద్వజుడు అయ్యాడు. వృషభం (నందీశ్వరుడు)యొక్క వృషభ బాగాన్ని స్పృషిస్తూ శివుని దర్శించటం వల్ల విధి విహితం. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివున్ని దర్శించిన వారికీ కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణలో ఉన్నది .

అరుణాచల శివ