Wednesday, 29 April 2020

రాహుకాల నిమ్మకాయల దీపం ఎందుకు చేయాలి ?

నిమ్మకాయ దీపం అనేది కుజదోషం,కాలసర్ప దోషం, వ్యాపార, కుటుంబ, ఆర్ధిక భాదలతో సతమతం అయ్యే వారికి చక్కని తరుణోపాయం.

ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరుపినైన అమ్మవారు అనుగ్రహించి ఈతి భాదలను తొలగిస్తుంది.
నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతి దేవికి చాలా ఇష్టం .

నిమ్మకాయలతో చేసిన దండను పార్వతి దేవికి ...గ్రామ దేవతలైన మైసమ్మ , ఎల్లమ్మ ,పోచమ్మ ,  మారెమ్మ,పెద్దమ్మ, మొదలైన శక్తి దేవి అవతారాలకు మాత్రమే వేస్తారు.గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి.
ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి , సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు .

ఒక వేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు .సంసారం లో ఎప్పుడు గొడవలు ఉంటాయి , ఆర్ధిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది ,భార్య భర్త , పిల్లలు ,స్నేహితులు,బంధువుల మధ్య తగాదాలు ఎక్కువ అవుతాయి.

పార్వతి దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను దేవి వారాలుగా పరిగిణించే  మంగళవారం,శుక్రవారాల్లో రాహుకాల సమయాలలో మాత్రమే వెలిగించాలి.
మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం
3 గంటల నుండి 4:30 గంటల వరకు ...
శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు .
మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది . ఎందుకంటే మంగళ వారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది. శుక్రవారం వెలిగించే దీపం సత్వ గుణాన్ని కలిగి ఉంటుంది.

శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది .

శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగు అన్నం,లేదా పెసరపప్పు ,లేదా పానకం లేక మజ్జిగ లేక
పండ్లను దేవికి నైవేద్యము పెట్టి తరువాత సుమంగళికి ఇవ్వాలి.

కుదిరితే పసుపు , కుంకుమ , పూలు , గాజులు, జాకెట్టు ముక్క ,చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం .
తాంబూలం దానం మరియు శక్తికి తగినట్లుగా దక్షిణ ఇచ్చి సుమంగళికి నమస్కారం చేయాలి.ఇలా చేస్తే తలచిన కార్యాలు ఎటువంటి ఆటకం లేకుండా శుభప్రదంగా త్వరగా నెరవేరతాయి.
నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు గమనించవల్సిన అంశాలు:-
మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటిని ఉపయోగించాలి.
బహిష్టు సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు .

మహిళలు 4వ రోజు తల స్నానం చేసి 5 వ రోజు స్నానం చేసి నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు .
మైలతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు.
ఇంట్లో పండుగ సమయం ,పెద్దల తిధి కార్యాలు ఉన్న రోజున నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు .
పిల్లల పుట్టిన రోజునాడు ,పెళ్లి రోజున గాని నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు .

అంటే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు .
వేరే ఊరు వెళ్లినప్పుడు మిత్రుల మరియు బంధుల ఇంట్లో నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు .
ఆడపిల్లలు ,అక్క ,చెల్లిళ్ళ ఇంటికి లేదా పుట్టింటికి వెళ్లినప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు.
స్త్రీలు పట్టుచీర కట్టుకొని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్నీకార్యాలు ఎలాంటి లోపాలు లేకుడా జరిగిపోతాయి .

చీర ఎరుపు,పసుపు రంగు కలిగినవి వాడుతే మరి మంచిది.
స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి .
పొరపాటున కూడా గంజి వేసిన బట్టలను ధరించి పూజలు చేయరాదు.
ఆధునిక వస్త్రధారణతో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఫలితం లభించదు.
దీపం క్రింద తమలపాకు,లేదా ఏదేని ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయాలి.
నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత మైసాక్షి ,లోబాన్ ,సాంబ్రాణి పొగ దూపం తప్పక వేయాలి .

పూజకు ఎర్రని పూలనే ఉపయోగించాలి.
బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యం పెట్టాలి.

Wednesday, 22 April 2020

వేంకటేశ్వరస్వామి ఎందుకు ఆయుధాలు దరించకుండా మనకు దర్శనమిస్తాడు?


వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి

సింహాద అనే దైత్యుడు మహాదుష్టుడు, బ్రహ్మ గురించి తపస్సు చేసి మెప్పించి దేవదానవ, గంధర్వ, యక్ష కిన్నెరా కింపురుష మానవులందరూ తనకు ఆధీనంలో ఉండేట్లు వరం సంపాదిస్తాడు. దానితో గర్వించి అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. దేవతల మోర విన్న శ్రీనివాసుడు వారిని బ్రాహ్మణ వేషంలో తొండమానుని శరణు వేడమని సలహా ఇస్తాడు. తొండమానుడు వారికి అభయం అయితే ఇస్తాడు కానీ సింహాద గురించి తెలియక శ్రీనివాసుని శరణు వేడుతాడు. శ్రీనివాసుడు ఆ రక్కసిని మట్టుపెట్టమణి తొండమానునికి సహాయంగా తన శంఖం, చక్రం, గద, ఖడ్గం, ధనస్సులను ఇచ్చి ఆశీర్వదించి పంపుతాడు. దేవతలతో పోరాటానికి సింహాద లక్ష కోటి బలగంతో పాపనాశన తీర్ధ స్థలంలో యుద్ధం చేసాడని పురాణం చెబుతోంది.

తొండమానుడు స్వామి వారి ఖడ్గం, గద, ధనస్సుల ఆయుధాలను ఉపయోగించి ఒక 100 సార్లు తల తెన్చినా మరల బ్రతికి వచ్చేవాడు. ఆ మాయ అర్ధం కాక ఖిన్నుడైన చక్రవర్తి చెవిలో వాయుదేవుడు చక్రం ప్రయోగించమని చెబుతాడు. స్వామి వారి చక్ర మహిమతో శాశ్వతంగా ఆ దైత్యుడు మరణిస్తాడు. అలా సంహరించిన ఆయుధాలు మరల స్వామి వద్దకు వెళ్ళిపోతాయి. తొండమానుడు స్వామి వారి వద్దకు వచ్చి భక్తితో ఈ కార్యం అంతా స్వామి మహిమే అని కృతజ్ఞతలు వ్యక్తం చేస్తాడు.స్వామివారు వరం కోరుకోమనగా నీవు నాకు ఆయుధాలు అనుగ్రహించి నాకు విజయం చేకూర్చిన విషయం మనిద్దరికీ తప్ప మరెవరికీ తెలియదు, అందరికీ తెలియాలంటే నీవు ఈ రూపంలో ఆయుధాలు ధరించకుండా వుండాలి, స్వామి వారి ఆయుధాల ప్రసక్తి వచ్చినప్పుడు ఈ పర్వం అంతా వారు స్మరించి నాకు శాశ్వత కీర్తిని అనుగ్రహించమని వేడుకుంటాడు. వింత కోరిక. స్వామి వారు సరే అని చెప్పి, కానీ కలియుగంలో ఒక పుణ్యశాలి నా శంఖచక్రాలను పోలినవి చేయించి విమానాదులను నిర్మిమ్పచేస్తాడని, అప్పుడు కృత్రిమములైన శంఖ చక్రాలను తాను ధరిస్తానని చెబుతాడు.

స్వామి వారి ఆయుధాలు ఒకొక్క తీర్ధంలో వసించడం మొదలుపెడతాయి. కపిలతీర్ధమే చక్రతీర్ధం, దానిపై వరుసగా శంఖ తీర్ధ, శాంగతీర్ధం, నందక తీర్ధం, కౌమోదక తీర్ధం అని పంచాయుధ తీర్దాలున్నాయి. ఆ తీర్దాలలోనే మార్కండేయ మహర్షి శుద్ధ అన్న బ్రాహ్మణునితో స్నానం చేస్తూ వేంకటాచలం వస్తారు. భగవంతుడు ఆ ఆయుధాలను ఎవరికిచ్చిన వారు సింహాదను చంపెవారే ఎందుకంటె చంపేవి భగవంతుని శక్త్యాయుధాలు కానీ వారు కాదు కాబట్టి. వేడుకున్న దేవతలలో ఎవరో ఒకరికి అవి ఇవ్వవచ్చును కానీ పిలిపించి, అడక్కుండా అనుగ్రహించి, అతనికి కీర్తిని ఇవ్వడానికే, చేసిన భక్తి శ్రద్ధాలకు, కైన్కర్యానికి ప్రతిఫలం ఇవ్వడానికే స్వామి వారు ఈ లీల చేసారు. మనకేది మంచో, మనకేమి ఇవ్వాలో భగవంతునికి తెలుసు...మనం చోపించవలసనిదల్లా ఆయన మీద భక్తిశ్రద్ధలు.

ఆ ద్వాపరంలోని శ్రీ కృష్ణుడే నేడు వేంకటాచలం పైన ఉన్న మన శ్రీనివాసుడు.

శ్రీనివాసో రక్షతు!!
!! ఓం  నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

Saturday, 18 April 2020

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం. ఎందులోనో మీరు తెలుసుకోండి


ఇది వరకు తిరుమలలో “తొండమాన్ చక్రవర్తి” స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా.

ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట, స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి?'' అన్నాడుట. 🙏

స్వామి తొండమానుడుకి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గర లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి.

మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట. అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట.స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని.

అప్పుడు మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట. ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట.

అప్పుడు ఆ భీముడే, తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకువెళ్ళాడుట. తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, "ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం'' అని.

భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి
- కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు.
- కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు.
- అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు
- వాటి వల్ల నా సంసారం సాగుతోంది.
- నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట. ఏ పని మొదలుపెట్టినా గోవింద” నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి'' అనేవాడుట?

అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట,
వీడేమో – అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు,
నేనేమో – నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను.
ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం.

భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట.

స్వామి వారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానంలోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారట. అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్ని భీముడి భార్యకి తొడిగారుట.

స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు.
అదొక్కటే తింటారు స్వామి వారు.

Thursday, 16 April 2020

పూజ సమయంలో ఎటువంటి పువ్వులు వాడాలి ?ఏ ఏ దేవునికి ఏ ఏ పువ్వులు ఉపయోగించాలో తెలుసా ?

దేవునికి సువాసన రాని పువ్వులను, మరీ ఎక్కువగా సువాసన వచ్చే పువ్వులను ఉపయోగించకూడదు. భగవంతునికి మొగలి పువ్వులను ఎట్టిపరిస్థితులలోనూ సమర్పించ కూడదు. మొగలి పువ్వులను భగవంతునికి సమర్పించి పూజ చేసినచో వంశ వృద్ధి జరగదు. మొగలిపువ్వులను ఎందుకు ఉపయోగించ కూడదు అంటే శివరాత్రి కథలో మొగలిపువ్వు బ్రహ్మకు అనుకూలముగా అబద్ధపు సాక్ష్యం చెప్పినందువలన శివుడు మొగలిపువ్వును ఎట్టిపరిస్థితుల్లోను పూజలో ఉపయోగించ కూడదు అని శపిస్తాడు. అలాగే బంతి పువ్వులను పూజా సమయములో ఉపయోగించకూడదు, కానీ మందిరము అలంకరణకు, దర్వాజా అలంకరణకు, ఇంటి అలంకరణకు ఉపయోగించవచ్చు.

పువ్వులు దేవునికి సమర్పించినప్పుడు మంచి పుష్పములను, వడిలి పోకుండా ఉన్నవాటిని, రేకులు రాలిపోకుండా ఉన్నవాటిని, మంచి ఆకారంలో ఉన్న పుష్పములను ఉపయోగించాలి. వడలిపోయిన పువ్వులను, నలిగిపోయిన పువ్వులను, ఎవరి దగ్గరయినా అడిగి తెచ్చిన పువ్వులను, కింద రాలిన పువ్వులను పూజకు ఉపయోగించ కూడదు. పుష్పములను కాడలు తీసి దేవునికి సమర్పించాలి. పటముల అలంకరణకు మాత్రము కాడలు ఉన్నా పర్వాలేదు. కొంతమంది పువ్వుల రేకులను ఊడతీసి అక్షింతలను కలిపి సమర్పిస్తూ ఉంటారు కానీ అల ఎట్టిపరిస్థితుల్లోను చేయకూడదు.

పువ్వుల నుండి విడదీసిన రెక్కలను దీపం యొక్క అలంకరణకు ఉపయోగించవచ్చు. గులాబీలను ఉపయోగించినప్పుడు ముళ్ళు ఉన్న కాడలను జాగ్రత్తగా తుంపి ఉపయోగించాలి. ఈరోజు ఉదయము పూజ లో ఉపయోగించిన పువ్వులను సాయంత్రము పూజా సమయంలో తీయవలసిన అవసరం లేదు. మరుసటి రోజు సూర్యోదయమునకు ముందే ఆ వాడిన పువ్వులను తీసి కొత్త పువ్వులను పెట్టి భగవంతునికి దీపారాధన చేయాలి.
         
         
ఇప్పుడు ఏ దేవునికి ఎటువంటి పుష్పములను సమర్పించాలో తెలుసుకుందామా!

లలితా పరమేశ్వరి దేవి కి చంపక, కుంద, కేసర, శిరీష పుష్పం అంటే చాలా ఇష్టం అని తెలియజేయబడింది.

అమ్మవారు కదంబ వనములో సంచరిస్తూ కదంబ పుష్పాలను తన శిరోజాలకు అలంకరించుకుంటారు అని పురాణాలలో చెప్పబడింది.

శివపూజకు బిల్వం, తుమ్మి, మందార, రేలా, శంఖ పుష్పము, నాగలింగం పుష్పాలను ఉపయోగిస్తారు.

విష్ణుమూర్తికి నల్లకలువ,

అమ్మవారికి మల్లి, మందారం కనకాంబరాలు ఉపయోగిస్తారు.

ఏ భగవంతునికి ఏ పువ్వులను సమర్పించ కూడదో తెలుసుకుందామా

శివపూజకు మొగలి పువ్వులు, తీగ మల్లె పువ్వులను,

విష్ణు పూజకు ఉమ్మెత్త పువ్వులను,

స్త్రీ దేవతలు పూజలకు జిల్లేడు పువ్వులను, పారిజాతాలను, దుర్వారాలను వాడరు.

సూర్యుని పూజకు నందివర్ధనాలు,

విఘ్నేశ్వరుని పూజకు తులసి దళాలను ఉపయోగించకూడదు.

శ్రీ హరి పూజకు విప్ప పూలు, అశోక పుష్పాలు, గోరింట పుష్పాలు, వేప పువ్వులు, విష్ణుక్రాంత పువ్వులు,

వాయిలి పువ్వులు, పెద్ద గన్నేరు పువ్వులు, మందార పువ్వులు, మొగ్గ మల్లెలు, దత్తూర పువ్వులు, అవిశె పువ్వులు, డోమ్మడోలు పువ్వులు ఉపయోగించకూడదు.

ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైన పుష్పాలను శ్రీహరికి సమర్పిస్తే పుణ్య ప్రాప్తి కలుగుతుంది.

చైత్ర మాసములో కమలాలు, జాజులు, సంపంగి పువ్వులు, బిల్వ పత్రాలు,

ఆషాడమాసములో కమలాలు, కదంబ పుష్పాలు,

శ్రావణ మాసంలో అవిసె పూలు, దుర్వారాలు,

భాద్రపద మాసంలో సంపెంగలు, మల్లెలు, సింధూరాలు,

ఆశ్వయుజ మాసము లో మల్లెలు, తీగ మల్లెలను,

కార్తీకంలో కమలాలు, సంపంగి పుష్పాలను,

మార్గశిరమాసంలో బకుల పుష్పాలు,

పుష్యమాసంలో తులసి,

మాఘ, పాల్గుణ మాసములలో అన్ని రకాల పుష్పాలను శ్రీహరికి సమర్పించి పూజ చేయడం వలన పుణ్య ప్రాప్తి కలుగుతుంది.

సాధారణముగా చెట్టు నుంచి కోసిన పుష్పాలను జలంతో కడిగి పూజకు ఉపయోగిస్తాము. కానీ కొన్ని పుష్పములను కోసిన తర్వాత కొన్ని రోజుల వరకు నిల్వ ఉన్న కూడా పూజలో ఉపయోగించ వచ్చును.

కలువ పువ్వుల ను ఐదు రోజుల వరకు,

కమలాలను పదకొండు రోజుల వరకు నిల్వ ఉన్న కూడా పూజకు ఉపయోగించవచ్చు అని

Wednesday, 15 April 2020

సుబ్రహ్మణ్యస్వామి దగ్గర కోడిపుంజు ఎందుకు

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వాహనం ఏది అంటే నెమలి అని ఠక్కున చెప్పేస్తారు. కానీ
ఆయన చిత్రాల్లో ఓ మూలన కోడిపుంజు కూడా కనిపిస్తుంది. మన దగ్గర తక్కువే కానీ... తమిళనాడులో అయితే కార్తికేయుని ఆలయాలలో కోడిపుంజులని పెంచుతుంటారు.

ఇంతకీ కార్తికేయునికీ, కోడిపుంజుకీ మధ్య అనుబంధం ఏమిటి? ఈ విషయం తెలియాలంటే ఆయన జన్మవృత్తాంతాన్ని ఓసారి గుర్తుచేసుకోవాల్సిందే!

దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి మరణించడంతో శివుడు తీవ్ర వైరాగ్యంలో మునిగిపోయాడు. ఒక పక్క శివునికి భార్య లేదు, మరో వివాహం చేసుకునే స్థితిలోనూ లేడు. ఇలాంటి సమయంలో ఆయనకి సంతానం కలిగే అవకాశం లేదని ముల్లోకాలూ
భావించాయి.

తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసులు ఇదే అదనుగా భావించారు. తమకి శివుని కుమారుని చేతిలో తప్ప అన్యుల చేతిలో మరణం రాకూడదన్న వరాన్ని పొందారు.

వరాన్ని పొందిన ఆ రాక్షసులు ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఏకంగా స్వర్గం మీదకే దండెత్తి ఇంద్రుని జయించారు. ఇలాంటి పరిస్థితిలో దిక్కు తోచని దేవతలు శివుని వైరాగ్యాన్ని భగ్నం చేయమంటూ ఆ మన్మథుని వేడుకున్నారు.

కానీ ఆ ప్రయత్నం చేయబోయిన మన్మథుడు, శివుని కోపానికి గురై భస్మమైపోయాడు. ఆ సమయంలో శివుని నుంచి వెలువడిన కాంతిపుంజమే కార్తికేయునిగా అవతరించింది.

శివుని కాంతిపుంజాన్ని అగ్నిదేవుడు సైతం భరించలేకపోయాడు. ఆయన దానిని గంగానదిలో విడిచిపెట్టాడు. అలా గంగానదిలోని రెల్లు పొదల మధ్య జన్మించిన కార్తికేయుని, ఆరుగురు అక్కచెల్లెళ్లు (కృత్తికలు) పెంచారు.

కొన్నాళ్లకి కార్తికేయుడు తన తల్లిదండ్రులను చేరుకున్నాడు. తను అవతరించిన కారణాన్ని తెలుసుకున్న కార్తికేయుడు, తారకాసురుని మీద యుద్ధానికి బయల్దేరాడు.

ఏకాదశ రుద్రులు తోడురాగా, తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలాయుధాన్ని చేపట్టి కార్తికేయుడు యుద్ధానికి బయల్దేరాడు.

తమిళనాడులోని తిరుచెందూరు ప్రాంతం వద్ద కార్తికేయునికీ, రాక్షసులకీ మధ్య ఘోర యుద్ధం జరిగిందని చెబుతారు. అక్కడి సముద్రతీరాన శూరపద్ముడూ, తారకాసురుడూ కలిసి కార్తికేయుని ఎదిరించే సాహసం చేశారు.

కార్తికేయుడు మరెవ్వరో కాదు సాక్షాత్తూ ఆ శివుని కుమారుడే అన్న విషయం శూరపద్మునికి తెలిసిపోయింది. కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. పైగా దేవుని సైతం ఎదిరించాలనిపించే రాక్షసప్రవృత్తి. దాంతో రొమ్ము విరుచుకుని కార్తికేయుని మీదకు యుద్ధానికి బయల్దేరాడు. కానీ యుద్ధంలో తన సైనికులు, సహచరులంతా ఒకొక్కరే మరణించడం చూసి శూరపద్మునికి భయం పట్టుకుంది.

శూరపద్ముడు  ఒక మామిడిచెట్టు రూపాన్ని ధరించి కార్తికేయునికి నుంచి దాక్కొనే ప్రయత్నం చేశాడు. కానీ ఆ షణ్ముఖుని కంటి నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు కదా! కార్తికేయుడు తన వేలాయుధంతో ఆ మామిడిచెట్టుని రెండుగా చీల్చాడట.

దాంతో చెట్టులోని సగభాగం నెమలిగానూ, రెండో సగం కోడిపుంజుగానూ మారిపోయాయి.

నెమలిని తన వాహనంగానూ, కొడిపుంజుని తన ధ్వజంగానూ మార్చుకున్నాడు కార్తికేయుడు. అలా
ఆయన పక్కకు కోడిపుంజు చేరింది.

Tuesday, 14 April 2020

కాశీలోని కొన్ని వింతలు విశేషాలు

1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు కంపుకొట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.

3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్యపోయ్యారు.

5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?

6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు.

7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

8. కాశీి విశ్వేశ్వరునికి శవభస్మలేపనంతో పూజ ప్రారంభిస్తారు.

9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

11. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

13. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి......

ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :

1) దశాశ్వమేధ ఘాట్:
బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్:
ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్:
చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్:
సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్:
పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్:
ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్:
ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్:
ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్:
గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్:
తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.

11) హనుమాన్ ఘాట్:
ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది
ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్:
పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్:
సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్:
ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.
ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్:
నారదుడు లింగం స్థాపించాడు.

16)చౌతస్సి ఘాట్:
ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.
ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్ ఘాట్:
ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18)అహిల్యా బాయి ఘాట్
ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ
విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.

విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.

అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు